Kavitha Vs Komatireddy Venkat Reddy : వెంకట్ రెడ్డి అన్న నాతో ఏం పంచాయితీ ఉంది? కవిత ఫైర్
నల్లగొండలో తన కటౌట్‌లు తొలగింపుపై బీఆర్ఎస్ బహిష్కృత ఎమ్మెల్సీ కవిత, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి సమస్యలు తీర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టుల ఆలస్యంపై విమర్శించారు.
విధాత : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్న…నాతో ఏం పంచాయితీ ఉంది ? నల్లగొండలో నా కటౌట్లు ఎందుకు తొలగించేశారు..మా నిల్లల్ని ఎందుకు అరెస్ట్ చేయించారు? జాగృతితో పెట్టుకున్నోళ్లు ఎవరు బాగుపడలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ బహిష్కృత ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తన కటౌట్లను మున్సిపల్ సిబ్బందితో తొలగింప చేయడంపై కవిత మంత్రి వెంకట్ రెడ్డిపై మండిపడ్డారు. ఇప్పుడు రాజకీయాలు చేయటానికి నేను రాలేదని, రాజకీయాలు చేసినప్పుడు మీకు గట్టి పోటీదారులను పెడతాం.
ముందు ప్రజల దగ్గరకు వెళ్లి వాళ్ల దుఖాన్ని చూడండంటూ కవిత హితవు పలికారు.
ప్రభుత్వాలు మారిన నల్లగొండ నీళ్ల సమస్యలు తీరలే
తెలంగాణ వచ్చాక మన నీళ్లు మనకు వస్తాయని అందరం అనుకున్నాం అని, కానీ నల్గొండ జిల్లాకు కృష్ణా నీళ్లు పూర్తి స్థాయిలో వచ్చాయో లేదో అందరం ఆలోచించాలని కవిత తెలిపారు. మాధవ రెడ్డి ప్రాజెక్ట్, కృష్ణా, మూసీ, డిండీ, ఎస్ఎల్ బీసీ ప్రాజెక్ట్ లతో జిల్లాకు మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉండేనని, అదే విధంగా ఎస్సారెస్సీ తో కొంత కాళేశ్వరం, దేవాదుల ద్వారా కొంత నీళ్లు రావాల్సిందని..కానీ జిల్లాకు నీళ్లు అంటే కృష్ణానది మీదనే ఎక్కువ ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మరి బీఆర్ఎస్ పదేళ్లు, కాంగ్రెస్ రెండేళ్లు పన్నెండేళ్లలో కృష్ణానది నీళ్లు తెచ్చుకున్నామా ఆలోచన పరులు ఆలోచించాలన్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ ఇక్కడే కనబడుతుంది. కానీ చుట్టు ఉన్న ఐదు మండలాలకు నీళ్లు రావడం లేదన్నారు. నెల్లికల్లు ప్రాజెక్ట్ పూర్తైతే 5 మండలాలకు నీళ్లు వస్తాయి. కానీ ఇప్పటి వరకు ఎవరు పూర్తి చేయలేదని, ఇవే అంశాలపై బీఆర్ఎస్ ను తిట్టితిట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలోనూ రెండేళ్లైనా ఎందుకు పనులు చేయటం లేదో ఆలోచించాలన్నారు. బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా సరే సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయన్నారు. అందుకే ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసే వాళ్లు అవసరమన్నారు. ఇక్కడి సుంకిశాలను హైదరాబాద్ నీటి అవసరాలకు సెకండ్ అల్టర్ నేట్ అని గతంలో కేటీఆర్ ప్రారంభిస్తే..ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైనింగ్ వాల్ కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎంప్లాయిస్ తీసిన వీడియో ద్వారా ఆ విషయం బయటకు తెలిసిందని, దీంతో ఆగమేఘాల మీద అధికారులను తీసేశామని చెప్పి ఎంక్వైరీ కమిటీ వేశారన్నారు.
మేఘాతో సీఎంకు ఫెవికాల్ బంధం
ఎస్ఎల్ బీసీ, నక్కలగండి, డిండి ప్రాజెక్ట్ లు ఎప్పుడు పూర్తి చేస్తారు? సుంకిశాల ప్రమాదంపై కాంట్రాక్ట్ సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని కవిత ప్రశ్నించారు. సుంకిశాల ఘటనపై విచారణ కమిటీ కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని సూచించినా..కాంట్రాక్టర్ ను ఏమీ చేయలేదని, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డిలు ఒక్క మాట అనలేదని కవిత గుర్తు చేశారు. ఇక మేఘాతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల ఫెవికాల్ బంధం తెలిసిందేనని…సీఎం మేఘా కృష్ణారెడ్డిని ఒక్క మాట మాట్లాడలేదు అన్నారు. ఎస్ ఎల్ బీసీ పై ఆధారపడిన నక్కల గండి పరిస్థితి ఏంటీ? మెథ్యా నాయక్, నక్కల గండి ప్రాంతాలను మంత్రి విజిట్ చేయాలని కవిత డిమాండ్ చేశారు. కృష్ణానది నీళ్లు తేవటంలో అలసత్వం ప్రదర్శిస్తే సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తాం అని కవిత స్పష్టం చేశారు.
డిండి ఎత్తిపోతల పథకంలో కిష్టరాయినిపల్లె, నెల్లికల్ ప్రాంతాల్లో భూసేకరణ చేసిన 17 ఏళ్లు అవుతోందని, భూమి ఇచ్చిన వారి పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. వారి కుటుంబంలో వారికి ఉద్యోగం ఇస్తామని ఇవ్వలేదు.
నిర్వాసితులకు భూమి లేదు, ఉద్యోగం లేని పరిస్థితి నెలకొందని, బంగారు తెలంగాణ అంటే మారాల్సింది పేదల జీవన పరిస్థితులు అని కవిత చెప్పుకొచ్చారు. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ మీటర్ రీడిండ్ తెలంగాణ ప్రభుత్వంలో లేదని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుని రీడింగ్ హక్కులు సాధించాలన్నారు.
గుంటూరు తరలించిన జిల్లా చారిత్రాక సంపదను తెప్పించాలి
ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ జిల్లా చార్రిత్రాక సంపదను గుంటూరుకు తీసుకెళ్లారని, ఉద్యమం సమయంలో దీనిపై మేము పోరాటం చేశాం అని కవిత తెలిపారు. నాగార్జున కొండ వద్ద ఉన్న స్థూపాన్ని కూడా గుంటూరు కు తీసుకెళ్లారు.
పానగల్ లో ఉన్న ఎన్నో విగ్రహాలను అక్కడకు తీసుకెళ్లారు. తెలంగాణ వచ్చాక కూడా అవన్నీ రిటర్న్ రాలేదన్నారు.
జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ చరిత్ర కాపాడుకునే ప్రయత్నం జరుగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలు తిరిగానని, హుజుర్ నగర్ లో సిమెంట్ ఫ్యాక్టరీలలో కొలువు కోసం కొట్లాట అనే కార్యక్రమాలు చేశాం, ప్రతి మండల కేంద్రంలో బతుకమ్మ ఎత్తుకొని నేను తిరిగానని కవిత గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వం స్కూల్స్, వెల్ఫేర్ హాస్టల్స్ ను పట్టించుకోవటం లేదు అని, కలెక్టర్లు వారానికి ఒకసారి సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో నిద్ర చేయాలని సీఎం చెప్పిన కలెక్టర్లు పట్టించుకోవడం లేదన్నారు. దేవరకొండలో వెల్ఫేర్ స్కూల్ కు 5 ఎకరాలు కేటాయిస్తే రెండు ఎకరాలు కబ్జా అయ్యిందని, పడుకునే చోటనే పిల్లలు చదువుకునే పరిస్థితి ఉందన్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఒక్కో బెడ్ మీద ఇద్దరు పేషెంట్లను, పిల్లలను పడుకోబెట్టారన్నారు. ఆసుపత్రి రోజు వారీ అవసరాలకు ఇక్కడి హాస్పిటల్ లక్షా 20 వేల ఖర్చు ఉంటే హాస్పిటల్ డెవలప్ మెంట్ అథారిటీ వద్ద డబ్బులు లేవు. సూపరిండెంట్ వద్ద పెట్టి క్యాష్ లేదు అని కవిత ఆరోపించారు. ఆసుపత్రిలో అనేకు సమస్యలు ఉన్నాయని కవిత వివరించారు. హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా హాస్పిటల్ లో ఎపిడ్యూరెల్ ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నల్గొండలో కనీసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదని, స్థానిక మంత్రి వెంకట్ రెడ్డి ఇందుకోసం కృషి చేయాలన్నారు.
