Maheshwar Reddy | పౌరసరఫరా శాఖ అవినీతిపై మళ్లీ ఏలేటి ఆరోపణలు

రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో అక్రమాలు జరగుతున్నాయంటూ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై వరుస ఆరోపణలు గుప్పిస్తున్న బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సీఎంకు 18 ప్రశ్నలతో బహిరంగ లేఖ రాశారు

Maheshwar Reddy | పౌరసరఫరా శాఖ అవినీతిపై మళ్లీ ఏలేటి ఆరోపణలు

సీఎం, మంత్రికి 18 ప్రశ్నలతో ఏలేటి బహిరంగ లేఖ

విధాత, హైదరాబాద్: రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో అక్రమాలు జరగుతున్నాయంటూ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై వరుస ఆరోపణలు గుప్పిస్తున్న బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి శనివారం సీఎంకు 18 ప్రశ్నలతో బహిరంగ లేఖ రాశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏలేటి బహిరంగ లేఖను విడుదల చేసి మాట్లాడారు. తెలంగాణలో ఆర్‌యూబీ (రేవంత్‌, ఉత్తమ్, భట్టి) ట్యాక్స్ నడుస్తోందని, తాను చేసిన అవినీతి ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. ఉత్తమ్‌ను ప్రశ్నించానని తనపై పోలీసు కేసు పెట్టారని.. సమాధానం చెప్పకుండా ఆయన మొహం ఎందుకు చాటేస్తున్నారని నిలదీశారు.

రాష్ట్రంలో లేనని మంత్రి ఉత్తమ్‌ చెప్పారని.. వచ్చాక సమాధానం చెబుతానని ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదని, కమిషనర్‌తో ప్రెస్ మీట్ పెట్టించి చేతులు దులుపుకున్నారన్నారు. మంత్రి నేరుగా స్పందించకుండా ఎందుకు తప్పించుకుంటున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమాలపై ఆధారాలతో సహా తాను బయటపెట్టానని.. అయినా తనపై కేసు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలతో ప్రెస్ మీట్ పెట్టి నాపై విమర్శలు చేయించారని పేర్కొన్నారు. అందుకే పౌరసరఫరాశాఖలో అవినీతిపై ఆధారాలతో కూడిన 18ప్రశ్నలతో సీఎంకు బహిరంగ లేఖ రాస్తున్నానని పేర్కోన్నారు. లేఖలోని నా ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పాలని ఏలేటి డిమాండ్ చేశారు.

మిల్లర్లతో కుమ్మక్కు వెనుక చీకటి ఒప్పందం

నిర్ధేశించిన సమయంలోగా మిల్లర్లు బియ్యం ఇవ్వకుండా మోసం చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ఏలేటి లేఖలో ప్రశ్నించారు. దానివల్ల శాఖ ఎంత నష్టాల్లో ఉంది.. దానికి ప్రభుత్వం ఎంత వడ్డీ చెల్లిస్తోందని, మిల్లర్ల నుంచి రూ.22 వేల కోట్ల బకాయిలు ఎందుకు వసూలు చేయట్లేదని లేఖలో ప్రశ్నించారు. ఇందులో లోపాయికారి ఒప్పందం ఏంటని, జనవరి 25వ తేదీన జీవో రిలీజ్ చేసి, అదే రోజు కమిటీలు వేసి, అదే రోజు గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసి, అదే రోజు టెండర్ ప్రాసెస్ చేశారని, ఒక్కరోజులోనే అంత హడావుడిగా ఎందుకు చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. మే 15 వరకు సీఎంఆర్ రైస్ ను కొంటామని కేంద్రం చెప్పినా టెండర్ ఎందుకు పెట్టారని, టెండర్లో బయట వారికి అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. అలాంటప్పుడు కేంద్రానికి లేఖ ఎందుకు రాశారు? కేంద్రంపై నిందలు మోపేందుకే కుట్ర చేశారని ఆరోపించారు.

టెండర్ల రేటు ఫైనల్ చేశాక జల సౌధలో బిడ్డర్లు, కాంట్రాక్టర్లను పిలిపించి ముంత్రి, కమిషనర్ చేపట్టిన చీకటి ఒప్పందం ఏంటని ప్రశ్నించారు. చీకటి ఒప్పందంలో రూ.100 స్టాంప్ పేపర్స్‌పై బిడ్ ఇచ్చిన వారికి, రైస్ మిల్లర్లకు మధ్య ఒక ఎంవోయూను రాయించుకున్నది వాస్తవం కాదా? వారి సంతకాలు పెట్టించుకున్నది వాస్తవం కాదా? ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు ఇచ్చిన గడువు కేవలం 90 రోజులు.. వారు ఎలాగైనా తమకు గడువు పొడగిస్తారని ఎంవోయూ రాయించుకున్నారని ఏలేటి ఆరోపించారు.

మే 23తో 90 రోజుల గడువు దాటిందని, మరి వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. వారి బిడ్ ను రద్దుచేసి వేరే వారికి ఇస్తారా? లేక వారికే గడువు పొడిగిస్తారా ? ఎందుకు వారికే గడుడు పొడిగించాలని చూస్తున్నారో మంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. తక్కువ ధరకు ధాన్యం అమ్మి.. ఎక్కువ ధరకు బియ్యం ఎందుకు కొంటున్నారు? అని ప్రశ్నించారు. తన బహిరంగ లేఖను ముఖ్యమంత్రితో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా కాపీని అందచేస్తానన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే సీఎంకు చిత్తశుద్ధి ఉంటే నిజనిర్ధారణ కమిటీ వేయాలని, లేదా హైకోర్టు జడ్జి లేక సిట్టింగ్ జడ్జితోగాని రిటైర్డ్ జడ్జితో కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నానన్నారు.