సర్వోదయ తెలంగాణ సాధనకే పాంచజన్యం : కవిత

సర్వోదయ తెలంగాణ కోసం ‘పాంచజన్యం’ అజెండాతో ముందుకు వెళ్తామని కవిత తెలిపారు. ఉచిత విద్య, వైద్యం, రైతు సంక్షేమం ప్రధాన హామీలుగా ప్రకటించారు.

సర్వోదయ తెలంగాణ సాధనకే తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) ఐదు అంశాల అజెండా ప్రధానాంశంగా పాంచజన్యం కార్యక్రమాన్ని తీసుకున్నామని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. భగవాన్ శ్రీకృష్ణుడి పాంచజన్యంతో తెలంగాణ రాష్ట్రంలోని అనేక పరిస్థితుల మీద మేము యుద్ధ భేరీ మోగిస్తాం అన్నారు. ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పనిచేస్తాం అని తెలిపారు. తెలంగాణ జాగృతి’ ఒక తన ఎన్ జీవోగా తన సేవలను కొనసాగిస్తుండగా, ‘తెలంగాణ రక్షణ సేన (TRS)’ ఒక రాజకీయ వేదికగా ప్రజల పక్షాన పోరాడుతుందని కవిత తెలిపారు. శనివారం హైదరాబాద్ లో మీట్ ది ప్రెస్ లో మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

పాంచజన్యం హామీలలోని ఉచిత విద్య హామీలో భాగంగా ప్రైవేట్ స్కూళ్ళలో అందరికీ ఉచిత అందిస్తామన్నారు. రెండో హామీగా అందరికీ ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు.ఎలాంటి రోగమైన సరే ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు.
మూడో హామీగా రైతు సంక్షేమమే పార్టీ ధ్యేయంగా పనిచేస్తుందన్నారు కవిత. రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేస్తామన్నారు. ఇక నాలుగో హామీగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. ఉపాధికల్పనలో భాగంగా రూ. 2లక్షల నుంచి రూ. 20 కోట్ల వరకు యువతకు రుణాలిస్తామన్నారు. ఐదో హామీగా సామాజిక తెలంగాణ సాధనకు కృషి చేస్తామని పునరుద్ఘాటించారు.

రైతాంగ సమస్యలకు పెద్దపీట

ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం, మొక్కజొన్నల కొనుగోలులో ప్రభుత్వం ఫెయిలైపోయిందన్నారు. అటువంటి పరిస్థితులు లేకుండా రైతంగా సమస్యకు టీఆర్ఎస్ పెద్దపీట వేస్తుందన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో రైతు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తాం అన్నారు. పంట కొనుగోలు సమస్యలు లేకుండా చూస్తాం అన్నారు. ఇటీవల ‘జాగృతి జనబాట’లో భాగంగా తాను కలిసిన ఒక రైతు, మరుసటి రోజే గుండెపోటుతో మరణించడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఒక రైతు మరణం కేవలం ఒక చిన్న వార్తగా మిగిలిపోవడం విచారకరం అన్నారు. తన జీవిత అనుభవాలు మనిషి ప్రాణం విలువను నేర్పాయని, అందుకే పూర్తి నిబద్ధతతో రైతుల పక్షాన నిలబడతాం అని తెలిపారు.

ఉద్యోగ, ఉపాధి సమస్యపై మాకు విజన్ ఉంది..

ఉపాధి కల్పన హామీ అంటే ఇప్పుడో జోక్ అయిపోయిందన్నారు. అయితే టీఆర్ఎస్ గూగుల్, వాట్సాప్, అమెజాన్ వంటి పరిశ్రమలను తీసుకురావడం ద్వారా ఉపాధి కల్పన హామీ అమలు చేస్తాం అన్నారు. చెప్పినట్లుగా రుణాలు అందిస్తాం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టులు, టీచర్లు, ప్రభుత్వ శాఖల ఖాళీల భర్తీతో ఉద్యోగాల హామీ నెరవేరుస్తాం అన్నారు. ఉద్యమ కారులకు లక్ష సూపర్ న్యూమరీ పోస్టులు ఇస్తాం అన్నారు. విద్య, వైద్య, ఉపాధిలో ప్రధమ ప్రాధాన్యత మహిళలకే ఉంటుందని తెలిపారు.