సమస్యల్లో జిల్లా రైతాంగం
జిల్లాలో 13 లక్షల 44 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వేశారని, మిర్యాలగూడ రైస్ మిల్లుల హబ్ కావటంతో సగం ధాన్యం వాళ్లే కొనే పరిస్థితి ఉందని కవిత తెలిపారు. మిగిలినవి 6 లక్షల మెట్రిక్ టన్నులే. వాటిని ప్రభుత్వం కొనాలన్నారు. ఇందుకోసం వెయ్యి కొనుగోలు కేంద్రాలు కావాలి. కానీ ఇప్పటి వరకు 375 కేంద్రాలు మాత్రమే తెరిచారు అని విమర్శించారు. కనీసం లక్ష మెట్రిక్ టన్నులను కూడా ఇప్పటి వరకు కొనలేదు అన్నారు. బోనస్ తప్పించుకునేందుకే రైతుల నుంచి ధాన్యం కొంటలేరు అని కవిత ఆరోపించారు. మిర్యాల గూడలో భారీగా రైస్ మిల్లులు ఉన్నాయని, వాళ్లంతా ఎఫ్.సి.ఐ ద్వారా వంద మెట్రిక్ టన్నుల గోడౌన్ ఉండాలని కోరుతున్నారని ఇందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. పత్తి రైతులు సమస్యల్లో ఉన్నారని..20 శాతం తేమ ఉన్న సరే పత్తి కొనుగోలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు రెఫరెండం అని సీఎం చెప్పుకున్నారని, కానీ అక్కడ ఎవరు గెలిచినా ఫరక్ పడదు. 15 రోజులు మాత్రం రాజకీయ పార్టీలకు ఎంటర్ టైన్ మెంట్ అయ్యిందని కవిత పేర్కొన్నారు. ఉప ఎన్నిక పూర్తయినందునా ఇప్పుడైనా అధికారపక్షం, ప్రతిపక్షం ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు.
సామాజిక తెలంగాణలో అందరికి గౌరవం
సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మహిళలకు గౌరవం దక్కాలంటే సామాజిక తెలంగాణ రావాల్సిందేనని, అందుకు అనేక మార్గాల్లో పోరాటం చేయాల్సి ఉంటుందని కవిత తెలిపారు. బీసీలకు 42 శాతం స్థానిక సంస్థల్లోనే కాదు చట్టసభల్లోనూ రిజర్వేషన్లు రావాలన్నారు. కులవివక్ష లేకుండా వారికి ఆత్మగౌరవం దక్కాలని, యాదాద్రిలో సీఎం కుర్చీలో కూర్చుని దళిత మంత్రులను కింద కూర్చొపెట్టిన వివక్షపూరిత ఘటన మనం చూశాం అని కవిత పేర్కొన్నారు. మళ్లీ విద్యాసంస్థల్లో స్టూడెంట్ ఎలక్షన్స్ రావాలని, లేదంటే కొత్త నాయకత్వం రావటం కష్టం. కొత్త వాళ్లు రావాలంటే స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు ఉండాలన్నారు. కొత్త నాయకత్వం లేకపోవటంతో ఇప్పుడున్న నాయకుల వారసులు, బంధువులే రాజకీయాల్లోకి వస్తున్నారని, నియోజికవర్గాల పునర్విభజన అయితే రాష్ట్రంలో 65 నుంచి 69 మంది ఆడబిడ్డలు చట్ట సభల్లోకి వస్తారు అని కవిత గుర్తు చేశారు. నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు జాగృతి పనిచేస్తుందన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram