Secretariat | సెక్ర‌టేరియ‌ట్ క్యాంటీన్‌లో.. నిలువు దోపిడీ! ఉద్యోగులు, సంద‌ర్శ‌కుల జేబుల‌కు చిల్లు

స‌చివాల‌యం ఆవ‌ర‌ణ‌లో రెండు, బ‌య‌ట ఒక క్యాంటిన్ ను మాజీ సీఎస్ శాంతి కుమారి కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కాంగ్రెస్ నాయ‌కుడికి కేటాయించారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

Secretariat | సెక్ర‌టేరియ‌ట్ క్యాంటీన్‌లో.. నిలువు దోపిడీ! ఉద్యోగులు, సంద‌ర్శ‌కుల జేబుల‌కు చిల్లు
  • ఉద్యోగులు, సంద‌ర్శ‌కుల జేబుల‌కు చిల్లు
  • భోజ‌నం ధ‌ర రూ. 100, అధిక‌ధ‌ర‌ల‌కే టీ, టిఫిన్స్
  • ప్రైవేటు వ్య‌క్తుల చేతుల్లో మూడు క్యాంటిన్లు
  • కో ఆప‌రేటివ్ సొసైటీకి అప్ప‌గించాల‌ని ఉద్యోగుల డిమాండ్
  • అప్పుడు ప్ర‌భుత్వం నుంచి రాయితీ పొందే అవ‌కాశం
  • కాంగ్రెస్ నేతల చేతుల్లో క్యాంటీన్లు..

హైద‌రాబాద్‌, (విధాత‌) : స‌చివాల‌యంలో ఉద్యోగుల‌కు, సంద‌ర్శ‌కుల‌కు అక్క‌డి క్యాంటిన్ల‌లో జేబులకు చిల్లులు ప‌డుతున్నాయి. క్యాంటిన్ల‌లో భోజ‌నాలు, టీ, టిఫిన్లు అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యిస్తున్నారు. గ‌తంలో కో ఆప‌రేటివ్ సొసైటీ నిర్వ‌హ‌ణ‌లో క్యాంటిన్లు ఉన్న‌ప్పుడు నామ‌మాత్ర‌పు ధ‌ర‌ల‌కే ఫుడ్ దొరికేద‌ని.. ఇప్పుడు మాత్రం ప్రైవేట్ నిర్వాహ‌కులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నార‌ని వారు ఆరోపిస్తున్నారు. సెక్ర‌టేరియ‌ట్ ఉద్యోగుల స‌హ‌కార క్యాంటిన్ కు ఘ‌న‌మైన చ‌రిత్ర ఉంది. వేలమంది ఉద్యోగుల ఆక‌లి తీర్చింది. ఉమ్మ‌డి రాష్ట్రంలో న‌లుమూల‌ల నుంచి వ‌చ్చే సంద‌ర్శ‌కులు, జిల్లాల్లో ప‌నిచేసే ఉద్యోగులు కూడా క్యాంటిన్ లో త‌మ‌కు న‌చ్చిన ఆహారం త‌క్కువ ధ‌ర‌ల‌కే కొనుగోలు చేసేవారు.

To Read :  vidhaatha Epaper

ప్ర‌త్యేక రాష్ట్రంలో అంతా ధ్వంసం
ప్ర‌త్యేక రాష్ట్రం వ‌చ్చిన త‌రువాత కో ఆప‌రేటివ్ సొసైటీల‌కు క్యాంటిన్ల నిర్వ‌హ‌ణ‌ను ర‌ద్దు చేశారు. అదేమంటే అవ‌స‌రం లేద‌ని బుకాయించారు. ప్ర‌స్తుతం కొత్త స‌చివాల‌యంలో ప్రైవేటు క్యాంటిన్ల‌కు దుకాణం తెరిచి ప‌ట్ట‌ప‌గ‌లు ఉద్యోగులు, సంద‌ర్శ‌కుల జేబులు క‌త్తిరిస్తున్నారన్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. క్యాంటిన్ లో ధ‌ర‌లు చూసి ఉద్యోగులు జేబులు త‌డుముకోవాల్సిన దుస్థితి నెల‌కొన్న‌ది. గ‌త బీఆర్ఎస్ పాల‌కుల నిర్వాకాన్ని ప్ర‌స్తుత ప్ర‌భుత్వం కూడా కొన‌సాగిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

