Medaram Jatara Funds : మేడారం మాస్టర్ ప్లాన్ కు రూ. 251 కోట్ల నిధులు
మేడారం మాస్టర్ ప్లాన్ కోసం రూ. 251 కోట్లు కేటాయించినట్లు మంత్రులు పొంగులేటి, సీతక్కలు తెలిపారు. 90 రోజుల్లో శాశ్వత అభివృద్ధి పనులు పూర్తి చేయనున్నారు.

విధాత, ప్రత్యేక ప్రతినిధి: మేడారంలో అమలు చేస్తున్న మాస్టర్ ప్లాన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 251 కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రులు పొంగులేటి, సీతక్కలు చెప్పారు. రూ. 150 కోట్లు గిరిజన శాఖ నుంచి 101 కోట్లు దేవాదాయ తదితర శాఖల నుంచి వెచ్చిస్తున్నట్లు వివరించారు. వీటితో పాటు మరి కొన్ని నిధులు ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ తదితర శాఖల నుంచి కూడా కేటాయిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి రూ. 251 కోట్లు కేటాయించగా, మాస్టర్ ప్లాన్ అమలుకు ఎన్ని నిధులు అవసరమైనా సీఎం, ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో మంత్రులు పొంగులేటి, సీతక్కలు వచ్చారు. మంత్రులకు జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీష్, ఇతర అధికారులు స్వాగతం పలికారు. ముందుగా మంత్రులిద్దరు వనదేవతలను సందర్శించి, మొక్కులు సమర్పించారు. అనంతరం మేడారంలో సాగుతున్న పనులను అధికారులతో కలిసి మంత్రులు పరిశీలించారు. అనంతరం అభివృద్ధి పై సమీక్షించారు. తదుపరి మీడియాతో మాట్లాడుతూ గత జాతరల మాదిరి నిధులు జంపన్న వాగు వరదలో కొట్టుకపోకుండా ఈ సారి ఏ పని చేసినా శాశ్వత ప్రతిపదికన చేపట్టాలని నిర్ణయించామన్నారు.
ఆదివాసీ సంస్కృతికి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నామని, భక్తుల భద్రత, రక్షణకు పూర్తి ప్రాధాన్యత ఇస్తూ ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. 90 రోజుల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. రాతి కట్టడాలకు కావల్సిన గ్రానైట్ పొరుగు రాష్ట్రాల నుండి తెప్పిస్తున్నామన్నారు. అవసరమైన అన్ని డిజైన్ల రూపొందించే పనులు సాగుతున్నాయని చెప్పారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రహదారుల విస్తరణ, అభివృద్ధి చేపట్టనున్నట్లు, మార్గ మధ్యలో గ్రామాల్లో ఇరుకుగా ఉంటే బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని యోచిస్తున్నామన్నారు. ఆదివాసీల ఆచార, సంప్రదాయాలకు విఘాతం కలుగకుండా నిర్మాణాలు చేపట్టబోతున్నామన్నారు. గత జాతరకు కోటి మంది భక్తులు హాజరైనట్లు అధికారులు అంచనా వేశారని చెప్పారు. ఈ జాతరకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నందున రెట్టింపు భక్తులు వస్తారని భావిస్తున్నట్లు వివరించారు. వచ్చే భక్తులకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పనులు కొనసాగిస్తూనే ఈ మధ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వనదేవతలను దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రులు వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. మంత్రుల రాక సందర్భంగా బందోబస్తు ఏర్పాటు చేశారు.