Fabricated Court Orders | క‌ల్పిత‌ జ‌డ్జిమెంట్లు కూడా ఉంటాయా?

శంషాబాద్‌ భూముల కేసులో తీర్పు జ‌స్టిస్ ఎన్‌డీ ప‌ట్నాయ‌క్ పేరుతో ఉన్న‌ది. వాస్త‌వానికి ఆయ‌న 1988 డిసెంబ‌ర్ 2న న్యాయ‌మూర్తిగా ప్ర‌మాణం చేస్తే.. అంత‌కు ముందే 1988 ఏప్రిల్ 29న ఆయ‌న ఈ ఉత్త‌ర్వులు ఇచ్చిన‌ట్టు తీర్పును పుట్టించారు.

Fabricated Court Orders | క‌ల్పిత‌ జ‌డ్జిమెంట్లు కూడా ఉంటాయా?
  • ఇటీవ‌ల క‌ల్పిత‌ తీర్పును ప‌సిగ‌ట్టిన హైకోర్టు
  • సిట్ ద‌ర్యాప్తు కోసం ప్ర‌భుత్వానికి ఆదేశం
  • గ‌తంలోనూ ప‌లు క‌ల్పిత‌ జ‌డ్జిమెంట్లు
  • హైద‌రాబాద్ గుట్ట‌బేగంపేట‌లో ద‌ర్జాగా క‌బ్జా

