విధాత, హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్ చేసిన రూ.8 లక్షల కోట్ల అప్పు తెలంగాణ పాలిట ముప్పుగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వడ్డీలు కట్టగా మిగిలిన డబ్బుతోనే సర్ధుబాట్లు చేసుకుంటూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కాంగ్రెస్ పాలనతోనే సాధ్యం అన్నారు. బీసీల లెక్కలు తేల్చిన తొలి ప్రభుత్వం మాదేనని అన్నారు. కల్వకుంట్ల కుటుంబ పాలనలో కేసీఆర్ సీఎం అయితే.. ఆయన కుమారుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారని, కొడుకు,అల్లుళ్లు, కూతుర్లకే మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్సీ పదవులు దక్కాయని గుర్తు చేశారు. కానీ రేవంత్ ముఖ్యమంత్రి అయితే.. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ అయ్యారని.. అలాగే కాంగ్రెస్ పాలనలో సీతక్క, వాకిటి శ్రీహరి మంత్రులయ్యారని గుర్తు చేశారు.
ప్రజాపాలనలోనే ఉద్యమకారులకు గుర్తింపు..
బీఆర్ఎస్ పాలకులు నాడు గొర్రెలు, బర్రెలు, చేపలు పంపిణీ చేసి.. వాళ్ల పిల్లలు మాత్రం రాజ్యం ఏలేలా చేశారని, మనల్ని కుల వృత్తులకే పరిమితం చేయాలని చూశారు’ అని రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రజాపాలనలోనే ఉద్యమకారులకు కీలక పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ, చాకలి ఐలమ్మ మనవరాలికి పదవులిచ్చామని పేర్కొన్నారు. అయితే కేసీఆర్ మాత్రం ఎర్రబెల్లి, వినోద్‌రావుకు పదవులిచ్చారని విమర్శించారు. కేసీఆర్ సీఎం అయితే.. వారి కుటుంబ సభ్యులకు పదవులు, వేల ఎకరాల ఫామ్‌హౌజ్‌లు వచ్చాయని ఎద్దేవా చేశారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు ఇందిరమ్మ ఇళ్లు వస్తున్నాయని వివరించారు. దిశ బాగుంటుందని కేసీఆర్ కొత్త సచివాలయం కట్టుకున్నారని తెలిపారు. కానీ కేసీఆర్ దిశ, దశ బాగా లేదు.. అందుకే తాను, భట్టి సచివాలయంలో ఉన్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.
అప్పుల తిప్పలను అధిగమిస్తునే మేం సంక్షేమ పథకాలు అమలుతో ముందుకెలుతుంటే… ప్రతిపక్షంలో ఉన్న బావబావమరుదులు కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రంలో కరవు రావాలని అఘోరా పూజలు, చేతబడులు చేయించారని మరోసారి విమర్శించారు. సాధారణంగా ఊళ్లలో చేతబడులు చేసేవారిని చెట్లకు కట్టేసి కొడతారని, ప్రజలు కష్టపడి తెచ్చుకున్న ఈ ‘ప్రజాపాలన’ను కాపాడుకోవాలంటే..మళ్లీ పాత దొరల పాలన రావడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వొద్దని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ దుష్ప్రచారం
చరిత్రను చెప్పుకోవడంలో మనం వెనుకబడ్డామని, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అక్రమ సంపాదనతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ విమర్శించారు. 2029లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని సీఎం రేవంత్ జోస్యం చెప్పారు. డీలిమిటేషన్ జరిగితే 117 సీట్లతో అధికారంలోకి వస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మళ్లీ పవర్లోకి రావాలంటే గౌడ కులస్తుల సహకారం కావాలని కోరారు. బహుజనుల నుంచి పుట్టుకొచ్చిన గొప్ప వీరుడు పాపన్న గౌడ్ అని కొనియాడారు. పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉందని.. కానీ గత బీఆర్ఎస్ సర్కార్ బహుజనుల అభిప్రాయాన్ని పట్టించుకోలేదన్నారు.
బహుజనుల కోరిక మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం సర్వాయి పాపన్న విగ్రహాన్ని నగరం నడిబొడ్డున ఏర్పాటు చేసిందన్నారు. ఇది బహుజనుల తెలంగాణ అని అన్నారు. ఇందిరమ్మ పాలన సామాజిక న్యాయం, సమానమైన అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. ఇప్పుడు ట్యాంక్ బండ్ కు వచ్చే ప్రతిఒక్కరూ సర్వాయి పాపన్న విగ్రహం చూసి ఆయన చరిత్ర తెలుసుకుంటారని అన్నారు. అమరవీరుల స్తూపానికి ఉన్న ప్రాధాన్యతే పాపన్న విగ్రహానికి ఉండాలని స్పష్టం చేశారు. సర్వాయి పాపన్న వీరగాథను లండన్‌లోని బ్రిటీష్ లైబ్రరీలో సైతం భద్రపరిచారని సీఎం గుర్తుచేశారు. మహారాష్ట్ర వాసులకు శివాజీ మాదిరిగా తెలంగాణకు పాపన్న గౌడ్ నిలిచి ఉంటారన్నారు.
విద్యతోనే తలరాతలు మారుతాయి…
తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నేత, గీత కార్మికులకు పెన్షన్లు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని సీఎం తెలిపారు. ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నా ఈత, తాటి చెట్లను పెంచాలని పిలుపునిచ్చారు. కుల వృత్తులను గౌరవిస్తూనే పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని, పిల్లల చదువు కోసం ఎన్ని వందల కోట్లయినా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే బాధ్యత నాదని.. ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదివించే బాధ్యత నాదన్నారు. మన పిల్లలు బాగుపడాలంటే చదువు ఒక్కటే పరిష్కారమని పేర్కొన్నారు. కష్టమైనా.. నష్టమైనా పిల్లలను ప్రభుత్వ బడులకు పంపాలని సూచించారు.
