Maoist Party | మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన
ఆపరేషన్ కగార్ లో ఎదుర్కొన్న నష్టాల నుంచి తిరిగి కోెలుకొని భారత కమ్యూనిస్టు ఉద్యమంలో మళ్లీ ప్రభావవంతమై శక్తిగా ఎదగాలని మవోయిస్టు పార్టీ సంకల్పించుకున్నది.

విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Maoist Party | శత్రుదుర్భేద్యంగా పార్టీని తీర్చిదిద్దుకుందామని, విప్లవోద్యమాన్ని కాపాడుకుని ప్రస్తుత వెనుకంజ స్థితిని అధిగమించే సమర్థతను పెంచుకుందామని సీపీఐ (మావోయిస్టు) పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. పార్టీ 21వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీ నుంచి 27 వరకు పార్టీ స్థాపనా వార్షికోత్సవాలను దేశమంతటా విప్లవ స్ఫూర్తితో నిర్వహించాలని కోరారు. ఈ మేరకు బుధవారం పార్టీ కేంద్ర కమిటీ పేరుతో పది పేజీల సర్క్యులర్‌ను పార్టీ శ్రేణులకు, ప్రజలకు విడుదల చేశారు. పార్టీని, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని కాపాడుకుంటూ ఐక్య సంఘటనతో ముందుకు సాగుదామని పేర్కొన్నారు. విప్లవ ప్రతి ఘాతక ‘కగార్’ యుద్ధాన్ని విఫలం చేసేందుకు విశాల ప్రజారాశులను వర్గపోరాటంలో, గెరిల్లా యుద్ధంలో సమీకరించేందుకు శ్రమిద్దామంటూ తెలిపారు. ఏడాది కాలంగా కగార్ యుద్ధాన్ని విఫలం చేసేందుకు పార్టీలోని అన్ని రకాల శక్తులు, ప్రజలు చేస్తున్న కృషికి విప్లవాభినందనలు తెలియజేశారు. జూలై 28న అమరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహించాలని ఇటీవల కేంద్ర కమిటీ 24 పేజీల సర్క్యులర్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఎన్నడూ లేనంత మంది అమరులు
సంవత్సర కాలంలో నక్సలబరీ, శ్రీకాకుళం ఉద్యమం తర్వాత ఎన్నడూలేనంత మంది వీరులు అమరులయ్యారని కేంద్ర కమిటీ పేర్కొంది. పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు అలియాస్ నంబాల కేశవరావు, కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, వివేక్, ఉదయ్, రాష్ట్ర కమిటీ నాయకులు శర్మ, గౌతం, మధు, జయ, రూపేష్, నీతి, కార్తిక్, చైతే, గుడ్డు, సత్యం, అలోక్, పాపన్న, మధు, భాస్కర్, జగన్, అరుణ, విజయ్ లు అమరులయ్యారు. జిల్లా కమిటీ సభ్యులు 26 మంది, ఏరియా కమిటీ సభ్యులు 86 మంది, పీఎల్జీఎ సభ్యులు 152 మంది, స్థానిక నిర్మాణ సభ్యులు 38 మంది, వివరాలు తెలియని కామ్రేడ్లు 43 మంది ఉన్నారని మొత్తం 366 మంది అమరులైనట్లు పేర్కొన్నారు. ఫిలిప్పీన్ నేత లూయి జలందానీ, ఇతర దేశాల్లో మరి కొంత మంది విప్లవకారులు మృతి చెందారని అందరికి నివాళులు అర్పించారు. ఈ నష్టాలు భవిష్యత్తు విప్లవోద్యమాన్ని తప్పకుండా ప్రభావితం చేస్తాయని, వీటిని అధిగమించేందుకు కృషి చేయాల్సిన కర్తవ్యం మన అందరిపై ఉందని స్పష్టం చేశారు.
విప్లవ శిబిరంలో విశ్వాసం
కగార్ యుద్ధంలో విప్లవోద్యమం తీవ్రమైన నష్టాలపాలవుతున్న స్థితిలో ఉద్యమ భవిష్యత్తు పట్ల విప్లవ శిబిరంలో తలెత్తుతున్న ప్రశ్నలకు జవాబునిస్తూ భయాందోళనకు గురైన వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం కల్పిస్తూ ధైర్యసాహసాలతో పార్టీని ముందుకు నడపడమే ప్రస్తుత కర్తవ్యమని పేర్కొన్నారు. జరుగుతున్న నష్టాలకు కారణాలను గుర్తించి, వాటిని సరిదిద్దుకుంటూ భౌతిక పరిస్థితి, స్వీయాత్మక పరిస్థితిల్లో విప్లవోద్యమ పురోగమనానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ విప్లవోద్యమాల చరిత్ర నేర్పుతోందన్నారు.
ఎత్తుగడల అమలులో లోపం
మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ రూపొందించిన ఎత్తుగడలను సరిగా అమలు చేయకపోవడంతో కగార్ యుద్ధంలో తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. రహస్య పనివిధానం, గెరిల్లా యుద్ధ నియమాలను సక్రమంగా అమలు చేయలేదని పేర్కొన్నారు. మన బలగాలు విశాల ప్రాంతాల్లో పనిచేయాలని, అన్ని నిర్మాణ రూపాల ద్వారా ప్రజా సమీకరించాలన్నారు. దీనికి సంబంధించిన రాజకీయ, సైనిక ఎత్తుగడలను కేంద్ర కమిటీ రూపొందించిందని గుర్తుచేశారు. ఇప్పటికైనా జరిగిన నష్టాలను సమీక్షించుకుని వర్గపోరాటాన్ని, గెరిల్లా యుద్ధాన్ని కొనసాగిస్తూ 2026 మార్చి 31 నాటికి విప్లవోద్యమాన్ని నిర్మూలిస్తామని ప్రకటించిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దుష్ట పథకాన్ని విఫలం చేద్దామని పిలుపునిచ్చారు. కగార్ యుద్ధంలో మనకు తీవ్ర నష్టం వాటిల్లినప్పటికీ శత్రు సాయుధ బలగాలు కూడా గణనీయంగా నష్టపోతున్నాయని, వీటిని శత్రువు ప్రకటించకుండా మానసికంగా మనపై ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారని గుర్తు చేశారు.
శాంతి చర్చలకు సిద్ధం
కగార్ ను నిలిపివేసి మావోయిస్టులతో ప్రభుత్వాలు శాంతి చర్చలు జరుపాలనే ఉద్యమానికి మద్ధతు ప్రకటించారు. ప్రజా ప్రయోజనాల రీత్యా తమ పార్టీ ఎప్పుడైనా చర్చలకు సిద్ధమని మరోసారి ప్రకటించారు. దీని కోసం కగార్ యుద్ధాన్ని ఆపివేసి, ఉద్యమ ప్రాంతాల్లో సాయుధ బలగాల క్యాంపుల ఏర్పాటు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లొంగుబాట్లను, విప్లవ ద్రోహాన్ని వ్యతిరేకిస్తూ పీడిత ప్రజల ప్రయోజనాల కోసం ధృఢంగా నిలబడుదామని, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ, భూస్వామ్య వ్యతిరేక వర్గ పోరాటాలని తీవ్రం చేసేందుకు ప్రతినబూనుదామని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది.