విధాత, హైదరాబాద్ : రైతు పక్షపాతిగా వ్యవహరించే మాజీ సీఎం కేసీఆర్ మరోసారి రైతుల కోసం తన మౌనం వీడి వార్తల్లో నిలిచారు. ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ లో ఉంటున్న కేసీఆర్ రైతుల కోసం నీటి విడుదల చేయాలంటూ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడటం వైరల్ గా మారింది. కేసీఆర్ ఫోన్ కాల్ తో కొండపోచమ్మ సాగర్ జలాశయం నుంచి అధికారులు నీటి విడుదల చేయడం చర్చనీయాంశమైంది.
కొండపోచమ్మ సాగర్ జలాశయం నంచి సంగారెడ్డి, ఆలేరు కాలువల ద్వారా సాగునీటి అవసరాలకు చాలా రోజులుగా నీటి విడుదల కొనసాగుతుంది. అయితే ఇదే సమయంలో సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొట్యాల, అల్లీనగర్, అడవి మజీద్, క్షీర సాగర్, జప్తి సింగాయపల్లి వరకు ఉన్న కాలువకు ఇంతవరకు నీటిని వదల్లేదు. ఆయా గ్రామాల పరిధిలో పంటలు ఎండిపోతున్నాయని, నీటిని విడుదల చేయించాలని రైతులు ఫామ్ హౌజ్ కు వెళ్లి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు.
రైతుల ఇబ్బందులపై స్పందించిన కేసీఆర్ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడారు. పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే నీటిని విడుదల చేయాలని అధికారులకు సూచించారు. కేసీఆర్ ఫోన్ తో అధికారులు నీటి విడుదల విడుదల చేశారు. దీంతో రైతులు మాజీ సీఎం కేసీఆర్ కు తమ కృతజ్ఞతలు తెలిపారు.
