Malla Reddy | కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థ‌లాన్ని కాపాడుకుంటా.. పోలీసుల‌తో మ‌ల్లారెడ్డి వాగ్వాదం

సుచిత్ర ప‌రిధిలోని స‌ర్వే నంబ‌ర్ 82లో భూవివాదం నెల‌కొంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి, ఇత‌రుల‌కు మ‌ధ్య భూవివాదం ఉంది

Malla Reddy | కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థ‌లాన్ని కాపాడుకుంటా.. పోలీసుల‌తో మ‌ల్లారెడ్డి వాగ్వాదం

మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి : సుచిత్ర ప‌రిధిలోని స‌ర్వే నంబ‌ర్ 82లో భూవివాదం నెల‌కొంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి, ఇత‌రుల‌కు మ‌ధ్య భూవివాదం ఉంది. త‌న భూమిని క‌బ్జా చేస్తున్నారంటూ మ‌ల్లారెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న భూమి చుట్టూ అక్ర‌మంగా ఫెన్సింగ్ వేశార‌ని మ‌ల్లారెడ్డి మండిప‌డ్డారు. వేసిన ఫెన్సింగ్‌ను కూల్చాలంటూ త‌న అనుచరుల‌కు మ‌ల్లారెడ్డి చెప్పారు. దీంతో పోలీసుల ముందే మ‌ల్లారెడ్డి అనుచ‌రులు రెచ్చిపోయారు.

భారీ ఫెన్సింగ్‌ను కూల్చేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌గా పోలీసులు అడ్డుకున్నారు. వివాదంలోని భూమిలో ఘ‌ర్ష‌ణ‌కు దిగొద్ద‌ని మ‌ల్లారెడ్డితో ఆయ‌న అల్లుడు, ఎమ్మెల్యే రాజ‌శేఖ‌ర్ రెడ్డికి పోలీసులు స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేశారు. త‌న భూమిలో ఫెన్సింగ్ వేస్తే చూస్తూ ఎలా ఊరుకున్నారంటూ పోలీసుల‌తో మ‌ల్లారెడ్డి వాగ్వాదానికి దిగాడు. కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థ‌లాన్ని కాపాడుకుంటానంటూ మ‌ల్లారెడ్డి ఆగ్ర‌హంతో ఊగిపోయారు.

ఈ క్ర‌మంలో ఈ భూమి త‌మ‌దేనంటూ 15 మంది వ్య‌క్తులు ఘ‌ట‌నాస్థ‌లికి వ‌చ్చారు. 400 గ‌జాల చొప్పున 1.11 ఎక‌రాల భూమిని కొన్నామ‌ని ఆ 15 మంది తెలిపారు. కోర్టులో కూడా త‌మ‌కు అనుకూలంగా తీర్పు వ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేశారు. స్థ‌లంపై కోర్టు ఆర్డ‌ర్ ఉన్నందున సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకోవాల‌ని ఇరు వ‌ర్గాల‌కు పోలీసులు సూచించారు.