శోభాయమానంగా భాగ్యనగరం…కొనసాగుతున్న శోభాయాత్ర

గణపతి నవరాత్రులు పూర్తి కావడంతో భాగ్యనగరం భాగ్యనగరమంతా శోభాయమానంగా మారింది. వినాయక విగ్రహాల నిమజ్జనం ఆదివారం ఉదయం వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. శనివారం రాత్రి 9 గంటల వరకు 2 .32 లక్షలకు పైగా వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తి చేసినట్లు అధికారులు ప్రకటించారు

శోభాయమానంగా భాగ్యనగరం…కొనసాగుతున్న శోభాయాత్ర
  • 2.32 లక్షల వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తి
  • ఆకస్మిక తనిఖీ చేసిన సీఎం
  • కొనసాగుతున్న శోభాయాత్ర

హైదరాబాద్, సెప్టెంబర్ 6(విధాత): గణపతి నవరాత్రులు పూర్తి కావడంతో భాగ్యనగరం భాగ్యనగరమంతా శోభాయమానంగా మారింది. వినాయక విగ్రహాల నిమజ్జనం ఆదివారం ఉదయం వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. శనివారం రాత్రి 9 గంటల వరకు 2 .32 లక్షలకు పైగా వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తి చేసినట్లు అధికారులు ప్రకటించారు. గణేష్ వినాయక విగ్రహాల శోభాయాత్ర శనివారం ఉదయమే ప్రారంభమైంది. హుస్సేన్ సాగర్ నుంచి నగరంలోని 20 ప్రధాన చెరువులతో పాటు కృత్రిమంగా ఏర్పాటు చేసిన చెరువుల్లో వినాయక విగ్రహాల నిమజ్జనం చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ తర్వాత సరూర్ నగర్ చెరువులో వినాయక విగ్రహాల నిమజ్జనం ఎక్కువగా ఉంటుంది. నిమజ్జనం సజావుగా సాగేందుకు 30 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తుండగా, 733 సీసీటీవీలను ఏర్పాటు చేసి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పోలీసులు శోభాయాత్రను పరిశీలించారు.

ఖైరతాబాద్ మహా గణపతికి తొలి పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. మధ్యాహ్నం 2 గంటలకు బడా గణేష్ గంగమ్మ ఒడికి చేరుకున్నారు. ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం పూర్తైన తర్వాత బాలాపూర్ గణపయ్య నిమజ్జనం సాయంత్రం వరకు పూర్తి చేయాలని అధికారులు దృష్టి పెట్టారు. బాలాపూర్ గణేషుడికి పూజలు నిర్వహించిన తర్వాత లడ్డూ వేలం జరిగింది. రూ. 35 లక్షలకు ఈ లడ్డూను లింగాల దశరథ గౌడ్ దక్కించుకున్నారు. లడ్డూ వేలం తర్వాత శోభాయాత్ర ప్రారంభమైంది. బాలాపూర్ నుంచి కేశవగిరి, చాంద్రాయణగుట్ట, మహబూబ్ నగర్ ఎక్స్ రోడ్డు, ఫలక్ నుమా రైల్వే బ్రిడ్జి, అలియాబాద్, చార్మినార్, బషీర్ బాగ్, లిబర్టీ, ఎన్టీఆర్ మార్క్, అంబేద్కర్ విగ్రహం, నెక్లెస్ రోడ్డు మీదుగా 19 కి.మీ ప్రయాణించి ఈ శోభాయాత్ర హుస్సేన్ సాగర్‌కు చేరింది. 12వ క్రేన్ సహాయంతో ఈ విగ్రహాన్ని గంగమ్మ ఒడికి చేర్చారు.

హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనాన్ని తనిఖీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

నిన్న సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి హుస్సేన్ సాగర్‌కు చేరుకున్నారు. హుస్సేన్ సాగర్ పై కొద్దిసేపు నడుచుకుంటూ వెళ్లి నిమజ్జనం తీరును పరిశీలించారు. ఖైరతాబాద్ గణేషుడు నిమజ్జనం జరిగిన క్రేన్ 4 వద్ద అధికారులతో ఆయన మాట్లాడారు. నిమజ్జనం జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. నిమజ్జనంలో ఏమైనా సమస్యలున్నాయా.. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి.. భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆయన నిమజ్జనాన్ని తిలకించేందుకు వచ్చిన వారిని అడిగారు. మీడియా స్టాండ్‌ను ఎక్కేందుకు సీఎం ప్రయత్నించారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది వారించారు. దీంతో ఆయన తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆ తర్వాత హుస్సేన్ సాగర్ వద్ద హైదరాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యుల కోసం ఏర్పాటు చేసిన స్టేజీ వద్దకు వెళ్లి వారితో కొద్దిసేపు మాట్లాడారు. నిమజ్జనం ఏర్పాట్లు.. నిమజ్జనం జరుగుతున్న తీరు గురించి చర్చించారు. అంతకుముందు నిమజ్జనం గురించి హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందనతో సీఎం మాట్లాడారు. నిమజ్జనం ఏర్పాట్ల గురించి కలెక్టర్ హరిచందన వివరించారు.

శనివారం సాయంత్రం గణేష్ విగ్రహాల శోభాయాత్రను మంత్రి పొన్నం ప్రభాకర్, పోలీస్ ఉన్నతాధికారులు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. శోభాయాత్ర ఎలా సాగుతోంది.. ఎక్కడెక్కడ విగ్రహాల తాకిడి ఎక్కువగా ఉందనే విషయాలను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. శనివారం అర్ధరాత్రి 12 గంటలలోపుగా నిమజ్జనం పూర్తి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. హుస్సేన్ సాగర్ వరకు ఆర్టీసీ ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. నిమజ్జనం సందర్భంగా ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లను అర్ధరాత్రి వరకు నడిపారు