సీఎం రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేస్తున్న మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో ఒంటరినా?..లేక ఆమె తిరుగుబాటు వెనుక ఉన్న శక్తులు ఎవరన్న చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. తరుచూ తన సొంత ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలతో తీవ్ర విభేదాలు ఎదుర్కొంటుండటంతో పాటు పలుమార్లు వివాదస్పద వ్యాఖ్యలతో కొండా సురేఖ, మురళి, సుస్మితా పటేల్ లు తాము ఇబ్బంది పడటంతో పాటు పార్టీని, ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నారంటూ ఆమె వ్యతిరేక వర్గీయులు విమర్శిస్తున్నారు. నాగార్జున- సమంత ఎపిసోడ్ లో, ఓఎస్డీ సుమంత్ వసూళ్ల ఆరోపణల వ్యవహారంలో నేరుగా రేవంత్‌నే టార్గెట్ చేసినప్పుడు కూడా కొండా సురేఖ వ్యతిరేక వర్గీయులు ఆమెపై మూకుమ్మడి దాడితో హడావుడి చేశారు.
గంభీరంగానే కొండా…
ఇప్పుడు కూడా కొండా వ్యతిరేక వర్గంతో పాటు రేవంత్ మద్దతుదారులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొండా సురేఖకు వ్యతిరేకంగా బాహటంగానే మీడియా సమావేశం నిర్వహించి విమర్శలు చేయడంతో పాటు ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించాలంటూ పార్టీ హైకమాండ్ ను కోరారు. తనకు వ్యతిరేకంగా ఇంతమంది గళం విప్పుతున్నా..కొండా సురేఖ మాత్రం గంభీరంగా నింపాదిగా వ్యవహరిస్తుండటం పార్టీ వర్గాలను అశ్చర్యపరుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే తాను చెప్పాల్సినదంతా చెప్పానని..ఇంకా ఏదైనా ఉంటే సీఎం రేవంత్ రెడ్డిని కలిశాక చెబుతానంటూ ఆమె స్పష్టం చేశారు. కొండా సురేఖ వ్యవహారం ఆమె కోణంలోనే కాకుండా పార్టీలోని అంతర్గత ఆధిపత్య పోరుకు, అసలు కాంగ్రెస్..పసుపు కాంగ్రెస్ కు మధ్య నెలకొన్న విభేదాలకు కేంద్రంగా అధిష్టానం పరిశీలిస్తుంది.
కాంగ్రెస్ సీనియర్ నేతగా, బీసీ నేతగా, వరంగల్ జిల్లాలో కీలక నేతగా కొండా కుటుంబం కొనసాగుతుండటంతో పాటు అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ ఆధిపత్య పోరు నేపథ్యంలో కొండా సురేఖపై వేటుకు కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరిస్తుందా? లేదా? అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. సురేఖను హఠాత్తుగా బర్తరఫ్ చేస్తే తలెత్తే రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ అధిష్ఠానం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు సమాచారం.
కొండా సురేఖకు మద్దతుగా ఉన్న పెద్దలెవరు?
తనను మంత్రివర్గం నుంచి, పార్టీ నుంచి బర్తరఫ్ చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ఓవైపు పావులు కదుపుతున్నారని తెలిసినా..హైకమాండ్ సైతం కొండాపై చర్యలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం జరుగుతున్నా కొండా సురేఖ నుంచి కౌంటర్ ఎటాక్ కనిపించకపోవడం కాంగ్రెస్ శ్రేణులలో, రాజకీయ వర్గాలలోనూ ఆసక్తి రేపుతుంది. తన మంత్రి పదవి, రాజకీయ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడబోతున్నా కూడా కొండా సురేఖ ఎందుకు స్పందించకుండా..ఎదురుదాడి చేయకుండా నింపాదిగా ఉన్నారన్నచర్చ సాగుతుంది. కొండాపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే ఎదురయ్యే పరిణామాలు ఏమిటి?…అదే జరిగితే కొండా స్పందన ఏ విధంగా ఉండబోతుంది?..కొండాకు మద్దతుగా పార్టీలో ఎవరు నిలబడుతారన్న చర్చ పార్టీ వర్గాలను ఊపేస్తుంది. కొండాకు మద్దతుగా పార్టీలోని సీనియర్లు, పలువురు మంత్రులు ఉన్నారని..మంత్రివర్గం నుంచి, పార్టీ నుంచి కొండాను బర్తరఫ్ చేస్తే …ఆ తర్వాతా వారంతా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పేందుకు సిద్దంగా ఉన్నారన్న ప్రచారం వినిపిస్తుంది.
ఎవరి వెనుక ఎంత మంది ఉన్నారు..?
కొండా సురేఖకు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా నిన్న మీడియా సమావేశంలో 66మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కేవలం17మంది మాత్రమే హాజరయ్యారు. సీఎం రేవంత్ కోసం అతని మిత్రుడు ఎంపీ వేంరెడ్డి నరేందర్ రెడ్డి కనీసంగా 40మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రెస్ మీట్ కు హాజరు కావాలని ప్రయత్నించినప్పటికి 17మంది మాత్రమే ముందుకు వచ్చారని వ్యతిరేక వర్గం ఎత్తిచూపుతుంది. ప్రెస్ మీట్ కు హాజరైన ఎమ్మెల్యేలలో కూడా ఎంతమంది రేవంత్ పక్షాన కడవరకు గట్టిగా నిలబడుతారో లేదోనన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ రకంగా రేవంత్ రెడ్డికి పార్టీ ఎమ్మెల్యేలలో ఉన్న సంఖ్యా బలాన్ని ఈ పరిణామం చాటిచెప్పినట్లుగా ఉందని ప్రతిపక్షాలు చురకలేస్తున్నాయి. రేవంత్ రెడ్డికి అధిష్టానం వద్ద, ఎమ్మెల్యేలలో పట్టు సన్నగిల్లితే.. ఆయనపై కొండా సురేఖ బాటలోనే మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు తిరగబడవచ్చన్న ప్రచారం జోరందుకుంటుంది. కొండా సురేఖ, చిన్నారెడ్డి, రాజగోపాల్ రెడ్డిలపై చర్యలు తీసుకుంటే దాని ప్రభావం ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వం మనుగడపై పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు అప్పుడు రేవంత్ ప్రభుత్వానికి కీలకం కావచ్చని..వారిలో కూడా పలువురు రేవంత్ పట్ల అసమ్మతితో ఉన్నారని విశ్లేషిస్తున్నారు.
అటు కొండా సురేఖ వెనుక ఉన్న సీనియర్లు ఎవరన్నది చూస్తే..ఇప్పటివరకైతే బాహటంగా ఆమెకు మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ ముందుకు వచ్చి గళం విప్పలేదు. అదే సమయంలో మంత్రుల్లో ఎవరు కూడా రేవంత్ కు కూడా మద్దతుగా స్పందించకపోవడం గమనార్హం. ఈ పరిణామం రేవంత్ పట్ల కొందరు మంత్రులలో, ఎమ్మెల్యేలలో నెలకొన్న అసంతృప్తికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ పట్ల కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే చర్యల తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
