గాంధీ భవన్‌కు ఖమ్మం కాంగ్రెస్ పంచాయితీ

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్గపోరు గాంధీభవన్ ను తాకింది. నామినేటెడ్ పదవుల విషయంలో జరిగిన అన్యాయంపై ఎంపీ రేణుకా చౌదరి వర్గం భగ్గుమంది. గాంధీ భవన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.

విధాత, హైదరాబాద్ : ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్గపోరు గాంధీభవన్ ను తాకింది. జిల్లా నుంచి కీలక హోదాల్లో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో పాటు ఎంపీ రేణుకా చౌదరీ రూపంలో మరో సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు జిల్లా కాంగ్రెస్ రాజకీయాలను శాసిస్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల భర్తీలో రేణుకా చౌదరి వర్గీయులకు తగిన స్థానం దక్కకపోవడంతో వారంతా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. తన వర్గీయులకు నామినేటెడ్ పదవుల విషయంలో జరిగిన అన్యాయంపై భగ్గుమన్న రేణుకా చౌదరి సీఎం రేవంత్ పైన, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పైన మండిపడుతున్నారు. నామినేటెడ్ పోస్టుల పంపకంలో తమ వర్గం వారిని విస్మరించారని రేణుకా వర్గం ఆగ్రహంతో ఉంది.

గాంధీ భవన్‌లో రేణుకా చౌదరి వర్గీయుల ఆందోళన

నామినేటెడ్ పదవుల భర్తీలో అన్యాయం జరిగిందని మండిపడుతున్న రేణుక చౌదరి వర్గీయులు శుక్రవారం హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్ కు చేరుకుని తమ అసమ్మతిని వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. డిప్యూటీ సీఎం భట్టి వర్గానికే అన్ని పదవులు ఇచ్చారంటూ రేణుకా చౌదరి వర్గం ఆగ్రహం వెళ్లగక్కింది. నిజమైన కాంగ్రెస్ వాదులకు కాకుండా కొత్తవారికి పదవులు ఇస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. చెప్పులు మోసిన వారికి పదవులు ఇస్తున్నారు అంటూ పీసీసీకి ఫిర్యాదు చేశారు. ఓడిపోయిన వారికి కమ్మ కార్పొరేషన్ ఎలా ఇస్తారంటూ రేణుక వర్గం ప్రశ్నించింది. దీంతో ఖమ్మం కాంగ్రెస్ రాజకీయాల్లో నెలకొన్న వర్గపోరు రచ్చకెక్కినట్లయ్యింది.

Latest News