KCR : సారొస్తున్నారు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి కేసీఆర్.. స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో మాజీ సీఎం!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి మాజీ సీఎం కేసీఆర్ రాబోతున్నారు. బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కేసీఆర్ పేరు ఉండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం.

విధాత : తెలంగాణలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హవా నడుస్తోంది. నవంబర్ 11న హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్ జరగనుంది. ఈ నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఇప్పటికే ఆయా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా.. నేటితో నామినేషన్ దాఖలుకు గడువు ముగిసింది. దీంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
ఈ క్రమంలో పార్టీలు తమ ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించగా.. తాజాగా బీఆర్ఎస్ పార్టీ కూడా తమ స్టార్ క్యాంపెయినర్ల లిస్టును విడుదల చేసింది. మొత్తం 40మందితో కూడిన పేర్ల జాబితాను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ విడుదల చేశారు. కాగా, ఈ లిస్టులో అందరూ ఊహించినట్లుగానే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కూడా ఉంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అలాగే, జూబ్లీహిల్స్ ప్రచారంలో స్టార్ క్యాంపెనర్లుగా కేసీఆర్ తో పాటు, హరీశ్ రావు, పద్మారవు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా మరో 36 మంది నేతలు ఉన్నారు.
కాగా, కేసీఆర్ ప్రజల మధ్యకు వచ్చి చాలా నెలలు అవుతోంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాకే కేవలం ఎర్రవెళ్లిలోని తన ఫాం హౌస్ కే పరిమితమయ్యారు కేసీఆర్. పార్టీకి సంబంధించి కీలక సమావేశాలు, భేటీలు ఫాంహౌస్ లోనే నిర్వహించారు. ఈ క్రమంలో కేసీఆర్ ఆరోగ్యంపై కూడా అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. తాజాగా, జూబ్లీహిల్స్ ప్రచారంలో ఆయన పాల్గొనబోతుండడంతో అన్ని రకాల అనుమానాలు పటాపంచలయ్యాయి. ఇక తమ పెద్ద సార్ ప్రజల వద్దకు రాబోతున్నారని బీఆర్ఎస్ వర్గాలు తెగ సంతోషపడిపోతున్నాయి. సారు రాకతో కారు పార్టీ జూబ్లీహిల్స్ లో దూసుకుపోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.