విధాత ప్రతినిధి, నిజామాబాద్: మోడీ, రాహుల్ తెలంగాణకు టూరిస్ట్ లాంటి వారని, వారు వచ్చి పోతారే తప్ప చేసే అభివృద్ధి ఏం లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో రూ.26 కోట్ల నిధులతో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి నిప్పులు చెరిగారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం లో తెలంగాణ ఎన్నికల కోసం అక్కడి ప్రభుత్వం తెలంగాణ ట్యాక్స్ వసూలు చేస్తున్నదని, ఆ డబ్బులను ఇక్కడ ఎన్నికల్లో వాడతారని ఆరోపించారు.
కాంగ్రెస్ తప్పుడు సర్వేల పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు పగటి కలలు కంటోందని, 2018 ఎన్నికల్లో ఇలాంటి పగటి కలలు కని బొక్క బోర్ల పడిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఫీజు వసూలు చేస్తున్న కాంగ్రెస్, చివరికి టిక్కెట్లు అమ్ముకుంటున్నారని, ఒక వేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తె రాష్ట్రాన్నే అమ్మేస్తారని పేర్కొన్నారు. రాష్ట్రానికి బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నారో చెప్పాలని నిలదీశారు.
రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే బీఅర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. గతంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, పదేళ్లుగా దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ చేయని పనులను పదేళ్ల కాలంలో బీఅర్ఎస్ ప్రభుత్వం చేసి చూపెట్టిందని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ జుక్కల్ నియోజకవర్గంలో రూ.26 కోట్లతో బిచ్కుంద మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి మంజూరు చేశారని తెలిపారు.
గతంలోనే ఇక్కడ కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసి రోగులకు సేవలు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక డబుల్ ఇంజను సర్కారుగా చెప్పుకుంటున్న మహారాష్ట్ర నాందేడ్ లో మొన్న ఓ సర్కారు దవాఖానలో మందులు, సూదులు లేక 40కి పైగా చిన్నారులు మరణించడం బాధాకరమని, ఇదేనా డబుల్ ఇంజన్ పాలన అని ప్రశ్నించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే, తెలంగాణకు ఒక్కటీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తాము కేసీఆర్ నాయకత్వంలో జిల్లాకు ఒకటి చొప్పున 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, కైలాసం ఆటలో పాము మింగిన విధంగా ఎలా జరుగుతుందో, కాంగ్రెస్ పాలన అలాగే ఉంటుందని, వారు రాష్ట్రాన్ని అమ్మడానికి కూడా వెనుకాడరని విమర్శించారు.