Fabricated Court Orders | ఒకవైపు మన న్యాయ వ్యవస్థ దేశంలోనే రెండో అత్యుత్తమ వ్యవస్థ అని ప్రశంసలు అందుంటే.. మరోవైపు హైకోర్టు పేరుతో క‌ల్పిత తీర్పులు వ‌స్తున్న ఘటనలు సంచలనం రేపుతున్నాయి. నకిలీ లెటర్లు, నకిలీ డాక్యుమెంట్లు తెలిసినవే. హైకోర్టు పేరిట కొంద‌రు క‌ల్పిత జ‌డ్జిమెంట్లు పుట్టిస్తున్నారు. ఏ న్యాయ‌స్థాన‌మో అవి క‌ల్పిత‌మ‌ని గుర్తించేలోపే ఆ భూమి ముక్క‌లు ముక్క‌లుగా వేర్వేరు వ్య‌క్తుల మ‌ధ్య చేతులు మారుతున్న‌ది. తీరా అస‌లు విష‌యం తెలిసి కొనుగోలుదారులు నెత్తీనోరూ బాదుకుంటున్న ప‌రిస్థితి. తాజాగా ఇదే ప‌ద్ధతిలో వివాదాస్పద భూమికి సంబంధించిన క‌ల్పిత‌ కోర్టు తీర్పులను చూపించి న్యాయ వ్యవస్థను మోసం చేయాలని ప్రయత్నించడంపై తెలంగాణ‌ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించిన హైకోర్టు.. దర్యాప్తు చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్‌)ను ఏర్పాటు చేయాలని ఇటీవ‌ల‌ చెప్పింది. ఈ భూమి నిజాం కాలం నుంచి వివాదంలో ఉన్నది. దీనిపై హక్కుల కోసం కొందరు కోర్టు ఇచ్చిందని చెబుతూ క‌ల్పిత‌ ఉత్తర్వులను పుట్టించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌, పాయిగా గ్రామంలోని సర్వే నంబర్లు 661 నుంచి 664 వరకు, 720 నుంచి 732 వరకు, సర్వే నంబర్ 775లోని సుమారు 180 ఎకరాల భూమి తనదంటూ తనకు సివిల్ కోర్టు అనుకూలంగా తీర్పు చెప్పిందని మహమ్మద్ తాహెర్‌ఖాన్ వాదిస్తున్నాడు. అయితే.. దీన్ని హెచ్ఎండీఏ అధికారులు హైకోర్టులో స‌వాలు చేశారు. దీనిని విచార‌ణ‌కు స్వీక‌రించిన జ‌స్టిస్ వినోద్‌కుమార్‌, జ‌స్టిస్ పీ శ్రీ సుధ ధ‌ర్మాస‌నం.. కోర్టుపేరిట క‌ల్పిత‌ ఉత్త‌ర్వులు ఉన్న‌ట్టు గుర్తించి, విచార‌ణ‌కు ఆదేశించింది. స‌ద‌రు తీర్పు జ‌స్టిస్ ఎన్‌డీ ప‌ట్నాయ‌క్ పేరుతో ఉన్న‌ది. వాస్త‌వానికి ఆయ‌న 1988 డిసెంబ‌ర్ 2న న్యాయ‌మూర్తిగా ప్ర‌మాణం చేస్తే.. అంత‌కు ముందే 1988 ఏప్రిల్ 29న ఆయ‌న ఈ ఉత్త‌ర్వులు ఇచ్చిన‌ట్టు తీర్పును పుట్టించారు. ఇదిలా ఉంటే.. గ‌తంలోనూ ఇలా న‌కిలీ తీర్పులు పుట్టుకొచ్చిన సంద‌ర్భాలు ఉన్నాయ‌ని హైకోర్టు వ‌ర్గాలు చెబుతున్నాయి. శంషాబాద్ భూముల‌ విష‌యంలో ఇది మూడో న‌కిలీ తీర్పు అని పేర్కొంటున్నాయి.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లిలో సేమ్ సీన్‌!
ఇది ఒక కబ్జా కథ. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్ట బేగంపేటలోని ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కబ్జాదారులు ఇరవై యేళ్లుగా నడిపిస్తున్న కథ. భూమిపై ఎటువంటి హక్కులు లేని ఒక సాగుదారు నుంచి కొనుగోలు చేసినట్టు పత్రాలు సృష్టించారు. పట్టణ భూపరిమితి చట్టం అమలులో ఉండగానే ఒక్కసారే మూడు ఎకరాలు కొనుగోలు చేసినట్టు కోర్టులకు ఎక్కారు. ఆ భూమి పార్కుకోసం, రోడ్డుకోసం ఉద్దేశించిన భూమి. తొలుత ఒక కోర్టు నుంచి తాత్కాలిక ఆంక్షల ఉత్తర్వు తెచ్చారు. దానిని శాశ్వత ఆంక్షల ఉత్తర్వుగా మార్చి అధికారుల చేతుల్లో పెట్టి బెదిరించి, ఆ భూమి జోలికి రాకుండా చేశారు. అంతటితో ఆగలేదు. మళ్లీ హైకోర్టుకు వెళ్లి అక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు జరుగకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. “స్టేటస్ కో ఆదేశాలు పొంది భూమిని కబ్జాలో పెట్టుకోవడం బాగా అలవాటైంది. అటువంటి ఆదేశాలు ఇవ్వజాలను. భూమి యాజమాన్యం ఎవవ‌రిద‌న్న‌ది కలెక్టర్ వద్ద తేల్చుకోండి” అని హైకోర్టు జడ్జి ఆ కేసులో స్పష్టం చేశారు. కలెక్టర్‌కు దరఖాస్తు చేస్తే “ఇది పక్కా ప్రభుత్వ భూమి అని, హైకోర్టు గతంలోనే ఈ భూమి అంతా సీలింగ్ మిగులు భూమిగా తేల్చింద”ని కలెక్టర్ తన నివేదికలో పేర్కొన్నారు. ఆ తర్వాత మరో కలెక్టర్ రాగానే మళ్లీ కేసు నడిపించారు. ఆ కలెక్టర్ కూడా అదే విషయం తేల్చి చెప్పారు. అయినా కబ్జాదారులు మళ్లీ మరో బెంచ్‌ వద్దకు వెళ్లారు. అంతకు ముందు హైకోర్టు జడ్జి ఒకసారి ఈ కేసును విని, స్టేటస్‌కో నిరాకరించిన విషయం దాచి, కొత్తగా కేసు వేసినట్టు వాదించారు. “కొత్త జడ్జి గారు కోర్టు గడపతొక్కినవారికి తక్షణ సహాయం చేయాలనుకున్నారో లేక ఏం జరిగిందో తెలియదు. గతంలోని హైకోర్టు జడ్జీల ఆదేశాలను గానీ, ఇద్దరు కలెక్టర్లు రాసిన రిపోర్టులను గానీ కనీసం చదవకుండా స్టేటస్ కో ఇచ్చారు. ఇలా సంవత్సరాల తరబడి కేసులు నడుపుతూనే ఉన్నారు” అని కాలనీవాసులు వాపోతున్నారు. ఈ భూమికి సంబంధించి జస్టిస్ సూర్యారావు, జస్టిస్ చంద్రయ్య ఇచ్చిన అసలు తీర్పు కాకుండా నకిలీ తీర్పు ఒకటి చలామణి చేస్తున్నారన్న ఆరోపణలు కూడా కాలనీవాసులు చేస్తున్నారు. స్టేటస్‌కోను వేకేట్ చేయాలని కాలనీవాసులు కోర్టు కెళ్లారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ విభాగాల తరఫున జీపీలుగా చేస్తున్నవారు ఎవరూ ఈ కేసుల్లో జోక్యం చేసుకోవడం లేదు. పైనుంచి పెద్ద వాళ్లకు అవసరమైన కేసుల్లోనే జీపీలు జడ్జీల ముందుకు వస్తున్నారు తప్ప ప్రభుత్వ స్థలాల పరిరణ అన్నది వారికి ప్రాధాన్యంగా కనిపించడం లేదు అని కాలనీవాసులు వాపోతున్నారు.