కరీంనగర్ లో కన్నారావు ఫ్లెక్సీల కలకలం

కరీంనగర్ లో కన్నారావు ఫ్లెక్సీల కలకలం

విధాత బ్యూరో, కరీంనగర్: కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావు..రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు సోదరుడి కుమారుడైన ఈయనను ఆహ్వానిస్తూ కరీంనగర్ పట్టణంలో వెలసిన ఫ్లెక్సీలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కరీంనగర్ పట్టణంలో జరుగుతున్న ఒక గృహప్రవేశ వేడుకకు ఆయన హాజరవుతున్నట్టు ఈ ఫ్లెక్సీలలోని సారాంశం.

వాస్తవానికి ఒక భూవివాదం కేసులో ప్రత్యేక పోలీసు బృందాలు ఆయన కోసం గాలిస్తున్న తరుణంలో కరీంనగర్ పట్టణంలో కన్నారావు పేరిట ఫ్లెక్సీలు వెలవడం కలకలం సృష్టించింది. హైదరాబాద్ ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుకు సంబంధించి అరెస్టు నుండి తప్పించుకునేందుకు కన్నారావు సింగపూర్ వెళ్లినట్టు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.ఈ మేరకు ఆయనకు లుక్ అవుట్ నోటీసు జారీ చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో కన్నారావుకు స్వాగతం పలుకుతూ కరీంనగర్ పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు కావడంతో, ఆయన రాష్ట్రంలోనే ఉన్నారా? విదేశాలకు పారిపోయారా? అనే విషయంలో సందిగ్ధత నెలకొంది.

కన్నారావుకు సమాచారం ఇవ్వకుండా, ఆయనను ఆహ్వానించకుండా ఆయన పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని భావిస్తే, అలా ఎందుకు చేయాల్సి వచ్చిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. వాస్తవానికి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో కన్నారావు పేరు కానీ, ఈ జిల్లాలో ఆయన ప్రమేయం కానీ ఉన్న సంఘటనలు పెద్దగా లేవు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి, ఆ పార్టీ నేతలు ఒక్కరు ఒకరుగా బయటకు జారుకుంటున్న క్రమంలో, ఫోన్ టాపింగ్ తోపాటు అనేక ఆరోపణలు పార్టీని చుట్టుముట్టిన తరుణంలో కన్నారావు ఫ్లెక్సీలు కరీంనగర్లో వెలవడం ఆశ్చర్యకరమే!

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం మన్నెగూడ సర్వేనెంబర్ 32 లోని 2.15 ఎకరాల స్థలానికి సంబంధించిన వివాదంపై కన్నారావు తో సహా మరో 37 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో కన్నారావు ప్రధానాంచరుడు డేనియల్ తో సహా ఎనిమిది మందిని పోలీసులు రిమాండ్ కు తరలించారు. తనపై అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేయాల్సిందిగా కోరుతూ కన్నారావు హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆ పిటిషన్ ను త్రోసిపుచ్చింది. పోలీసులు కన్నారావు కోసం ఓవైపు గాలిస్తుండగా మరోవైపు ఆయనకు స్వాగతం పలుకుతూ కరీంనగర్ పట్టణంలో ఫ్లెక్సీలు వెలవడం చర్చనీయాంశం అయింది.