విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గ్రూపు పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని ప్రవళిక సంఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించిన తీరు పట్ల పలువురు మండిపడుతున్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపెల్లికి చెందిన ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై విద్యార్థులు, విపక్షాలు, నిరుద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం ఫలితంగానే ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నదని విమర్శించారు. దీనికి భిన్నంగా యువతి ప్రేమ వైఫల్యం కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ఇప్పటికే యుద్ధప్రాతిపదికన ప్రచారం చేసిన విషయం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ దశలో ఆదివారం మంత్రి కేటీఆర్ ఓ చానల్ తో మాట్లాడుతూ ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వైఫల్యమే కారణమని చెప్పడమే కాకుండా, ఆమె గ్రూపు పరీక్షలకు దరఖాస్తు చేసుకోలేదని అనడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పరీక్షలు నిరంతరం వాయిదా వేయడం వల్ల మానసికంగా ఇబ్బందికిలోనై ఆత్మహత్యకు పాల్పడిన యువతి పట్ల మానవతా హృదయంతో స్పందించకుండా, తప్పుడు ఆరోపణలు చేయడం పట్ల వరంగల్ జిల్లావ్యాప్తంగా మండిపడుతున్నారు.
సోషల్ మీడియాలో విద్యార్థి, యువజన సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు ప్రవళిక కు చెందిన హాల్ టికెట్ ను, ఆమె దరఖాస్తు చేసుకున్న పత్రాలను పోస్ట్ చేసి మంత్రి కేటీఆర్ ను ట్రోల్ చేస్తున్నారు. వాస్తవాలు పరిశీలించకుండా తమ రాజకీయ ప్రయోజనం కోసం యువతి ఆత్మహత్యను తప్పుగా ప్రచారం చేస్తున్నారని, పైగా ఆమెపై అపనిందలు మోపుతున్నారంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒక విధంగా ఈ సంఘటన బీఆర్ఎస్‌ను ఇరుకున పడేసింది.