Revanth Reddy । కేసీఆర్ ఆలోచనా విధానంలో మార్పు రావాలి: సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy । కాంగ్రెస్ ప్రభుత్వం రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో రాష్ట్ర ఖజానాను కేసీఆర్‌కు అప్పగిస్తే.. పదేళ్ల పాలనా కాలం తర్వాత ఆయన రూ.7 లక్షల కోట్ల అప్పుతో తమకు అప్పగించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ పాలనా కాలంలో చేసిన అప్పులు.. తప్పులు సరి చేయడానికి తమకు సమయం పడుతోందని అన్నారు. ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పని చేసిన కేసీఆర్ తన అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న హరీశ్ రావు ఆయను కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చారని… కాంగ్రెస్‌లో చేరేందుకే హరీశ్‌రావు కలిశారనే విమర్శలు నాడు వచ్చాయని సీఎం అన్నారు. సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం రాజశేఖర్ రెడ్డిని కలిశానని హరీశ్ చెప్పారని.. ఇప్పుడు అలానే కలిసి సమస్యలు విన్నవించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పాలక, ప్రతిపక్షాలు కలవకుండా చేసింది కేసీఆరేనని, శత్రు దేశ సైనికుల్లా రెండు పక్షాలను మార్చివేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్‌లో మానసిక పరివర్తన రావాలని అన్నారు. కేంద్రం నుంచి సాధించాల్సిన అంశాలపై రాష్ట్రంలో 17 మంది లోక్‌సభ, ఏడుగురు రాజ్యసభ సభ్యులకు సూచనలు ఇచ్చేందుకు కలిసి రావాలని కేసీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.
ఆటబొమ్మలు విరగ్గొట్టే పిల్లల్లా…
కేసీఆర్ పదేళ్ల పాలన కాలంలో చేసిన అప్పులకు రూ.6,500 కోట్లు నెలకు వడ్డీ కడుతున్నామని.. రాష్ట్రంలో ఉద్యోగుల జీతభత్యాలకు ఎంత ఖర్చవుతుందో కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ అంత అవుతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాము అభివృద్ధి.. సంక్షేమం రెండింటిన సమతూకం చేసుకుంటూ ముందుకు పోతుంటే చిన్న పిల్లల్లా కేటీఆర్, హరీశ్ రావు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ వాళ్లు చేయలేనిది తాము ఏడాది కాలంలోనే చేస్తుంటే.. హోం వర్క్ చేయని పిల్లలు హోం వర్క్ చేసిన పిల్లాడి నోట్సు చింపివేసినట్లు.. పక్కన వాడి చేతిలో ఆట బొమ్మలు విరగొట్టే చిన్న పిల్లల్లా ఆ ఇద్దరు (హరీశ్‌రావు, కేటీఆర్‌ను ఉద్దేశించి) ప్రవర్తిస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. తాము చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకునేందుకు మారీచు సుబాహుల్లా, రాహు కేతువుల్లా వారు అడ్డుపడుతున్నారని సీఎం మండిపడ్డారు. తమకు భేషజాలు లేవని వయసులో, అనుభవంలో కేసీఆర్ పెద్ద వారని, ఆయన పెద్దరికాన్ని నిలుపుకోవాలని, తప్పులు చేస్తున్న తమ పిల్లలకు బుద్ది చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శాసన సభలో పాలక పక్షానికి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రతిపక్షానికి అంతే ప్రాధాన్యత ఉందని సీఎం అన్నారు.. కేసీఆర్ సభకు వచ్చి తాము పాటించే విధానల్లో ఏవైనా లోపాలుంటే తెలియజేయాలని సీఎం సూచించారు.
కేసీఆర్.. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ఆహ్వానం…
సచివాలయంలో డిసెంబరు 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా 7, 8, 9 తేదీల్లో సచివాలయ ప్రాంగణం.. నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో తెలంగాణ సంబరాలు అద్భుతంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజలంతా వాటిలో పాల్గొనాలని సీఎం పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ప్రతిపక్ష నేత కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు ఎంఐఎం, సీపీఐ, ఇతర ప్రతిపక్ష నేతలను ఆహ్వానిస్తున్నట్లు సీఎం తెలిపారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, షబ్బీర్ అలీ , ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ చిన్నా రెడ్డి, సీఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.