ఉమ్మ‌డి పాల‌న‌లో స‌హకార సంఘం ఆధ్వ‌ర్యంలోనే..
ఉమ్మ‌డి ఏపీ స‌చివాల‌యంలో ద‌శాబ్దాల‌పాటు ఉద్యోగుల స‌హకార సంఘం ఆధ్వ‌ర్యంలో క్యాంటిన్ నిర్వహించేవారు. ఉద‌యం టిఫిన్, మధ్యాహ్నం రైస్ ఐట‌మ్స్‌, సాయంత్రం టిఫిన్స్ ను తక్కువ ధరకే అందుబాటులో ఉండేది. ఈ క్యాంటిన్ లో సుమారు పాతిక నుంచి ముప్పై మంది వ‌ర‌కు సిబ్బంది ప‌నిచేసేవారు. ప్ర‌తినిత్యం ర‌ద్దీగా ఉండేది. విభ‌జ‌న త‌రువాత కొద్ది నెల‌ల పాటు న‌డిపారు. ఓటుకు నోటు కేసు త‌రువాత స‌చివాల‌యం నుంచి ఏపీ ప్ర‌భుత్వం త‌న కార్యాల‌యాల‌ను ఖాళీ చేసి విజ‌య‌వాడ‌కు వెళ్లిపోయింది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు స‌హ‌కార క్యాంటిన్ తెరుచుకోనేలేదు.

అసోసియేషన్ నాయకుల ఫిర్యాదులు
అప్ప‌టి ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు తెలంగాణ సెక్రెటేరియ‌ట్ ఎంప్లాయిస్ అసోసియేష‌న్ నాయ‌కులు క్యాంటిన్ పై లేనిపోని ఫిర్యాదులు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. క్యాంటిన్ లో త‌క్కువ ధ‌ర‌కు అల్ఫాహారం ఇస్తున్నార‌ని.. క‌రెంటు, నీళ్లు ఉచితంగా వాడుకుంటున్నార‌ని వారు కేసీఆర్ కు నూరి పోశారట. దీంతో ఉద్యోగులు ప‌నిచేయ‌డం లేద‌ని కేసీఆర్ చెవిలో ఊదారని సమాచారం. దీంతో క్యాంటిన్ మూసేయాలని ఆయ‌న మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు.

ప్రైవేట్ క్యాంటిన్లు ప్రత్యక్షం
దీంతో స‌చివాల‌యంలో మూడు నాలుగు చోట్ల ప్రైవేటు క్యాంటిన్ల‌ను తెరిపించి అసోయేష‌న్ నాయ‌కులు అందినంత కాడికి దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ లోపే స‌చివాల‌యం వాస్తు ప్ర‌కారం లేద‌ని నేల‌మ‌ట్టం చేసి.. కొంతకాలం తర్వాత కొత్తడి కట్టారు. కొత్త సచివాలయం బయట నుంచి బాగున్నా ఉద్యోగుల‌కు స‌రిప‌డా గ‌దులు లేవన్న విమర్శలు ఉన్నాయి. పైన ప‌టారం లోన లొటారం అన్న మాదిరిగా నిర్మించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫొటోలు తీసుకోవ‌డానికి త‌ప్పితే ఉద్యోగులు ప‌నిచేసేందుకు ఏమాత్రం సౌక‌ర్యంగా లేదన్న విమర్శ ఉంది. ప్ర‌స్తుతం ఎనిమిది అంత‌స్తులు ఉండ‌గా, మ‌రో రెండు అంత‌స్తులు అద‌నంగా నిర్మాణం చేస్తే త‌ప్ప అంద‌రూ కూర్చునేందుకు వీలుండ‌ద‌ని ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. భ‌విష్య‌త్తులో అద‌నంగా ఉద్యోగుల‌ను నియ‌మిస్తే భ‌వ‌నం బ‌య‌ట రేకుల షెడ్లు వేసి కూర్చోబెట్టాల్సిన దుస్థితి ఉంది.

క్యాంటిన్ నిర్మాణం మరిచారు..
కొత్త స‌చివాల‌యం నిర్మించిన త‌రువాత ఉద్యోగుల కోసం క్యాంటిన్ ప్ర‌త్యేకంగా నిర్మించడం మ‌రిచిపోయారు. క్యాంటిన్ కు ప్ర‌త్యేకంగా ఏర్పాట్లు చేయాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌డంతో త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో స‌చివాల‌యం లోప‌ల రెండు గ‌దుల‌ను కేటాయించారు. అవి కూడా చిన్న చిన్న గ‌దులే. గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక రూమ్‌, మూడో అంత‌స్తులో మ‌రో రూమ్ కేటాయించారు. ప‌దిహేను మంది వ‌ర‌కు వ‌స్తే కిట‌కిట‌లాడుతుంది. ఇరుగ్గా ఉంటోంది. స‌చివాల‌యం బ‌య‌ట కూడా క్యాంటిన్ ను న‌డుపుతున్నారు. ఈ మూడు క్యాంటిన్లు కాంగ్రెస్ స‌ర్కార్ వ‌చ్చే వ‌ర‌కు తెలంగాణ సెక్రెటేరియ‌ట్ అసోసియేష‌న్ ఆధీనంలో న‌డిచేవి. అద్దె డ‌బ్బులు ఎవ‌రికి చెల్లించారో, ఎవ‌రూ తీసుకునేవారో అంద‌రికీ తెలుసు కాని ఎవ‌రూ నోరు మెదపడం లేదు.

అద్దె డబ్బులు వాటాలు వేసి పంచుకున్నారా..
ఈ అద్దె డ‌బ్బుల‌ను అసోసియేష‌న్ నాయ‌కులు ప్ర‌తి నెలా వాటాలు వేసుకుని పంచుకొనేవారని ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత క్యాంటిన్ల‌పై కొడంగల్ కు చెందిన కాంగ్రెస్ నాయ‌కుల క‌న్ను ప‌డింది. ఈ మూడు క్యాంటిన్ల‌ను కొడంగ‌ల్ కు చెందిన ఒక కాంగ్రెస్ నాయ‌కుడు నడుపుతున్నట్టు తెలుస్తున్నది. ఈ క్యాంటిన్ లో ఛాయ్ ధ‌ర‌ రూ.10, ఇడ్లీ ప్లేట్ రూ.30, భోజ‌నం రూ.100, వెజ్ బిర్యానీ రూ.60 చొప్పున విక్ర‌యిస్తున్నారు. ఈ ధ‌ర‌ల‌ను చూసి స‌చివాల‌య ఉద్యోగులు భీతిల్లిపోతున్నారు. మ‌ధ్యాహ్నం ఇంటి నుంచి భోజ‌నం తెచ్చుకోని ముగించేస్తున్నారు.

సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తే సబ్సిడీ
క్యాంటిన్ కో ఆప‌రేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తే సరుకులు సబ్సిడీ మీద తీసుకొవచ్చని.. అప్పుడు తక్కువ ధరలకే ఆహారపదార్థాలు విక్రయించవచ్చని ఉద్యోగులు చెబుతున్నారు. సందర్శకులు భోజనం కోసం బయటకు వెళ్తే తిరిగి రావ‌డం స‌మ‌యం వృధా అవుతుంద‌ని.. మ‌ళ్లీ పాస్ తీసుకోవాల్సి వ‌స్తుంద‌నే భ‌యంతో రూ.100 చెల్లించి రుచి, ప‌చి లేని భోజ‌నం చేస్తున్నారు. ప్ర‌త్యేకంగా క్యాంటిన్ ను స‌చివాల‌యం ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేయాల‌ని ఉద్యోగులు ప్ర‌భుత్వం పై ఒత్తిడి పెంచారు. ఎక్క‌డో ఒక ద‌గ్గ‌ర స్థ‌లం కేటాయించాల‌ని కోరుతున్నారు. ఆ స్థ‌లంలో క్యాంటిన్ ఏర్పాటు చేసుకుని త‌క్కువ ధ‌ర‌కు అల్ఫాహారం, తినుబండారాల‌ను త‌యారు చేసుకుంటామ‌ని చెప్పారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో న‌డిపిన విధంగా క్యాంటిన్ ను అంద‌రికి అందుబాటులో ఉంచుతామ‌ని తెలిపారు. ఇప్ప‌టికే స‌చివాల‌య అసోసియేష‌న్‌, ఉద్యోగుల స‌హకార ప‌ర‌ప‌తి సంఘం ఎన్నిక‌లు ఇటీవ‌లే పూర్త‌య్యాయి. త్వ‌ర‌లో క్యాంటిన్ కో ఆప‌రేటివ్ సొసైటీ ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు. ఈ ఎన్నిక‌లు పూర్త‌యిన త‌రువాత క్యాంటిన్ ను పూర్తి స్థాయిలో పున‌రుద్ధ‌రించ‌నున్నారు. పున‌రుద్ధ‌రిస్తే రూ.20కే వెజ్ బిర్యానీ ల‌భించే అవ‌కాశ‌ముంది.

మాజీ ప్ర‌భుత్వ కార్యదర్శి పాత్ర..
స‌చివాల‌యం ఆవ‌ర‌ణ‌లో రెండు, బ‌య‌ట ఒక క్యాంటిన్ ను మాజీ సీఎస్ శాంతి కుమారి కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కాంగ్రెస్ నాయ‌కుడికి కేటాయించారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బంధువు ఫోన్ చేయ‌గానే, మ‌రో మాట మాట్లాడ‌కుండా, ఉద్యోగుల‌తో సంప్ర‌దించ‌కుండా ఏక‌ప‌క్షంగా మూడు క్యాంటిన్ల‌ను ధారాద‌త్తం చేశారంటున్నారు. ఈ మూడు క్యాంటిన్ల‌ను స‌చివాల‌యం ఉద్యోగుల‌కు కేటాయిస్తారా.. పేచి పెడ‌తారా లేదా అనేది సొసైటీ ఎన్నిక‌లు జ‌రిగితే కానీ స్ప‌ష్టం కాదు. ప్ర‌స్తుతం తెలంగాణ స‌చివాలయంలో అన్ని విభాగాల్లో సుమారు 3వేల వ‌ర‌కు ఉద్యోగులు విధులు నిర్వ‌ర్తిస్తున్నారు