విధాత, హైదరాబాద్ : యాకూత్ పురాలోని(Yakutpura) డ్రైనేజీ మ్యాన్ హోల్ లో చిన్నారి పడిపోయిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పందించారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల నగరంలో నిన్న ఒక చిన్నారి తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్‌లో పడిపోయి..అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిన ఘటనపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో సర్కార్ నడుపుతున్నారా?.. సర్కస్ నడుపుతున్నారా? అని ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చేసిన తప్పును దిద్దుకోవాల్సిన మున్సిపల్ శాఖలోని మూడు విభాగాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయని విమర్శించారు. తప్పు హైడ్రాది అని జీహెచ్ఎంసీ(GHMC) ప్రకటిస్తే..తప్పు మాది కాదు జలమండలిది అని హైడ్రా చేతులు దులుపుకుందన్నారు. ఆ వెంటనే అసలు మాకేం సంబంధం లేదని జలమండలి చేతులెత్తేసిందని ఆరోపించారు. మున్సిపల్ శాఖను కేవలం కాసుల వేటకు వాడుకోవడంలో రేవంత్ బిజీగా ఉంటే, ఆయన శాఖలోని విభాగాలేమో సమన్వయలేమితో నగరవాసులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. .
యాకూత్ పురాలో ఓ చిన్నారి స్కూల్‌కు వెళ్తూ మూత తెరిచి ఉన్న డ్రైనేజీ మ్యాన్ హోల్(Drainage Manhole) లోపడిపోయిన ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Comissioner Ranganath) స్పందించారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత హైడ్రాదేనని స్పష్టం చేశారు. ఈ ఘటనకు మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఇంచార్జి నిర్లక్ష్యం కారణమని…బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ తెలిపారు. డ్రైనేజీల మ్యాన్ హోల్ మూతలు మూసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యాకుత్‌పురాలో డ్రైనేజీ మూతను తెరిచి ఉంచడంతో ఒక చిన్నారి స్కూల్‌కు వెళ్తూ డ్రైనేజీలో పడిపోయింది. అయితే.. ఆ పాప తల్లి, స్థానికులు వెంటనే గమనించి మ్యాన్ హోల్లో పడిన ఆ పాపను రక్షించడంతో ప్రమాదం తప్పింది. మ్యాన్ హోల్ను తెరిచి ఉంచిన ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.