సామాజిక న్యాయ సాధనపై నిబద్దతో ముందడుగు

సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణలో భాగంగా అన్ని వర్గాలకు న్యాయం అందించే విధానాలు అమలు చేస్తాం అని కవిత తెలిపారు. సబ్ ప్లాన్ నిధులను ఆ వర్గాలకే వినియోగిస్తామని వెల్లడించారు. సామాజిక న్యాయం పంచాయతీ తెలంగాణలో దశాబ్దాలుగా సాగుతుందని, ఇందుకోసం నేను మొదటి నుంచి పోరాడుతున్నానని, టీఆర్ఎస్ పార్టీగా కూడా పోరాటం కొనసాగుతుందన్నారు. నేటి ప్రభుత్వాలకు అమ్మతనం లేనందునే ప్రజా సమస్యలపై సరైన స్పందన లేదని, అందుకే అమ్మ మనసుతో ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని, మదర్లీ టచ్ తో కూడిన పాలన అందిస్తాం అని చెప్పారు. 60వేల పైచిలుకుగా ఉన్న భూనిర్వాసితులకు టీఆర్ఎస్ అండగా పోరాడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపైన, ప్రజాసమస్యలపై టీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. వెలుగుమట్ల, కుమ్మెర ఘటనలు, గురుకులాల్లో పిల్లల దుస్థితి అమానవీయంగా ఉన్నాయన్నారు. నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ హామీ సహా కాంగ్రెస్ ఎన్నికల హామీలపై నిలదీస్తాం అన్నారు. తెలంగాణ యువత, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతారని చెప్పారు.

బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు కూడా..

కాంగ్రెస్ ఫ్యూచర్ సిటీ అంతా రియల్ ఎస్టేట్ కోసమే అని కవిత ఆరోపించారు. మహిళలపై అత్యాచారాలు రేవంత్ పాలనలో పెరిగిపోయాయన్నారు. తెలంగాణలో అధికారిక లెక్కల ప్రకారమే నిత్యం ఏడుగురు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. మత ఘర్షణలు జరుగుతున్నాయన్నారు. ప్రజలను సీఎం కలిసే దిక్కు లేదన్నారు. రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ కు రావడం లేదని, ఆయనకు కూడా వాస్తు భయం పట్టుకున్నట్టుందన్నారు. హైడ్రా పేరుతో జనాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారని,మంత్రులు, కుటుంబ సభ్యుల వద్దకు మాత్రం పోవడం లేదన్నారు. బతుకమ్మ కుంట వివాదంతో ప్రభుత్వం నవ్వుల పాలైందన్నారు. ప్రజలంటే లెక్కలేని తనంతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయినట్లుగా కాంగ్రెస్ సర్కార్ కూడా కూలిపోతుందన్నారు.

రాజకీయ నేతగానే కేసీఆర్ పై విమర్శలు

నేను మానాన్న కేసీఆర్ ను నేను విమర్శించలేదని, నాన్నతో నాకు ఎలాంటి సమస్య లేదని, ఆయన లేకపోతే నా జన్మలేదని.. నేను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైన రాజకీయ నేత కేసీఆర్ ను మాత్రమే విమర్శించడం జరిగిందని కవిత స్పష్టం చేశారు. తొమ్మిదిన్నరేళ్లు పాలించిన నేతగా ఆయన వైఫల్యాలను ప్రశ్నించడం, విమర్శించడం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి పథకాలకు 1లక్ష 20వేల కోట్లు పెట్టి కేవలం 1లక్ష ఎకరాలకే నీరు ఇచ్చారని దీనిపై విమర్శలు చేశానన్నారు. పేపర్ల లీక్ లు, ఉద్యోగ కల్పనలో బీఆర్ఎస్ వైఫల్యాలతో యువత నష్టపోయారని అందుకే విమర్శలు చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సేన తెలంగాణ రక్షణ సేనగా పేరు మార్పుకు ముందు ఎదురైన అనేక కుట్రలను అధిగమించేందుకు పార్టీ పేరు విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి వచ్చిందన్నారు.

బీజేపీకి తెలంగాణకు స్పేస్ లేదు

తెలంగాణకు పదేళ్లలో ఒక్క రూపాయి ఇవ్వలేదని, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ముందుగా రాష్ట్రానికి నిధులు తేవడానికి ప్రయత్నించాలని కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీకి స్పేస్ లేదన్నారు. త్వరలో ప్రధాని మోదీ వస్తున్నందునా నిధులు తీసుకొచ్చేందుకు, మహిళ బిల్లుకోసం ప్రయత్నం చేయాలన్నారు. నా పార్టీపై కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న సైటైర్లకు భవిష్యత్తు సమాధానం చెబుతుందని, రాజకీయ పార్టీ అంటేనే పవర్ సెంటర్ గా చూడాలన్నారు. డెడ్ లైన్ పెట్టి సొంత ప్రజలను చంపుకుంటున్న వింత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని,దానికి సామాజికన్యాయం పట్టదని, అందుకే బీసీ బిల్లు,మహిళా బిల్లును అమలు చేయదని విమర్శించారు. సైద్దాంతికంగా,తెలంగాణ హక్కుల సాధన నేపథ్యంగా బీజేపీపై నా పోరాటం కొనసాగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి లక్షన్నర కోట్ల మేరకు ఆదాయం వస్తుందని, అప్పులు ఏటా లక్ష కోట్లు తేస్తున్నారని వాటితో హామీల అమలు చేయవచ్చన్నారు.

