విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆపార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ కౌరవ సైన్యంపై నైతిక విజయాన్ని మునుగోడు ప్రజలు తనకు అందించారని పేర్కొన్నారు.
కాగా.. ఎంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి ప్రచారంచేసి, కుట్రలు పన్నినా మునుగోడు ప్రజలు తనకు 87 వేల ఓట్లు వేశారన్నారు. వారికి అండగా వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుండే పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తంచేశారు. కొందరు కుట్రపూరితంగా కావాలని తనపై సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నరు అని అన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిలను తెలంగాణ ప్రజలు నమ్మరని, వాళ్లిద్దరూ ఒక్కటే అన్నారు. 2018 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆరెస్ లో చేరిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.