KTR Launched Congress Due Card | కాంగ్రెస్ గ్యారంటీ కార్డుకు కౌంటర్ గా బాకీ కార్డు : కేటీఆర్
కాంగ్రెస్ గ్యారంటీ కార్డుకు ప్రతిగా బీఆర్ఎస్ ‘బాకీ కార్డు’ ఉద్యమం ప్రారంభించిన కేటీఆర్.. కాంగ్రెస్ ఇచ్చిన హామీల మోసాలను బహిర్గతం చేశారు.

విధాత, హైదరాబాద్ : ఎన్నికల్లో ఆరు గ్యారంటీల కార్డు పేరుతో కాంగ్రెస్ చేసిన మోసాలను తెలంగాణ ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ ‘ కాంగ్రెస్ బాకీ కార్డు’ ఉద్యమం చేపట్టిందని..ఏ వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ ఉందో తెలిసేలా కాంగ్రెస్ బాకీ కార్డులు జనానికి పంచుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రులతో కలిసి కేటీఆర్ ఈ ‘బాకీ కార్డు’ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అధికారం కోసం అడ్డమైన హామీలిచ్చి, గద్దెనెక్కిన తర్వాత వాటిని గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై బీఆర్ఎస్ పార్టీ సమరశంఖం పూరించిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారెంటీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ సర్కార్.. రాష్ట్రంలోని ఏ వర్గానికి ఎంతెంత బాకీ పడిందో లెక్కలతో సహా ప్రజల ముందుంచేందుకు ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ఉద్యమాన్ని మొదలుపెట్టిందని తెలిపారు. హామీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్‌కు పంచాయతీ, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్ చేసిన మోసాలే నేడు ప్రజల చేతిలో పాశుపతాస్త్రాలుగా మారాయన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటి తలుపుతట్టి, కాంగ్రెస్ బాకీల బండారాన్ని ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీ కార్డుకు విరుగుడే ఈ ‘బాకీ కార్డు’ అన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన దోఖాకు బదులు తీర్చుకునే సరైన మోకా తెలంగాణ ప్రజలకు వచ్చిందన్నారు. ఏ వర్గానికి కాంగ్రెస్ ఎంత బకాయి పడ్డదో నిలదీసి నిగ్గదీసి అడగడానికే ఈ బాకీ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. రాష్ట్రస్థాయి నాయకుల నుంచి గ్రామస్థాయి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ ఈ కార్డును ఇంటింటికీ తీసుకెళ్తారని చెప్పారు. వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ మళ్లీ ఓటేస్తే రైతు బంద్ కూడా బంద్ చేస్తారు
మోసపోతే గోస పడతామని ఎన్నికలకు ముందు కేసీఆర్ పదే పదే చెప్పారని..అదే ఇవాళ నిజమైందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. మొదటి కేబినేట్ సమావేశంలోనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్ గాంధీ అన్నారని..ఇప్పటివరకు 30కి పైగా కేబినెట్ సమావేశాలు జరిగినా ఆ ఊసే లేదని విమర్శించారు. బాండ్ పేపర్లు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు పెట్టిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క నేడు మాట దాటవేస్తున్నారని మండిపడ్డారు. ఒకవేళ పొరపాటున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో, స్థానిక సంస్థలు ఎన్నికలలో కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుబంధును కూడా బంద్ చేస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ అసమర్థ పాలనలో రైతులు, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు.. ఇలా అన్ని వర్గాల ప్రజల పరిస్థితి దయనీయంగా మారిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.‘కాంగ్రెస్ బాకీ కార్డు’లోని ప్రతీ అక్షరం రేవంత్ సర్కార్ మోసానికి నిలువుటద్దమని కేటీఆర్ మండిపడ్డారు. ఏ వర్గాన్ని కూడా వదలకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా నిలువునా ముంచిందో ఆయన అంకెలతో సహా వివరించారు.
బాకీల వివరాలు అందరికి చేర్చుతాం
అన్నదాతల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అడుగడుగునా దగా చేస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. ఎకరానికి రూ. 15,000 ఇస్తామన్న హామీ ఏమైంది? అది బాకీ అన్నారు. రూ. 2 లక్షల రుణమాఫీ ఊసేలేదు, అది బాకీ. వరికి రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పి చేతులెత్తేశారు.. అది కూడా బాకీనే అన్నారు. ఇక కౌలు రైతులు, రైతు కూలీల కన్నీళ్లను పట్టించుకునే నాథుడే లేడు. వారికి ఇస్తామన్న రూ. 15,000, రూ. 12,000 ఏ గంగలో కలిపారు? ఇవన్నీ బాకీ కాదా?” అని కేటీఆర్ నిలదీశారు. మా తమ్ముళ్లు, చెల్లెళ్ల ఆశలపై కాంగ్రెస్ నీళ్లు చల్లింది. 2 లక్షల ఉద్యోగాల హామీ బాకీ. నెలకు రూ. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, 22 నెలలుగా ప్రతి నిరుద్యోగికి వేలల్లో బాకీ పడింది. ఈ మోసానికి కాంగ్రెస్ ఏం సమాధానం చెప్తుంది?” అని కేటీఆర్ ప్రశ్నించారు.
మహిళలను మోసగించిన కాంగ్రెస్
మహాలక్ష్మి పథకం పేరుతో ఆడబిడ్డలను ఇంత దారుణంగా మోసం చేసిన ప్రభుత్వం మరొకటి లేదన్నారు. నెలకు రూ. 2,500 ఇస్తామని చెప్పి, ఈ రోజుకు ఒక్కో మహిళకు దాదాపు రూ. 55,000 బాకీ పెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చాక పెళ్లైన 8 లక్షల మంది ఆడబిడ్డలకు 8 లక్షల తులాల బంగారం బాకీ. ఇది నయవంచన కాదా?” అని కేటీఆర్ మండిపడ్డారు. వృద్ధులు, వితంతువుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగలకుండా పోదు. నెలకు రూ. 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి, 22 నెలలుగా ఒక్కొక్కరికి రూ. 44,000 బాకీ పడ్డారు. దివ్యాంగుల విషయంలో మరీ దారుణం. నెలకు రూ. 6,000 ఇస్తామని హామీ ఇచ్చి, కేసీఆర్ పెంచిన రూ. 4,000 మాత్రమే ఇస్తున్నారు. అంటే ప్రతి నెలా రూ. 2,000 కోత పెడుతూ, ఒక్కో దివ్యాంగుడికి రూ. 44,000 బాకీ ఉన్నారు” అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
Beta feature