Indigo Flight | ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం

హైదరాబాద్-శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి పక్షి తగిలి ప్రమాదం, 162 మంది ప్రయాణికులు సురక్షితం.

విధాత, హైదరాబాద్ : ఇటీవల విమానాలకు వరుస ప్రమాదాలు ఎదురవుతున్న క్రమంలో మరో ఇండిగా విమానానికి ప్రమాదం తప్పింది. హైదరాబాద్-శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ సమయంలో ఇండిగో విమానానికి పక్షి తగిలింది. పైలట్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. పైలట్ విమానాన్ని చాకచక్యంగా ల్యాండింగ్ చేశాడు.

దీంతో విమానంలోని 162 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో అటు ప్రయాణికులతో పాటు ఎయిర్‌పోర్ట్ అధికారులు కూడా ఊపిరిపీల్చుకున్నారు. ఇటీవల విజయవాడ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఒక్కసారిగా ఓ పక్షి వేగంగా వచ్చి ఇంజిన్ భాగాన్ని ఢీకొట్టింది. పైలట్ అప్రమత్తమై వెంటనే విమానాన్ని నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్‌పోర్ట్ అధికారులు ఇప్పటికే బర్డ్ కంట్రోల్ యూనిట్ ఏర్పాటు చేసి అల్ట్రాసోనిక్ పరికరాలు, లేజర్ లైట్స్, సైరన్లు ఉపయోగిస్తున్నప్పటికీ..పక్షులు విమానాలకు తాకకుండా సమస్యను నివారించలేకపోతున్నారు.