Warangal : క్రికెట్ విజయోత్సవంలో ‘మత’ విద్వేషం.. ఓ మతం జెండా పెట్టిన కొందరు.. అడ్డుకున్న మరో వర్గం
వరంగల్‌లో క్రికెట్ విజయోత్సవంలో 'మత' విద్వేషం! పోచమ్మ మైదాన్ వద్ద జెండాల వివాదం.. ఇరువర్గాల నినాదాలతో ఉద్రిక్తత. లాఠీఛార్జ్ చేసిన పోలీసులు.
- వరంగల్ సిటిలో అర్ధరాత్రి ఉద్రిక్తత
- ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
- ఘటన ఏదైనా ‘మతం రంగు’ పూత
విధాత, ప్రత్యేక ప్రతినిధి: టీ20 ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ పోటీలో ఇండియా టీమ్ ప్రత్యర్ధి న్యూజీలాండ్ జట్టు పై భారీ పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించింది. ఈ విజయం దేశానికే కాకుండా క్రికెట్ అభిమానులకు నిజంగానే పండుగ రోజుగా మారింది. అభిమానుల్లో గొప్ప ఉత్సాహాన్ని నింపింది. ఈ గెలుపు సందర్భంగా వరంగల్ నగరంలోని క్రికెట్ అభిమానులు ఆదివారం రాత్రి రోడ్ల పైకి చేరి సంబురాలు చేసుకున్నారు. కొందరు అభిమానులు టపాసు కాల్చితే, మరికొందరు జాతీయ జెండాను చేతబట్టుకుని ద్విచక్రవాహనాలపై ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ సెంటర్ కు చేరుకుని సంబురాలు చేసుకున్నారు. ఇక్కడి మేరకు సాఫీగానే సాగినప్పటికీ అనూహ్యంగా ఈ విజయోత్సవం మతం రంగు పులుముకుని కొద్ది సేపు ఉద్రిక్తతలకు దారితీసింది.
విజయమొక్కటే.. రెండు ‘మత’ నినాదాలు
విజయం సాధించింది భారత దేశమొక్కటే. ఈ గెలుపు సాధించేందుకు క్రికెట్ టీమ్ సమిష్టిగా శ్రమించింది. కానీ, విజయోత్సవంలోకి కొత్తగా మత అంశాలను చొప్పించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోచమ్మ మైదాన్ సెంటర్ కు చేరుకున్నవారు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఇందులో ఒక వర్గానికి చెందిన వారు అక్కడ ఉన్న రాణి రుద్రమదేవి విగ్రహం చేతిలో తమ మతానికి చెందిన జెండా పెట్టారు. దీంతో అక్కడ ఎక్కువగా ఉండే మరో వర్గం యువకులు జెండా పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో ఒక వర్గం తమ దేవుని పేరుతో నినాదాలు ప్రారంభించారు. ప్రతిగా మిగిలిన వర్గం వారు తమ దైవం పేరుతో నినాదాలు చేస్తూ పోటాపోటీగా తలపడేందుకు ప్రయత్నించారు. క్రికెట్ సంబరాల స్థానంలో మత ఆధిపత్యానికి ఒక వర్గం ప్రయత్నించడం మరో వర్గం దాన్ని వ్యతిరేకించడంతో కొత్త విభేదాలు, విద్వేషాలకు దారితీశారు. గతంలో పాకిస్తాన్, భారత్ పోటీల సందర్భంగా కొన్ని చోట్ల ఈ మత విభేదాలు, విద్వేషాలు నెలకొనేవి. కానీ, తాజాగా విజయోత్సవంలో కూడా ఈ పరిణామం చోటుచేసుకోవడంతో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారి పరస్పరం తొపులాడుకునేందుకు ప్రయత్నించగా అక్కడ ఉన్న పోలీసులు ఇరువర్గాలపై లాఠీ ఝళిపించి చెదరగొట్టడంతో పరిస్థితి కుదుటపడింది. తాము ఎక్కువగా ఉండే ప్రాంతంలో కావాలని ఒక వర్గం తమ మత జెండాను పెట్టేందుకు ప్రయత్నించి పరిస్థితిని ఇబ్బందికరంగా మార్చారనే విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. దేశ క్రికెట్ జట్టు సాధించిన విజయాన్ని ఉత్సవంగా నిర్వహించుకోవడంలో కూడా మతాలను చొప్పించేందుకు ఛాందసవాదులు చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశంపై, దేశభక్తిపై ఉన్న అభిమానాన్ని, జట్టు గెలిచిన ఆనందాన్ని పంచుకోకుండా కావాలని ఇలాంటి నినాదాలు, విభేదాలు సృష్టిస్తున్నారని సాధారణ క్రికెట్ అభిమానులు విమర్శిస్తున్నారు. ఇలాంటి విభేదాలతో సున్నిత సమస్యలు కాస్తా ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందంటున్నారు. పైగా రంజాన్ మాసం కావడంతో పోచమ్మ మైదాన్, మండిబజార్ ప్రాంతంలో మైనార్టీలు ఎక్కువగా ఉంటారు. అలాంటి ప్రాంతాల్లో కొత్త సమస్యలు సృష్టించేందుకు ప్రత్యర్ధులు కొందరు ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి సంఘటనలను ఇరువర్గాల్లోని అవకాశవాదులు తమకు అనుకూలంగా మార్చుకుని, విద్వేషం పెంచేందుకు ప్రయత్నించడం వల్ల సామరస్యతకు మారుపేరుగా నిలిచిన వరంగల్ నగరంలో కలుషితవాతావరణం పెరిగే ప్రమోదం ఉందంటున్నారు. మతాల మధ్య విభేదాలు సృష్టించి తమ పబ్బం గడుపుకోవాలనే స్వార్ధశక్తుల చీకటి లక్ష్యం ఇలాంటి సంఘటనల వెనుక దాగి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇవి కూడా చదవండి :
Medical Profession Survey | మా పిల్లలకు వైద్య వృత్తి వద్దే వద్దు.. ఎవరి మాటో తెలిస్తే షాకే!!
Anasuya | ఆ స్టార్స్ ఎవరు మహిళల గురించి మాట్లాడలేదు, ఎన్టీఆర్ ఒక్కరే మాట్లాడారు.. అనసూయ వ్యాఖ్యలు వైరల్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram