Prohibited Lands | నిషేధిత భూములపై తర్జన భర్జన.. సీసీఎల్ఏకు చేరుకున్న జాబితా!

నిషేధిత భూముల జాబితా (22-ఏ)ను పక్కాగా రూపొందించాలని తెలంగాణ హైకోర్టు రెవెన్యూ శాఖను ఆదేశించింది. గడువు విధించడంతో రెవెన్యూ శాఖ జాబితా రూపకల్పనలో నిమగ్నమై ఉంది. నవంబర్ మొదటి లేదా రెండో వారంలో సవివరంగా నిషేధిత భూముల వివరాలను భూ భారతి, సబ్ రిజిస్ట్రార్ పోర్టల్‌లో పొందుపర్చనున్నారని తెలుస్తున్నది

  • By: Tech |    telangana |    Published on : Oct 31, 2025 7:21 AM IST
Prohibited Lands | నిషేధిత భూములపై తర్జన భర్జన.. సీసీఎల్ఏకు చేరుకున్న జాబితా!

హైదరాబాద్, విధాత ప్రతినిధి: రాష్ట్రవ్యాప్తంగా నిషేధిత భూముల జాబితా ఒక కొలిక్కి వచ్చింది. అయితే రంగారెడ్డి జిల్లాలో భూములపై రెవెన్యూ శాఖ తర్జన భర్జన పడుతోందని సమాచారం. గతంలో మాదిరి కాకుండా నిషేధిత జాబితాలో భూములను చేరిస్తే సహేతుక కారణాలు స్పష్టంగా వెల్లడించాలని, ఆ వివరాలు భూ భారతి, సబ్ రిజిస్ట్రార్ వెబ్ పోర్టల్‌లో కన్పించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) ఆధ్వర్యంలోని కమిటీ అన్ని రికార్డులనూ పరిశీలిస్తున్నది. ఇదిలా ఉంటే నిషేధిత జాబితా నుంచి భూములు తొలగించాలని కోర్టులు ఆదేశాలు ఇస్తున్నా రంగారెడ్డి జిల్లాలో అమలు చేయడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తమకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా.. లేనట్లయితే మరో రకంగా జిల్లా అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైవాళ్లు చెబితేనే పని అవుతుందని చెప్పి తప్పించుకుంటున్నారని అంటున్నారు. ఇలాంటి సమస్యలు పరిష్కరించేందుకు 30 శాతం వాటాలు అడుగుతున్నారనే విమర్శలున్నాయి.

నిషేధిత భూముల జాబితా (22-ఏ)ను పక్కాగా రూపొందించాలని తెలంగాణ హైకోర్టు రెవెన్యూ శాఖను ఆదేశించింది. గడువు విధించడంతో రెవెన్యూ శాఖ జాబితా రూపకల్పనలో నిమగ్నమై ఉంది. నవంబర్ మొదటి లేదా రెండో వారంలో సవివరంగా నిషేధిత భూముల వివరాలను భూ భారతి, సబ్ రిజిస్ట్రార్ పోర్టల్‌లో పొందుపర్చనున్నారని తెలుస్తున్నది. ఈ మేరకు జిల్లాల నుంచి జాబితాను తెప్పించుకుని సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఈ జాబితా తయారీ కోసం సీసీఎల్ఏ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు అయ్యింది. ఈ కమిటీలో రిటైర్డ్‌ డిస్ట్రిక్ట్ జడ్జ్‌, సర్వే అండ్ సెటిల్‌మెంట్‌ డైరెక్టర్ ఉన్నారు. త్రిసభ్య కమిటీ జిల్లాల నుంచి వచ్చిన భూముల వివరాలను వడపోస్తున్నది. ఒక్క రంగారెడ్డి జిల్లా విషయంలోనే ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పదిహేను వేల ఎకరాల వరకు అదనంగా చేర్చుతుండటంతో మొత్తం రెవెన్యూ, సర్వే రికార్డులను జల్లెడపడుతున్నారని సమాచారం. రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్ఓఆర్)తో పాటు సేత్వార్‌లో ఆ వివరాలను పరిశీలిస్తున్నారు.

ఈ రెండింట్లో తేడా ఉన్నట్లయితే 1954 రికార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. నిజాం నవాబు నుంచి తెలంగాణ ప్రాంతం విముక్తి అయిన తరువాత 1954 లో భూముల రికార్డులను రూపొందించిన విషయం తెలిసిందే. కోర్టులు కూడా ప్రత్యేక సందర్భాలలో 1954 నాటి రికార్డును పరిగణలోకి తీసుకుని తీర్పులు ఇస్తున్నాయి. ఇప్పటి వరకు నిషేధిత భూముల జాబితా విషయంలో స్పష్టత లేదు. రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెళ్లిన సందర్భంలో పలువురికి ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే అందులో సహేతుకమైన కారణాలు మాత్రం వెల్లడించడం లేదు. ఏ కారణాలతో నిలిపివేశారనేది తెలియకపోవడం మూలంగా విక్రయదారులు, కొనుగోలుదారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఆర్థికంగా నష్టపోతున్నారు, లావాదేవీలు నిలిచిపోతున్నాయి. దీనికి తెర దించేందుకు సహేతుక కారణాలను భూ భారతి, సబ్ రిజిస్ట్రార్ పోర్టల్‌లో స్పష్టం చేయాలని హైకోర్టు ఆదేశించింది. నిషేధిత జాబితాలో ఉంటే ఫ‌లానా కారణాలతో రిజిస్ట్రేషన్ కు అనుమతించడం లేదని సబ్ రిజిస్ట్రార్లు లేదా తహశీల్దార్లు వెల్లడిస్తారు.

Read more :  నిషేధిత భూములు ఒక కోటి ఎకరాలు?…సిద్ధం చేస్తున్న రెవెన్యూ యంత్రాంగం

హైకోర్టు ఆదేశాలు బేఖాతర్!
నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నా రంగారెడ్డి జిల్లాలో అమలు కావడం లేదు. ఎందుకు తొలగించడం లేదని జిల్లా అధికారులను ప్రశ్నిస్తే పొంతన లేకుండా సమాధానాలు చెబుతున్నారని భూ య‌జ‌మానులు వాపోతున్నారు. పై వాళ్లు చెబితే పని అవుతుందని చెబుతున్నారంటున్నారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తరువాత కూడా పై వాళ్ల పేర్లు ఎందుకు చెబుతున్నారని ప్రశ్నిస్తే సమాధానం లేదని బాధితులు అంటున్నారు.