KTR : అవినీతి ఆనకొండ అనుముల రేవంత్

సీఎం రేవంత్ రెడ్డిని 'అవినీతి ఆనకొండ', 'విషపురుగు' అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. దీక్షా దివస్ (నవంబర్ 29) స్ఫూర్తితో రెండేళ్లు పోరాటం తప్పదని కేడర్‌కు పిలుపునిచ్చారు.

KTR : అవినీతి ఆనకొండ అనుముల రేవంత్

విధాత, ప్రత్యేక ప్రతినిధి: అవినీతి అనకొండ లెక్క అనుముల రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి పట్టిన ఒక విషపురుగు తీరు తయారయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. దీక్షా దివస్ స్పూర్తితో మనందరం కదం తొక్కాలంటూ పిలుపునిచ్చారు. వరంగల్, హన్మకొండ జిల్లాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో బుధవారం హనుమకొండలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. రేవంత్ రెడ్డి దుర్మార్గపు పాలనను ఎదుర్కొవాలంటే గ్రామ గ్రామాన ప్రజలందరినీ చైతన్యం చేయాలె. ఒక్కక్కరు ఒక కేసీఆర్ కావాలంటూ కోరారు. ఇంకొక్క రెండేళ్ళు ఈ పోరాటం తప్పదు.. ఇంకో రెండేళ్లు కేసులు తప్పవంటూ ఆయన చెప్పారు. మరో రెండేళ్ళు పోరాటం తప్పదని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి తన అత్తసొమ్మో, అయ్య సొమ్మో అన్నట్లు అమ్ముకుని తన సొంతపార్టీవారికి, అన్నదమ్ములకు అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తెలంగాణ వచ్చుడో..కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో తెలంగాణ సమాజాన్ని కదిలించిన రోజు నవంబర్ 29 అంటూ వివరించారు. ఆ రోజు యూనివర్సీటిలు తిరగబడ్డాయని, కేయూ దగ్గర విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారన్నారు. యుద్ధ భూమిని తలపించే విధంగా తెలంగాణ కదిలిందంటూ శ్రీకాంతా చారి మరణంతో మలి దశ ఉద్యమం జరిగిందన్నారు. తెలంగాణను రాచి రంపాన పెడుతున్న అంశాలను గుర్తు చేసుకుని పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్దామని పిలుపు నిచ్చారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అర్ధం అయిందనీ.. కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటున్నారంటూ విశ్వాసం కల్పించారు. పాలన చేతకాక అక్రమ కేసులు పెడుతున్నారు.. ఉద్యమంలో ఎలా ముందు ఉన్నారో అలాగే ముందుండాలన్నారు. యువతకు ఉపాధి దొరుకుతుందని టెక్స్టైల్ పార్కు నిర్మించారన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పిస్తాం అని బీసీల ఓట్లను దండుకున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వంలో ఇచ్చిన 24 శాతాన్ని 17 శాతానికి తగ్గించారని, బీసీలను మోసం చేసిన రేవంత్ సర్కార్ ను ఏం చేయాలో నిర్ణయించుకోవాలన్నారు. దీక్షా దివస్ కార్యక్రమంలో భారీగా పాల్గొనాలని కేటీఆర్ కోరారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షతవహించగా నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి, తక్కెళ్ళపెల్లి రవిందర్రావు, డాక్టర్ రాజయ్య, నన్నపునేని నరేందర్, చల్లాధర్మారెడ్డి, డిఎస్ రెడ్యానాయక్, పోచంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి ముందు టెక్స్టైల్ పరిశ్రమను కేటీఆర్ సందర్శించారు. పార్కును పూర్తి చేయడంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు.