KTR Arrest News| దసరా తర్వాత కేటీఆర్ అరెస్టు : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
ఫార్ములా ఈ కారు రేసు కేసులో నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దసరా తర్వాత అరెస్టు అయ్యే అవకాశముందని టీపీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ అక్రమాలపై స్పష్టమైన ఆధారాలున్నాయని..ఆయన అరెస్ట్ తప్పదన్నారు.

విధాత : ఫార్ములా ఈ కారు రేసు కేసులో(Formula E race scam) నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) దసరా తర్వాత అరెస్టు(Arrest) అయ్యే అవకాశముందని టీపీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్( PCC Mahesh Kumar Goud) సంచలన కామెంట్స్ చేశారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియా చిట్ చాట్ లో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ అక్రమాలపై స్పష్టమైన ఆధారాలున్నాయని..ఆయన అరెస్ట్ తప్పదన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై చట్టబద్దంగా పోతున్నామని..గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అన్నిటిపైన సీబీఐ విచారణ జరిపితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారన్నారు.
ఎన్నికల్లో వాళ్ళు ఓడి పోతారని తెలిసి రెండు రోజుల ముందు అన్ని ఆధారాలు ధ్వంసం చేశారన్నారు. ఎన్నికలకు ముందు 14 రోజుల ఫోన్ ట్యాపింగ్ రికార్డు మాత్రమే మాదగ్గర ఉందన్నారు. ప్రభుత్వం మారాక టెలికాం సంస్థలు రికార్డింగ్ సంబంధించిన వివరాలు మా ప్రభుత్వానికి ఇవ్వడంతో వాళ్ళు దొరికి పోయారని తెలిపారు. నా ఫోన్ తో పాటు రేవంత్ రెడ్డి ఫోన్లను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్ల పాటు ట్యాపింగ్ చేసిందని..నేను వాడిన జియో సిమ్ కార్డు నెంబర్ జియోసంస్థకు గత ప్రభుత్వం ఇచ్చిందన్నారు. జియో సంస్థకు రాసిన లేఖ కూడా దొరికింది అని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా వ్యూహరచన చేసి కేసీఆర్, కేటీఆర్ గతంలో జరిగిన ఎన్నికల్లో గెలిచారన్నారు.
ఆక్రమణదారులకే హైడ్రాతో భయం
హైడ్రా తో సామాన్యుడికి ఇబ్బంది లేదని..కబ్జా చేసిన వారికే హైడ్రాతో ఇబ్బందులు అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వ భూమి పోకుండా ఉండేలా హైడ్రా పని చేస్తుందని కితాబునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు హైడ్రా కూలగొట్టడానికి వెళ్లిందని..కానీ అక్కడి స్థానికులు కోర్టు ఆర్డర్ తీసుకరావడంతో ఆగిపోయిందన్నారు. తనమన భేదం లేకుండా హైడ్రా పని చేస్తుందన్నారు.
జూబ్లీహిల్స్ టికెట్ కోసం తీవ్ర పోటీ
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం చాలా మంది కాంగ్రెస్ నాయకులు రేసులో ఉన్నారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సీఎన్. రెడ్డి, బాబా ఫసియుద్దీన్ , నవీన్ యాదవ్ ,బొంతు రామ్మోహన్ సహ పలువురు జూబ్లీ హిల్స్ టికెట్ అడుగుతున్నారని వెల్లడించారు. స్థానికులకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ ఉందన్నారు. మంత్రుల కమిటీ, సర్వే ఫలితాల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఖాతాలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది అని గుర్తు చేశారు.
కవితది ఆస్తుల పంచాయితీ
బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నాలుగు ముక్కలు అయ్యిందని..ఆ పార్టీ మళ్ళీ పునర్జీవం పోసుకోదని మహేష్ గౌడ్ అభిప్రాయపడ్డారు.
ఏం చూసి బీఆర్ఎస్ ను ప్రజలు ఆదరిస్తారు అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓడాక ప్రతిపక్ష నేతగా తన బాధ్యతలను విస్మరించిన కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారన్నారు. కవితది ఆస్తుల పంచాయతీ మాత్రమేనని..కాంగ్రెస్తో కవితకు సంబంధం లేదన్నారు. కవితకు ప్రజల్లో ఏం ఇమేజ్ ఉందని..ఆమెను పార్టీలో చేర్చుకోవాలని ప్రశ్నించారు. దోపిడి చేసిన వారిని ప్రజలు ఎందుకు ఆదరిస్తారు అని విమర్శించారు.
బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ది కరువు
బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి బీజేపీ నాయకులకు ఉంటే ఒక్కరోజులో బీసీ బిల్లుకు కేంద్ర ఆమోదం తెలపవచ్చని మహేష్ గౌడ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి సామాజికవర్గం అయినప్పటికీ బీసీ కొరకు గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా, సీఎంగా చూశాననని.. వారిలో మార్పు ఏమి లేదు అన్నారు. పీసీసీ పాదయాత్ర సీఎం రేవంత్ రెడ్డికి, ఇంచార్జ్ కి తెలియకుండా చేశారని కొందరు గతంలో అవాస్తవమైన ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉంటారు అని..తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపులో రేవంత్ రెడ్డి పాత్ర కీలకమైందన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం ఏఐసీసీ పరిధిలో ఉందని..హై కమాండ్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుంది అని స్పష్టం చేశారు.