కేసీఆర్ సంచలన నిర్ణయం.. రాష్ట్ర కమిటీ తప్ప మిగతా కమిటీలన్నీ రద్దు

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేసీఆర్ కీలక ప్రకటనలు చేశారు. ఈసారి ముఖాలు చూసి టికెట్లు ఇవ్వబోమని, రాష్ట్ర కమిటీ మినహా మిగతా కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో తెలంగాణ భవన్‌లో వేదికపై నాయకులతో కలిసి ప్రసంగిస్తున్న కేసీఆర్

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ మాట్లాడుతున్న కేసీఆర్

KCR Warns Leaders: Be Active at Ground Level for Next Elections

హైలైట్స్

  • ఈసారి ముఖాలు చూసి టికెట్లు ఇవ్వమని కేసీఆర్ స్పష్టం
  • రాష్ట్ర కమిటీ తప్ప మిగతా అన్ని కమిటీల రద్దు
  • ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సభ్యత్వ నమోదు ప్రారంభం
  • కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ ఘాటు విమర్శలు

విధాత తెలంగాణ డెస్క్​ | 27 ఏప్రిల్​ 2026 | హైదరాబాద్​:

KCR Warns Leaders: బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఈసారి ముఖాలు చూసి టికెట్లు ఇచ్చేది లేదని, క్షేత్రస్థాయిలో పని చేసిన వారికే ప్రాధాన్యం ఉంటుందని ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

పదేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పటికీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో ఆత్మవిమర్శ చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. 60 లక్షల సభ్యత్వాలు ఉన్నా పరాజయం ఎందుకు ఎదురైందో విశ్లేషించుకోవాలని అన్నారు. ఇకపై సభ్యత్వాల విషయంలో సంఖ్య కంటే నాణ్యత ముఖ్యం అని, “రాశి కాదు వాసి ముఖ్యం” అని వ్యాఖ్యానించారు. ప్రతి నియోజకవర్గంలో నాయకులు ప్రజల్లో ఉండి పార్టీ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.

కమిటీలన్నీ రద్దు.. కొత్త కమిటీల నిర్మాణానికి ఆదేశం

రాష్ట్ర కమిటీ మినహా మిగతా అన్ని పార్టీ కమిటీలను రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ సంచలన ప్రకటన చేసారు. త్వరలోనే కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వెంటనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ను ఆదేశించారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్లు వెల్లడించారు. సాధారణ సభ్యత్వానికి రూ.10, క్రియాశీల సభ్యత్వానికి రూ.50గా రుసుమును నిర్ణయించినట్లు తెలిపారు.

అదే విధంగా ప్రతి జిల్లాకు ఒక రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని ఇన్‌ఛార్జ్‌గా నియమించి సభ్యత్వ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ఎంపిక చేసిన కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందని కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధాన్యం కొనుగోలు చేయడం కూడా చేతకావడం లేదని విమర్శించారు. తెలంగాణలో ఏం జరుగుతోందో ప్రజలకు అర్థం కావడం లేదని అన్నారు. ఇది ఒక చిల్లర ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను కాంగ్రెస్ నేతలు పెంటకుప్పగా మార్చారని మండిపడ్డారు.

కాగా, రాష్ట్రంలో పండిన పంటలన్నీ ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ తీర్మానం చేసింది. మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని కూడా డిమాండ్ చేసింది. పంటల కొనుగోళ్లపై నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు.

Latest News