Jagadish Reddy| సీఎం రమేశ్ ఇంటికి నేను కూడా వెళ్లాను

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.. రేవంత్ రెడ్డి సోనియా గాంధీ అవార్డు గ్రహీత అని అన్నారు. ఆయన మానసిక స్థితిపై ప్రజల్లో అనుమానం ఉందని, రాజకీయాల్లో నటించడం, డైలాగులు చెప్పడంలో రావు గోపాలరావు, కోట శ్రీనివాస రావును మించిపోయారన్నారు.

Jagadish Reddy| సీఎం రమేశ్ ఇంటికి నేను కూడా వెళ్లాను
  • సీఎం మానసిక స్థితిపై అనుమానం ఉంది
  • రేవంత్ గోబెల్స్‌ను మించిపోయాడు
  • జైపాల్ రెడ్డి ఆత్మ ఘోషిస్తుంది
  • సీఎం రమేశ్‌కు అంత సీన్ లేదు: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

విధాత: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.. రేవంత్ రెడ్డి సోనియా గాంధీ అవార్డు గ్రహీత అని అన్నారు. ఆయన మానసిక స్థితిపై ప్రజల్లో అనుమానం ఉందని, రాజకీయాల్లో నటించడం, డైలాగులు చెప్పడంలో రావు గోపాలరావు, కోట శ్రీనివాస రావును మించిపోయారన్నారు. సీఎం అబద్దాలు చెప్పడంలో గోబెల్స్‌ను మించిపోయాడని, ఆయన మాటలు వింటే గోబెల్స్ సైతం ఆత్మహత్య చేసుకుంటారన్నారు.

జైపాల్ రెడ్డి ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు,తెలంగాణ గురించి మాట్లాడలేదని రేవంత్ రెడ్డి అన్నారన్నారు. రేవంత్ రెడ్డిని మనిషిలాగ చూడటానికి జైపాల్ రెడ్డి ఇష్టపడలేదన్నారు. జైపాల్ రెడ్డి ముందే రేవంత్ రెడ్డిని కరెక్ట్ గా అంచనా వేశారన్నారు. రేవంత్ మాటలు వింటే జైపాల్ రెడ్డి ఆత్మ ఆత్మహత్య చేసుకుంటుందని వెల్లడించారు. ప్రాంతం వాడు ద్రోహం చేస్తే కాళోజీ ఏం చెప్పారో అది చేసి తీరుతామని ఘాటుగా స్పందించారు. మనుషులను కులంతో చూసే చరిత్ర రేవంత్ రెడ్డిదన్నారు. కొల్లాపూర్ లో చిల్లర మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ప్రవచనాలు మాట్లాడారని విమర్శించారు. నోట్ల కట్టలతో దొరికినట్లు నేడు బనకచర్ల విషయంలో రేవంత్ రెడ్డి దొరికిపోయారన్నారు. రేవంత్ రెడ్డిదుర్మార్గాలను బయటపెడుతున్నందుకు కేసీఆర్,కేటీఆర్ పై ఏడుస్తున్నారని మండిపడ్డారు.

అసెంబ్లీ నుంచి ఎవరిని సస్పెండ్ చేయలేదని చెప్పిన రేవంత్ రెడ్డి నన్ను సెషన్ నుంచి సస్పెండ్ చేయలేదా అని ప్రశ్నించారు. తనకు ఏ విలువలు లేవు అధికారం,డబ్బే ముఖ్యమని రేవంత్ రెడ్డి చెప్పారని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ సీఎం కాకముందు ఉన్న పాలమూరుకు,కేసీఆర్ సీఎం అయ్యాక ఉన్న పాలమూరుకు రేవంత్ రెడ్డి తేడా చూడాలని వెల్లడించారు. రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చినవాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా భాదపడుతున్నారని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి కుర్చీలో ఐదేళ్లు ఉండాలని మేము కోరుతున్నామన్నారు. నీ పక్కన ఉన్న వాళ్లతో నీకు భయం ఉంటే మేము ఏం చేయలేమని తెలిపారు. అందుకే మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నావని, ఒక మంత్రి ఫోన్ ట్యాపింగ్ కు భయపడి డబ్బా ఫోన్ వాడుతున్నారన్నారు. ఎవరెవరు రెచ్చిపోతున్నారో వాళ్ళ సంగతి మేము చూసుకుంటామని హెచ్చరించారు.

పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు అంటే కేసీఆర్ మమ్మల్ని పిలిచి అరిచారని జగదీష్ రెడ్డి అన్నారు. ప్రాణం పోయినా బీజేపీతో పొత్తు ఉండదని కేసీఆర్ చెప్పారన్నారు. బీఆర్ఎస్ భావజాలం వేరు, బీజేపీ భావజాలం వేరని, బీజేపీ తెలంగాణకు పనికి వచ్చే పార్టీ కాదన్నారు. ఇలాంటి విషయాల గురించి చిన్న, పెద్ద బ్రోకర్లు మాట్లాడితే పట్టించుకోవద్దన్నారు. చంద్రబాబు నాయుడు చిన్న, పెద్ద బ్రోకర్లకు పదవులు ఇచ్చారన్నారు.

సీఎం రమేశ్ ఇంటికి నేను కూడా మిత్రునిగా వెళ్ళానని జగదీష్ రెడ్డి వెల్లడించారు. సీఎం.రమేష్ ఇంటికి కేటీఆర్ లేదా నేను వెళ్తే తప్పు ఏంటని ప్రశ్నించారు. సీఎం రమేశ్ సీసీ ఫుటేజీ తీయాలంటే తన జీవితకాలంలో ఎక్కువగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇంట్లో ఉంటారన్నారు. వారిని భయపెడితేనే బీజేపీలోకి వెళ్లామని, మేము ఎప్పుడు చంద్రబాబు మనుషులమేని సీఎం రమేశ్ చెప్పారని జగదీష్ రెడ్డి తెలిపారు. బీజేపీలో సీఎం రమేశ్‌కు అంత సీన్ లేదని, అతన్ని బీజేపీ ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతుందన్నారు. రుత్విక్ కంపెనీ నాది కాదు అన్న సిఎం రమేష్ ఆ మాటలకు కట్టుబడి ఉంటారా అని ప్రశ్నించారు.చంద్రబాబు నాయుడు,రేవంత్ రెడ్డి ఆఫీసు నుంచి వచ్చిన స్క్రిప్ట్ ను సీఎం రమేష్ చదివారన్నారు.బీజేపీ,టీడీపీ కలిసి పోటీచేస్తే ఇంకా బిఆర్ఎస్ ఎక్కడ కలుస్తుందన్నారు.

కవిత జైలుకు వెళ్తే బెయిల్ ఇచ్చేది కోర్టు అయితే కవిత విషయంలో పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని కేటీఆర్ ఎట్లా అంటారని ప్రశ్నించారు.కంచెగచ్చిబౌలి భూముల విషయంలో బీజేపీ ఎంపీ మధ్యవర్తిత్వం వహించారని కేటీఆర్ ముందే చెప్పారన్నారు. పథకం ప్రకారం బీజేపీ,చంద్రబాబు నాయుడు,రేవంత్ రెడ్డి కలిసి డ్రామాలు ఆడుతున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు.