లక్షకోట్లు తిన్నవాళ్లను ఊరికే వదిలిపెట్టం: మంత్రి కోమటిరెడ్డి
కాళేశ్వరం కుంభకోణంపై కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, లేకుంటే రాజీనామా చేయాలని మంత్రి కోమటిరెడ్డి డిమాండ్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ రావాలి.. లేదంటే రాజీనామా చేయాలి
హైదరాబాద్, ఆగస్ట్ 30(విధాత): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అన్నీ తానే అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్.. అసెంబ్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే తప్పు ఒప్పుకున్నట్లేనని అన్నారు. తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుంటే తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు. కాళేశ్వరం కేసీఆర్ హయాంలోనే రికార్డు స్థాయిలో కట్టారు..ఆయన హయంలోనే కూలిందని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరంపై వేసిన కమిషన్ జడ్జి జస్టిస్ పీసీ ఘోష్ సుప్రీం కోర్టు జడ్జిగా పనిచేశారు, ఆయన మంచి పేరున్న న్యాయ మూర్తి అని కోమటిరెడ్డి వెల్లడించారు. ఆయన సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దానికి భయపడే కేసీఆర్, హరీష్ రావు కోర్టుకు పోయారన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక తప్పు అని భావిస్తే.. కేసీఆర్ అసెంబ్లీ వచ్చి చెప్పాలన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ జీత భత్యాలు తీసుకుంటున్నాడు, ఆయనపై బాధ్యత ఉంటుందన్నారు.
కాళేశ్వరంపై చర్చ పెడితే అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌంట్ చేయకుండా.. మా మీద పూలు చల్లుతారా అని చమత్కరించారు. కాళేశ్వరం పూర్తి నివేదికపై కంప్లీట్ గా చర్చ ఉంటుందన్నారు. కాళేశ్వరం పై లక్ష కోట్లు తిన్న వాళ్లను వదిలేస్తామా అని కోమటిరెడ్డి అన్నారు. ప్రజల ముందు దోషులుగా నిలబెడతాంమని, వాళ్లను ఏం చేయాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ 10 ఏళ్లు డిండి, పాలమూరు లాంటి ప్రాజెక్టుల మీద ఎందుకు పెట్టలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.