KTR | మా సహనాన్ని పరీక్షిస్తే ప్రతిచర్య తప్పదు.. బీఆరెస్ కార్యకర్తలపై దాడుల పట్ల డీజీపీకి ఫిర్యాదు చేసిన కేటీఆర్
మా సహనాన్ని పరీక్షిస్తే.. చర్యకు ప్రతిచర్య తప్పదు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని (Congress Govt) బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.

KTR | మా సహనాన్ని పరీక్షిస్తే.. చర్యకు ప్రతిచర్య తప్పదు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని (Congress Govt) బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గుర్తుంచుకోవాలని కేటీఆర్ సూచించారు. రుణమాఫీ సమస్యలపై రైతులతో కలిసి శాంతియుత నిరసనలు చేస్తున్న బీఆరెస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దాడులు చేయడం, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం పట్ల రాష్ట్ర డీజీపీ జితేందర్ (DGP Jitendra) ను కలిసి కేటీఆర్ బృందం ఫిర్యాదు చేసింది.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నిన్న ఒక్క రోజున తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి (Tirumalagiri)లో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ (Gadari Kishore)పై దాడి చేశారని, ప్రజాస్వామ్య పద్దతిలో శాంతియుతంగా తిరుమలగిరిలో రైతు నిరసన దీక్ష చేస్తుండగా 50 మంది కాంగ్రెస్ గుండాలు, తాగిన మత్తులో ఆకస్మికంగా రాళ్లు, గుడ్లు, సుతిలి బాంబులతో దాడి చేశారని కేటీఆర్ ఆరోపించారు. మా వాళ్లు తిరగబడి ఉంటే ఆ 50 మంది కాంగ్రెస్ మూకలు ఒక్కరు కూడా మిగిలేవారు కాదని, కానీ శాంతియుతంగా మేము నిరసన తెలుపాలని భావించామన్నారు. అందుకే ఎలాంటి ప్రతిఘటనకు పాల్పడలేదని, పోలీసులే మా నిరసన దీక్షకు సంబంధించిన టెంట్ కూల్చేయటం ఆశ్చర్యం కలిగించిందని కేటీఆర్ తెలిపారు.
మహిళా జర్నలిస్టులపై దాడులు సిగ్గుచేటు
అలాగే ఇద్దరు మహిళ జర్నలిస్టులు (Journalists) సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ సమస్యలపై రైతులతో మాట్లాడుతుంటే వాళ్ల మీద కాంగ్రెస్ గుండాలు అసభ్యకరంగా దాడి చేశారని కేటీఆర్ తెలిపారు.. వాళ్లేమైనా ముఖ్యమంత్రి లాగా బజారు బాష మాట్లాడారా? లాగుల తొండలు జొర్రకొడతాం, చెట్టుకు కట్టేసి కొడతాం అన్నారా? రుణమాఫీ అయ్యిందా? లేదా అని తెలుసుకోవటానికి వెళ్లారని, వారిపైన కూడా కాంగ్రెస్ చిల్లరగాళ్లు దాడి చేశారన్నారు. కాంగ్రెస్ గుండాలు వారిని వెల్దండ పోలీస్ స్టేషన్ వరకు వెంబడించారని, ఆ ఆడబిడ్డలు ఏం తప్పు చేశారు? వారికి సీఎం క్షమాపణం చెప్పాలని కోరారు. నీ బండారం బయట పెట్టినందుకా? వారి మీద దాడి చేయించావని, అంతే కాకుండా వాళ్ల మీద నికృష్టమైన భాషలో సోషల్ మీడియాలో కాంగ్రెస్ చిల్లర మనుషులు ప్రచారాలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, నెల రోజుల్లో 28 హత్యలు అనే వార్తలు వస్తున్నాయని, ఈ నగరానికి ఏమైంది అంటూ సీఎంకు దన్నుగా నిలిచిన పత్రికలే వార్తలు రాస్తున్నాయని కేటీఆర్ తెలిపారు.
పోలీసు యంత్రాంగం మీద మాకు సానుభూతి ఉందని, మిమ్మల్ని అడ్డం పెట్టుకొని సీఎం అధికారం చెలాయిస్తున్నాడన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా మా పార్టీ యువకులను వేధిస్తున్నారని, ఇంకా ఇలాగే కొనసాగితే మా నుంచి ప్రతిఘటన కూడా తప్పదన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినవద్దనే మేము ఇప్పటి వరకు ఊరుకుంటున్నామని, మా సహనాన్ని, చేతగాని తనం అనుకోవద్దని, మేము ప్రతిఘటిస్తే అప్పుడు మమ్మల్ని నిందించవద్దని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కొంతమంది పోలీసులు మంత్రుల బర్త్ డే కార్యక్రమాల్లో పరవశించి పోతున్నారని, డీజీపీకి ఇలాంటి పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశామన్నారు. బఫర్ జోన్‌లో ఉన్న అన్ని నిర్మాణాలను కూల్చాలని, పొంగులేటి, వివేక్, కేవీపీ, మధుయాష్కీ లాంటి నేతల భవనాలను కూల్చేసి ఆ తర్వాత సామాన్యుల భవనాలను కూల్చేయండి అని కేటీఆర్ సూచించారు.
పల్లెల్లో తిరుగలేక ఢిల్లీ యాత్రలు
రుణమాఫీ విషయంలో వాస్తవాలను ప్రజల్లోకి పోయి సమాధానం చెప్పలేని దద్దమ్మ ఈ సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీపై ఏ ఊరికైనా వెళ్దాం రా అని మేము సవాల్ చేస్తే రాలేదు. కానీ ఢిల్లీకి 20 సార్లు పోయిండని, ప్రజా క్షేత్రంలో తిరగాల్సిన సీఎం…ఢిల్లీ చుట్టు చక్కర్లు కొడుతున్నారు. సీఎంకు దమ్ముంటే నువ్వు ఏ ఊరికి పోదామో చెప్పు. అక్కడికి వెళ్లి రుణమాఫీ అయ్యిందా అనే విషయాన్ని అడుగుదాం. ఎక్కడ కూడా చారాణ రుణమాఫీ కాలేదు అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదు
నా ఇల్లు బఫర్ జోన్‌లో ఉన్నట్లు.. కేటీఆర్, హరీశ్‌రావు నిరూపించాలని, నా ఇంట్లో ఒక్క ఇటుక బఫర్ జోన్‌లో ఉన్నా హైడ్రా కూలగొట్టవచ్చన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి అంత శ్రమ అవసరం లేదని.. ఎక్కడెక్కడ చెరువులను పూడ్చి ఫామ్ హౌస్‌లు కట్టారో వాటికి సంబంధించిన శాటిలైట్ ఇమేజ్‌లు అన్నీ ఉన్నాయని చెప్పుకొచ్చారు. పొంగులేటి, వివేక్, కేవీపీ, పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా ఫామ్ హౌస్‌లను కూడా నేలమట్టం చేయాలని మరోసారి కేటీఆర్ సూచించారు