సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన అకస్మాత్తుగా రద్దయ్యింది. కేంద్ర విదేశాంగశాఖ అనుమతి నిరాకరించడంతో పర్యటన రద్దు చేసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి లండన్ పర్యటనలో ఉన్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 23న లండన్ నుంచి అమెరికా వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో లండన్ నుంచే హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. అయితే తన అమెరికా పర్యటన రద్దయినప్పటికి..సీఎం వెంట ఉన్న అధికారుల బృందాన్ని అమెరికా పర్యటన కొనసాగించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని ఎంవోయూలు యథాతథంగా చేసుకోవాలని, వర్సిటీలతో భాగస్వామ్య ఒప్పందాలను ఖరారు చేసుకోవాలని అధికారులకు సూచించారు.
ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలకు సంబంధించి ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం.. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సీఎం రేవంత్‌రెడ్డి యూకే, యూఎస్ పర్యటనకు చాలా రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అయితే, యూకే పర్యటనకు మాత్రమే విదేశాంగశాఖ అనుమతించింది. అమెరికా పర్యటనకు అనుమతివ్వలేదు.
రెండ్రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, అక్కడి నుంచి నేరుగా లండన్ చేరుకున్నారు. శుక్రవారం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్‌ను ఆయన సందర్శిస్తారు. సాయంత్రం ఎమిరేట్స్ స్టేడియంలో జరిగే ఈపీఎల్ ఫుట్‌బాల్ ప్రజంటేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. 22న కేంబ్రిడ్జ్ బృందంతో సమావేశం కానున్నారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్‌లోని సెనేట్ హౌస్‌ను, సాయంత్రం లండన్ బిజినెస్ స్కూల్‌ను సందర్శిస్తారు. ఆగస్టు 23న సీఎం లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు బయలుదేరతారు.
అమెరికా పర్యటన రద్దుపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి
తన యూఎస్ పర్యటనకు కేంద్రం అనుమతించకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. తన పర్యటనకు రాజకీయ కోణంలో అనుమతి నిరాకరించారని పేర్కొన్నారు. రాజకీయ కోణంలో పర్యటనను అడ్డుకోవడం దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. దేశ, రాష్ట్ర అభివృద్ది విదేశీ పర్యటనల లక్ష్యం అన్నారు. కేంద్ర నూతన విద్యా విధానాన్ని అమలు చేయటం..తెలంగాణకు అత్యుత్తమ విద్యాసంస్థలు తీసుకరావడం, ప్రపంచస్థాయి సంస్థలను తీసుకురావటమే పర్యటన ఏకైక ఉద్దేశం అని ఈ సందర్బంగా రేవంత్ తెలిపారు.
నా విదేశీ పర్యటన వికసిత్ భారత్‌కు దోహదపడుతుందని భావించానని, దేశ నిర్మాణం కోసం రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని నమ్ముతాను అని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్ ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యం అన్నారు. అందుకే అధికారుల బృందాన్ని అమెరికా పర్యటనను కొనసాగించాలని సూచించినట్లుగా తెలిపారు.
సీఎం పర్యటనపై బీజేపీ రాజకీయం : ఆది ఫైర్
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై బీజేపీ రాజకీయం చేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. పనిలేక ప్రధాని మోదీ 82కు పైగా దేశాలు తిరిగారా అంటూ ప్రశ్నించారు. మంచి విద్యాసంస్థలను, పరిశ్రమలను, పెట్టుబడులను తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం సహకారంతో రాష్ట్ర బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్, బీజేపీలు కలిసి చేస్తున్న కుట్రలు సాగనివ్వబోమని పేర్కొన్నారు.
అనుమతి లేదా.. రద్దు చేసుకున్నారా..?
కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలతోనే సీం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యిందని, అయితే రేవంత్ వర్గం తమ ఇమేజ్ కోణంలో కేంద్రం అనుమతి నిరాకరణను కారణంగా చూపిస్తున్నారన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది. మంత్రి కొండా సురేఖ వివాదంతో పాటు చిన్నారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి వారి అసమ్మతి వ్యవహరాలతో రాష్ట్ర కాంగ్రెస్ లో అంత రచ్చ జరుగుతుంటే విదేశీ పర్యటన ఎందుకు అంటూ కాంగ్రెస్ అధిష్టానం అసహనం వ్యక్తం చేసిందని..అందుకే రేవంత్ లండన్ పర్యటన అనంతరం అమెరికా వెళ్లకుండా, ఎల్లుండి నేరుగా హైదరాబాద్ చేరుకోనున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ కేంద్రం భద్రతా కారణాలతో అనుమతులు రద్దు చేస్తే మొత్తం బృందానికి అనుమతి రద్దు చేస్తుంది కదా అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన దక్షిణ జోనల్ కౌన్సిల్‌లో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంతా సమావేశానికి హాజరుకాగా.. సీఎం రేవంత్ రెడ్డి హాజరుకాకపోవడం కూడా ..ఆయన విదేశీ పర్యటకు కేంద్రం అనుమతి నిరాకరణకు ఓ కారణంగా కనిపిస్తుందన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఈ సమావేశం కంటే ఓ సీఎంకు విదేశీ పర్యటన ముఖ్యమా? అన్న కేంద్రం అసహనం రేవంత్ అమెరికా టూర్ అనుమతి నిరాకరణకు కారణం కావచ్చన్న విశ్లేషణలు కూడా వ్యక్తం అవుతున్నాయి.