ఆర్భాటంగా అల్పాహార పథకం.. సరిపడా సరుకులేవి?

  • Publish Date - October 7, 2023 / 12:00 PM IST
  • వంటావార్పుతో భోజన కార్మికుల నిరసన


విధాత ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో ప్రవేశపెట్టిన అల్పాహార పథకం ప్రచార ఆర్బాటం తప్ప, చిత్తశుద్ధి లేదని మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు విమర్శించారు. నిజామాబాద్ జిల్లాకేంద్రంలో ధర్నా చౌక్ వద్ద శనివారం రోడ్లపై వంటావార్పు చేపట్టారు. ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు.



ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మల్యాల గోవర్ధన్ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా వంట చేసే మధ్యాహ్న భోజన కార్మికులందరూ రోడ్లపై సమ్మెలో ఉన్నారన్నారు. ఈ క్రమంలో అల్పాహారాన్ని ఏవిధంగా వండి అట్టహాసంగా పథకాన్ని ప్రారంభించారని నిలదీశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ పథకాన్ని ప్రారంభించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


కాగా.. అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఇళ్లలో నుండి విద్యార్థులు టిఫిన్ బాక్సులు తెచ్చుకొని తింటున్నారని తెలిపారు. అన్నానికే దిక్కులేదు.. అల్పాహారానికి ఎక్కడిదని విద్యార్థులు వాపోతున్న ఘటనలు కనబడుతున్నాయని అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి అల్పాహారానికి సరిపడా సరుకులు, గుడ్లు, ఇతర వస్తువులను సరఫరా చేయాలని, కనీస వేతనం రూ.18 వేలు, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అన్నారు.