మంచిర్యాల.. దాహార్తి తీర్చండి: కాంగ్రెస్ నిరసన
- గోదావరి పక్కనే ఉన్నా తాగునీటి కరువు
- మున్సిపాలిటీ ఎదుట ఖాళీ కుండలతో కాంగ్రెస్ నిరసన
విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలో తాగునీటి ఎద్దడి తీవ్రమైందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మిషన్ భగీరథ పనులు అర్ధంతరంగా ఆగిపోవడంతో సమస్య జటిలమైందన్నారు. మంగళవారం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
కాంగ్రెస్ కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆందోళన చేపట్టారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో నీటి కొరత ఉందని ఆరోపిస్తూ ఖాళీ కుండలతో మున్సిపల్ కార్యాలయానికి వచ్చి వాటిని పగలకొట్టారు. మంచిర్యాలలో ఉన్న సమస్యలను ఏకరవు పెడుతూ మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ కు కౌన్సిలర్లు వినతిపత్రం అందజేశారు.
ఈసందర్భంగా మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు డాక్టర్ రావుల ఉప్పలయ్య, ఉప నాయకుడు వేములపల్లి సంజీవ్, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ మాట్లాడారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికార బీఆరెస్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. మిషన్ భగీరథ పనులు మంచిర్యాల పట్టణంలో పూర్తి కాకపోవడంతో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు.
మున్సిపల్ పాలక పక్షం.. విపక్ష సభ్యుల పట్ల వివక్షత చూపుతూ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. మంచిర్యాలలో అనేక సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించడంలో అధికార పార్టీ విఫలమైందని విమర్శించారు. గత మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏఒక్కటీ అమలుకు నోచుకోలేదని అన్నారు. ఆందోళన అనంతరం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram