విధాత : కాంగ్రెస్‌లోకి బీఆరెస్ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు, అలాగే బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిలు చేరేందుకు రంగం సిద్ధమైంది. వీరిని ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. మండవ, రేవూరిలు ఇద్దరు రేపోమాపో కాంగ్రెస్‌లో చేరనున్నారు. కాంగ్రెస్ నుంచి మండవకు నిజామాబాద్ రూరల్, రేవూరికి పరకాల టికెట్ ఆఫర్ చేసినట్లుగా సమాచారం.
మండవ వెంకటేశ్వర రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ నుంచి డిచ్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుండి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఎక్సైజ్ శాఖ, విద్యా శాఖ, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేశారు. మండవ వెంకటేశ్వరరావు 2004లో ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం గంగారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు.
2008 (ఉప ఎన్నిక) 2009 టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నాడు. 2019 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ నుంచి పోటీ చేసిన తన కూతురు కవిత గెలుపు వ్యూహాల్లో భాగంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని మండవ వెంకటేశ్వరరావు ఇంటికి 2019 ఏప్రిల్ 5న పార్టీలోకి రావాలని ఆహ్వానించాడు. ఏప్రిల్ 6న ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
బీఆరెస్‌లో చేరినప్పటి నుంచి కూడా ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహారించలేదు. అప్పట్లో తుమ్మల నాగేశ్వర్‌రావు చొరవతో మండవ బీఆరెస్‌లో చేరారు. ఇప్పుడు తుమ్మల బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు కూడా తుమ్మల చొరవతోనే మండవ కాంగ్రెస్‌లోకే చేరబోతున్నారని, మండవకు నిజామాబాద్ రూరల్ టికెట్ కేటాయించే అవకాశముందన్నారు.
మరోవైపు బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. ఆయన టీడీపీ నుంచి నర్సంపేట నియోజకవర్గంలో 3సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాక 2019 సెప్టెంబర్ 4వ తేదీన బీజేపీలో చేరారు. రేవంత్ ఆహ్వానంతో కాంగ్రెస్‌లో చేరనున్న రేవూరికి పరకాల టికెట్ ఇచ్చే అవకాశముంది.
టీడీపీలో ఉన్నప్పుడు రేవూరి, మండవలతో తుమ్మల, రేవంత్‌లకు ఉన్న సాన్నిహిత్యం నేపధ్యంలో వారిని కాంగ్రెస్‌లోకి రప్పించడంలో సఫలీకృతమయ్యారు. అయితే రేవూరి ఆశిస్తున్న పరకాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేతలు కొండా మురళీ, ఇనుకాల వెంకట్రామ్‌రెడ్డిలు టికెట్ రేసులో ఉండటం గమనార్హం. అటు మండవకు ఇస్తామంటున్న నిజమాబాద్ రూరల్ నుంచి కూడా మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి, కాటిపల్లి నగేశ్‌రెడ్డిలు కాంగ్రెస్ టికెట్ రేసులో ఉన్నారు.