విధాత : ఇటీవల అకాల మరణం పొందిన నర్సంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ తన ఎర్రవెల్లి నివాసం నుంచి బయలుదేరి నల్లబెల్లికి చేరుకున్నారు. సుదర్శన్ రెడ్డి అకాల మరణంతో, శోకతప్త హృదయులై, కష్టకాలంలో ఉన్న ఆయన భార్య బిడ్డలను, కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించి ఓదార్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరుపునా ప్రకటించిన రూ 2.25కోట్ల ఆర్థిక సహాయాన్ని కేసీఆర్ పెద్ది కుటుంబానికి అందించారు. ఆయన పిల్లల భవిష్యత్తు, వారి చదువు, తదితర కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు.
పెద్ది కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న కేసీఆర్ కు దారి వెంట పలు ప్రాంతాలలో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. భువనగిరి, ఆలేరు, బహుపేట వద్ద కేసీఆర్ కు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం తెలిపాయి. దారి పొడవునా నిలబడి కేసీఆర్ కు అభివాదం చేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ అంటూ నినదిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్ పలు చోట్ల కారు దిగి కార్యకర్తలకు, ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.
కేసీఆర్ వెంట ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్, కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, అనిల్ జాదవ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, యాదవరెడ్డి, శంభీపూర్ రాజు, శేరి సుభాష్ రెడ్డి, క్రాంతి కిరణ్ తదితరులు ఉన్నారు.