బీఆర్ఎస్ నాయకత్వాన్ని సరైన రీతిలో ప్రశ్నించలేకపోయాను

నేను బీఆర్ఎస్ ఉన్నప్పుడు జరుగుతున్న లోపాలపైన, కాళేశ్వరంలో జరిగిన అవినీతిపైన కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని, అయితే నేను మరింత గట్టిగా పోరాడాలేకపోయానని అందుకే ప్రజలకు క్షమాపణ చెప్పానని, నన్ను రాళ్లతో కొట్టిన తప్పులేదని కవిత వ్యాఖ్యానించారు. రాజ్యాంగ బద్దంగా నడిచే పార్టీలో నన్ను మాత్రం నేరుగా సస్పెండ్ చేసి..రకరకాల ఆరోపణలు వచ్చిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి మాత్రం షోకాజ్ నోటీస్ ఇచ్చారని..అటువంటి పార్టీతో మా పార్టీని పోల్చవద్దన్నారు. బీఆర్ఎస్ ను ప్రజలు వద్దనుకున్నారని, ఆ పార్టీ ప్రజలతో లేదని, మా పార్టీ ప్రజలతో మమేకం అవుతుందని కవిత తెలిపారు. మా పార్టీలో మహిళలకు 33శాతం ప్రాతినిధ్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. పార్టీ నడిపే శక్తి సామర్థ్యం ఉందా అని నన్ను అడుగుతున్నారని, అదే కేసీఆర్ కొడుకు పెడితే ఇలా అడిగే వారు కాదని, దేశాన్ని పాలించే శక్తి ఉన్న మహిళ పార్టీని ఎందుకు నడపలేదని ప్రశ్నించారు. ప్రజలు ఆదరిస్తే ఎవరైనా అధికారంలోకి రావచ్చన్నారు.

కేడర్ బేస్ పార్టీగానే టీఆర్ఎస్ ప్రయాణం

ప్రభుత్వ పాలనా ప్రయోజనాలు చిట్టచివరి వ్యక్తికి అందించేందుకే మేం సర్వోదయ నినాదంతో పాంచజన్య మార్గంలో వెళుతున్నామని కవిత తెలిపారు. మా పార్టీ కేడర్ బేస్ తో నడిచే పార్టీగా కొనసాగుతుందన్నారు. లీడర్ ను ప్రజలే తయారు చేస్తారని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమంపై చిన్నచూపు వహించడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం ధోరణిలో తేడా లేదని కవిత విమర్శించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో మా పార్టీ ప్రాధాన్యతనిస్తుందన్నారు. హరీశ్ రావును టార్గెట్ ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణకు ఎవరైతే విలన్..వారే నాకు విలన్ అని చెప్పారు.

చట్టాలు..అధికార బలంలో ఏ భావజాలాన్ని అణిచివేయలేరు

మావోయిస్టుల భావజాలమే కాదు ఏ భావజాలాన్నైనా చట్టాలతో అణిచివేయలేమని, అందుకే ఆపరేషన్ కగార్ ను నేను వ్యతిరేకించానని కవిత తెలిపారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టులను మా పార్టీ ఆహ్వానిస్తుందని, ఏ పార్టీలో ఉన్న ప్రజాసమస్యలపై స్పందించాలని కోరుతున్నానని తెలిపారు. భావ సారూప్యత ఉన్న పార్టీలతో ఎన్నికల్లో పొత్తులకు మా పార్టీ టీఆర్ఎస్ సిద్దం అని వెల్లడించారు.

నా వెనుక సీఎం రేవంత్ ఉన్నారనడం అవాస్తవం

నా వెనుక సీఎం రేవంత్ రెడి ఉన్నారన్న ఆరోపణలు అవాస్తవం అని, నేను ప్రజలను నమ్మి ముందుకెళుతున్నానని కవిత స్పష్టం చేశారు. నన్ను చూస్తే మహిళలకు ధైర్యం వచ్చేలా నా రాజకీయాలు ఉంటాయని కవిత స్పష్టం చేశారు. దేశంలోనే తొలిసారి ఒక తండ్రిని ఎదురించి మరీ.. ఒక కూతురు సొంతగా పార్టీ పెట్టడం జరిగిందని, కచ్చితంగా నన్ను చూసి చాలామంది మహిళలు ఇన్ స్పైర్ అవుతున్నారన్నారు. రాజకీయ ప్రత్యర్థులు నా పార్టీని ఏ విధంగా అంచనా వేసినా అది వారి ఇష్టం అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు విషయంలో సాంకేతిక అంశాలను ఇప్పటికే దాటినట్లుగా భావిస్తున్నామని తెలిపారు. జమిలీ ఎన్నికలు వస్తే, డీలిమిటేషన్ జరిగితే ఏర్పడే రాజకీయ పరిణామాల్లో జాతీయస్థాయిలో ఉన్న ఎన్డీఏ, ఇండియా కూటములకు భిన్నంగా సొంత ఐడెంటితో సాగే ప్రయత్నం చేస్తామని, అప్పటి పరిస్థితుల మేరకు నిర్ణయాలు ఉంటాయన్నారు.

ఇవి కూడా చదవండి :

ప్రమాదానికి ముందు ఏం జరిగింది..వైరల్ గా నర్మదా బోటు వీడియోలు
సుప్రీంకోర్టులో తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

Latest News