Kalvakuntla Kavitha | వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోండి : ఆర్టీసీ ఎండీకి కవిత వినతి

ఆర్టీసీ ఎండీని కలిసిన కవిత, తొలగించిన 1,300మంది ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని వినతి. కార్మికుల మనుగడ కోసం తక్షణ నిర్ణయం కోరారు.

Kalvakuntla Kavitha | వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోండి : ఆర్టీసీ ఎండీకి కవిత వినతి

విధాత, హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గురువారం హైదరాబాద్ లోని ఆర్టీసీ బస్ భవన్ లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తో భేటీ అయ్యారు. 2021 నుంచి ఇప్పటి వరకు చిన్న చిన్న కారణాలతో డిస్మిస్ చేసిన డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కార్మికులు 1300మందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని వినతి పత్రం అందించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. తొలగించిన 1,300 మంది డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందిలో 491 మందిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని గతంలోనే ఉత్తర్వులు ఇచ్చారని గుర్తు చేశారు. అయితే వారిని కూడా ఉద్యోగాల్లోకి తీసుకునే ఆలోచనలో సంస్థ లేనట్టుగా ఇప్పుడు సంస్థ ఎండీని కలిసిన తర్వాత తెలిసిందన్నారు. కార్మికుల కుటుంబాల మనుగడను దృష్టిలో పెట్టుకుని వెంటనే 491 మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. మిగతా కార్మికుల విషయంలోనూ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఆర్టీసీలో హైర్ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుంటున్నారని, వాటి డ్రైవర్లపై ఆర్టీసీకి నియంత్రణ ఉండటం లేదు అని కవిత పేర్కొన్నారు. హైర్, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ డ్రైవర్లే నడిపించేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లుగా కవిత తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్లు శిక్షణ పొందిన వాళ్లు అని.. ప్రైవేటు డ్రైవర్ల వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు అని కవిత ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరడం జరిగిందని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని, అప్పుడే ప్రజలకు భద్రమైన ప్రయాణం.. కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుందని కవిత స్పష్టం చేశారు.