బీసీ మహిళలకు ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినట్లుగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అర్హులైన బీసీ మహిళలకు వంద శాతం సబ్సిడీ తో ఇంటింటా ఇందిరమ్మ ఆటోమేటిక్ కుట్టు మిషన్లను ప్రభుత్వం అందించనున్నట్లుగా తెలిపారు. ఆగస్టు 15 నుండి సెప్టెంబరు 15 వరకు “ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు” కుట్టు మిషన్లు పథకాన్ని అప్లికేషన్ లు కొనసాగుతాయని పేర్కొన్నారు.
తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి వేయి కుట్టు మిషన్ల పంపిణీ
రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో తొలి విడతగా 1000 చొప్పున 1.19లక్షల ఆటోమేటిక్ కుట్టుమిషన్లు అందజేస్తామని, ఒంటరి, పేద మహిళలకు,మేర కులస్తులకు పథకంలో ప్రాధాన్యత ఉంటుందని మంత్రి పొన్నం తెలిపారు. 100 శాతం సబ్సిడి ద్వారా ఒక్కో కొట్టు మిషన్ కి 12 వేలు రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందని అన్నారు. బీసీలకు ఆత్మగౌరవ భవనాలకు నిధులు కేటాయించడం జరుగుతుంది.. భవనాల నిర్మాణాలు పూర్తి చేస్తాం అని స్పష్టం చేశారు.
ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,పెట్రోల్ పంపులు ,ఇందిరా క్యాంటీన్ లు ,ఆర్టీసీ బస్సులు పథకాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని మంత్రి గుర్తు చేశారు. ఇప్పటికే ప్రభుత్వం కుల గణన చేయడం జరిగిందని, బీసీ రిజర్వేషన్ల సాధనకు తదుపరి కార్యచరణ ముందుకు తీసుకుపోతాం అన్నారు.
సావిత్రి బాయ్ పూలే..పాపన్న గౌడ్ ల విగ్రహావిష్కరణలు
రేపు శుక్రవారం హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా మహాత్మా జ్యోతిబాపూలే సావిత్రి బాయ్ పూలే విగ్రహావిష్కరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరుగుతుందని, సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ చాంపియన్ అని పొన్నం పేర్కొన్నరు. ప్రగతి భవన్ కు మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్ గా పేరు మార్చుకున్నామని, సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంగా మార్చుకున్నాం అని, ఈనెల 18 వ తేదీన గోల్కొండ కోటను ఏలిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారని పొన్నం తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో బీసీ ప్రజా ప్రతినిధులు,బీసీ సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వి.హనుమంతరావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ,ఎమ్మెల్యేలు ఈర్లపల్లి శంకరయ్య, నవీన్ యాదవ్,కాలేరు వెంకటేష్,వివిధ కులాల కార్పొరేషన్ చైర్మన్ లు , బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ బాలమయాదేవి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.
