నా టార్గెట్ సీఎం రేవంత్ రెడ్డి మాత్రమేనని, కాంగ్రెస్ పార్టీ కాదు అని కొండా సుస్మిత స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తాను చేసిన వ్యాఖ్యలు పార్టీని ఉద్దేశించినవి కావని, నేను ఎక్కడా కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదని సుస్మిత మీడియాత తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, ఖర్గేలు అంటే నాకు గౌరవం ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, అతని సోదరులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు అని..అందుకే అతన్ని టార్గెట్ చేశానని వివరణ ఇచ్చారు.
ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడానికి సీఎం రేవంత్ రెడ్డికి ఏం అధికారం ఉందని, పరకాలకు వచ్చి వచ్చే ఎన్నికల్లో రేవూరి ప్రకాశ్ రెడ్డిని గెలిపించమని ఎలా చెబుతారని, కాంగ్రెస్ పార్టీలో పార్టీ టికెట్ల ఎంపిక కేవలం అధిష్టానం మాత్రమే చూస్తుందన్న సంగతి అందరికి తెలిసిందేనన్నారు. పరకాలలో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని కొండా సుస్మిత స్పష్టం చేశారు.
క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ
అంతకుముందు టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ జారీ చేసిన నోటీసుకు సంబంధించి అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తన వివరణతో లేఖను కమిటీ చైర్మన్ మల్లు రవికి పంపించారు. లేఖలో క్రమశిక్షణా కమిటీకి మంత్రి తన వివరణ ద్వారా స్పష్టతనిచ్చారు.
ఆగస్టు 19న తన జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘కొండా’ కుటుంబ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలుచోట్ల వేడుకలు నిర్వహించడంతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టారని లేఖలో మంత్రి తెలిపారు. తన స్వస్థలమైన గీసుకొండతో తన కూతురు సుస్మితా పటేల్ కు వున్న ప్రత్యేక అనుబంధం కారణంగా అక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు నిర్వహించిన జన్మదిన వేడుకల్లో తన కుమార్తె కొండా సుస్మితా పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారని వివరించారు.
ఆ కార్యక్రమంలో తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమని మంత్రి స్పష్టం చేశారు. కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం, ఆ ప్రాతిపదికన వివరణ కోరడం సముచితం కాదని మంత్రి సురేఖ పేర్కొన్నారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేయడం సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని వివరించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణా నియమావళిపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలు, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ విషయంలో తన ప్రమేయం లేదని గుర్తించి, తనకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని క్రమశిక్షణా కమిటీకి గౌరవపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నట్లుగా సురేఖ తన లేఖలో పేర్కొన్నారు. అయితే సురేఖ తన లేఖలో సీఎం రేవంత్ రెడ్డిపై కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయకపోవడం గమనార్హం.
కొండా సురేఖ కుటుంబంపై క్రమశిక్షణా చర్యలకు వ్యతిరేకవర్గం ఒత్తిడి
సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కొండా సుస్మిత తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కొండా వ్యతిరేక వర్గం ఎమ్మెల్యేలు, నాయకులు కొండా కుటుంబంపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఒత్తిడి పెంచుతున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి మద్దతుదారులైన 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమై కొండా కుటుంబంపై చర్యలు తీసుకోవాలని కోరినట్లుగా పొలిటికల్ సర్కిల్ టాక్. ఇంకోవైపు కాంగ్రెస్ సీనియర్ మంత్రులు, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు కొండా సురేఖకు మద్దతుగా నిలుస్తున్నారని..దీంతో కొండా కుటుంబంపై అధిష్టానం ఏ విధంగా స్పందించబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.
కొండా సురేఖ మాజీ ఓఎస్డీ పై కేసు నమోదు
సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కొండా సుస్మిత తీవ్ర వ్యాఖ్యలపై ఓ వైపు కాంగ్రెస్ పార్టీలో రగడ కొనసాగుతుండగానే..ఇదే సమయంలో మంత్రి మాజీ ఓఎస్‌డీ సుమంత్‌పై కేసు నమోదు కావడం ఆసక్తి రేపింది. ఓ వ్యాపారిని బెదిరించి దాడిచేసినట్లు వచ్చిన ఫిర్యాదుతో ఈ కేసును పోలీసులు నమోదు చేశారు. గతంలో సుమంత్ ను అరెస్టు చేయడానికి ప్రయత్నించినపుడు కూడా కొండా సురేఖ కూతురు సుస్మిత తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో కొండా కుటుంబం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తొలగించాలన్న ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా ప్రచారం సాగుతుంది.
