ఆంధ్రా తాబేదార్ల పాలనలోనే తెలంగాణ : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్

పోరాటాలు, బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంతో.. కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వారు, ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగే వారు నేడు ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తుండటం బాధాకరం, సహించరాని విషయం అని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు.

పోరాటాలు, బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంతో.. కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వారు, ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగే వారు నేడు ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తుండటం బాధాకరం, సహించరాని విషయం అని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో కళాకారుడు ఏపూరి సోమన్న 25 ఏళ్ల పాటల ప్రవాహంపై రూపొందించిన పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ మరోసారి సొంత పార్టీ ప్రభుత్వానికి, మంత్రులకు వ్యతిరేకంగా విమర్శలు సంధించారు.

మంత్రి పదవిపై నాన్చూడు ధోరణి అనుసరిస్తున్న  సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అసహనంతో ఉన్న రాజగోపాల్ రెడ్డి తాజాగా సొంత పార్టీ ప్రభుత్వంపై  చేసిన విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోపిడీకి పాల్పడుతున్న వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధం కావాలని, అందుకే ఏపూరి లాంటి కళాకారులు గజ్జ కట్టాలి..నేను రుమాలు చూడుతానంటూ తన భవిష్యత్ రాజకీయ కార్యచరణను రాజగోపాల్ రెడ్డి బయటపెట్టారన్న చర్చ సాగుతుంది.

దోపిడిదారులు వెంట పడుతాం..

ఏపూరి సోమన్న పాడిన..ఎవరి పాలైందిరో తెలంగాణ పాటలోని పరిస్థితులే నేడు రాష్ట్రంలో కొనసాగడం బాధకరం అని  రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు దోచుకుంటున్నారని..అలాంటి దోపిడీదారుల వెంట పడతామని, వారి దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. మా సహనాన్ని, ఓపికను చేతకాని తనంగా భావించవద్దని, ఇన్నాళ్లు సహనంగా ఉన్నామని, ఇక పోరాటానికి సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.

స్వరాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులకు, పేదలకు న్యాయం దక్కడం లేదని, అభివృద్ది పేరిట తెచ్చిన లక్షల కోట్ల అప్పుల నిధులు ఆంధ్ర కాంట్రాక్టర్లే దక్కుతున్నాయని విమర్శించారు. అధికారంలో ఉన్న వారు లక్షల కోట్లు దోచుకుంటుంటే పేదోడికి రూ. 5లక్షల ఇందిరమ్మ ఇంటి బిల్లుకు 500కొర్రీలు పెడుతున్నారని తప్పుబట్టారు.సీఎం రేవంత్ రెడ్డి మంచి చేస్తే మంచి అంటానని, చెడు చేస్తే తప్పు జరుతుందని చెప్తానని తేల్చి చెప్పారు. ఓ రాజకీయ పార్టీలో కొనసాగుతూ ఇంతకంటే ఎక్కువగా మాట్లాడలేనన్నారు.

తెలంగాణ ఓ ఒక్కరి రాజ్యం కాదు…

కేసీఆర్ తెలంగాణను తన రాజ్యంగా భావించారని, ఆయన తర్వాతా ఆయన కొడుకును యువరాజుగా చేయాలనుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ దోపిడిని, నియంతృత్వ విధానాలను ప్రశ్నించినందుకే మునుగోడులో నన్ను ఓడించేందుకు సర్వశక్తులొడ్డారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఒకరి రాజ్యం కాదని, 60ఏళ్లు కోట్లాది ప్రజలు ఉద్యమిస్తే వచ్చిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలోనూ పేదలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముక్కుసూటిగా నిజాయితీగా మాట్లాడితే.. రాజగోపాల్ రెడ్డి అధికార పక్షమా, ప్రతిపక్షమా అంటున్నారని..నేను ప్రజల పక్షం అని స్పష్టం చేశారు.

రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాలి..

రాష్ట్ర రాజకీయాలను మార్చే శక్తి తనకు ఉన్నదని, నిజాయితీ కలిగిన వారు తన వెంట నిలిస్తే తమిళనాడు తరహాలో రాజకీయ మార్పు తీసుకు రాగలనని రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోపిడీకి పాల్పడుతున్న వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధం కావాలని, అందుకే ఏపూరి లాంటి కళాకారులు గజ్జ కట్టాలి..నేను రుమాలు చూడుతానని అన్నారు. రానున్న కాలంలో నిజాయితీపరులు, యువకులు అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆకాంక్షించారు. ఏపూరి సోమన్న వంటి కళాకారులు ఉద్యమకారులకు తాను అండగా ఉంటానని, వచ్చే ఎన్నికల్లో సోమన్న చట్టసభల్లో అడుగుపెడతాడని భరోసా ఇచ్చారు.ప్రజలు, రైతులు, విద్యార్ధి, యువత, మహిళలకు న్యాయం కోసం పోరాటానికి తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు.

కులం కార్డుతో అక్రమ వసూళ్లు..

ఇప్పుడున్న నాయకులు గెలవక ముందు ఒక తీరుగా గెలిచిన తర్వాత మరో తీరుగా మారుతున్నారని, గెలిచాక తెల్లవారేసరికి పెద్ద పెద్ద కార్లు వస్తున్నాయని, లక్షల కోట్లు దోచుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. పదవులు కిరిటాలు కావని ప్రజలకు సేవ చేసే అవకాశం మాత్రమేనని అన్నారు. ఒకసారి గెలవగానే డబ్బు, అధికారం పదవిపై వ్యామోహం పెరుగుతుందని, గెలిపించిన ఓటర్లను వారు గాలికి వదిలేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే వారికి అండగా ఉండాలని.. కానీ అహంకారం పెంచుకోవద్దన్నారు. తను గెలిపించిన ఓ ఎమ్మెల్యే కులం కార్డును అడ్డుపెట్టుకొని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని పరోక్షంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తీరుపై మండిపడ్డారు.

తప్పుడు పనులు చేస్తూ కులాన్ని వాడుకోవడం మంచిది కాదని.. కులం, మతం కార్డుతో వసూలు రాజాలుగా మారిన నేతలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తాను డబ్బులు ఇస్తే లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో కొందరు నామినేషన్ వేశారని, కోట్లాది రూపాయల ఖర్చు చేసి వారిని గెలిపించానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కానీ ఇప్పుడు తాను పిలిస్తే వారు రారని, అధికారం ఉన్నచోటికి వెళ్తున్నారని కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Latest News