బతుకమ్మతో తెలంగాణ సంస్కృతి విశ్వవ్యాప్తం: మంత్రి జగదీశ్ రెడ్డి
- ఉద్యమంలో ఇంటింటికీ చేరిన పండుగ
- స్వగృహంలో బతుకమ్మ సంబరాల కోలాహలం
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతిబింబమని, ఈ పండుగతోనే తెలంగాణ ఆట, పాట, మాట విశ్వవ్యాపితమైందని సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. ఆడపిల్లలను ‘బతుకు అమ్మా’అని మనసారా ఆశీర్వదించే పండుగ బతుకమ్మగా పేర్కొన్నారు. సూర్యాపేటలోని విద్యానగర్ మంత్రి నివాసంలో శనివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఆడపడుచులతో కలిసి మంత్రి బతుకమ్మను పేర్చి ఆశ్చర్యపరిచారు. తీరొక్క పూలతో ఆడపడుచులు బతుకమ్మను పేర్చారు. వేడుకలకు మంత్రి సతీమణి సునీత, మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణమ్మ, పలువురు మహిళలు హాజరయ్యారు. సునీత జగదీశ్ రెడ్డి బతుకమ్మ పాటలు పాడుతూ అందరినీ ఉత్తేజపరిచారు. బతుకమ్మ పాటలతో మంత్రి నివాసం మార్మోగింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలకు ప్రతిబింబమైన పూలను ఆరాధించడమంటే, వారిని గౌరవించడమే అన్నారు. ప్రపంచంలో ప్రకృతిని ఆరాధించే ఏకైక జాతి తెలంగాణ జాతి అన్నారు. ఇదే సంస్కృతి తెలంగాణ పేరును విశ్వవ్యాప్తం చేసిందన్నారు. మధ్యలో కొంత నిరాదారణకు గురైన బతుకమ్మ పండుగను ఇంటింటికీ చేర్చిన ఘనత తెలంగాణ ఉద్యమానిదే అన్నారు.
రాష్ట్ర సాధనలో ప్రజలను ఏకం చేయడంలో బతుకమ్మ పండుగ ప్రముఖ పాత్ర వహించిందని పేర్కొన్నారు. తొమ్మిది రోజులపాటు వేడుకలు సూర్యాపేటలో అంగరంగ వైభవంగా జరుగుతాయన్నారు. సద్దుల చెరువు ట్యాంకుబండ వద్ద వేలాదిగా ఆడపడుచులు ఒకచోట చేరి సాంప్రదాయం ఉట్టిపడేలా పండుగను నిర్వహిస్తారన్నారు. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉందన్నారు. ఈ సందర్భంగా ఆడపడుచులకు మంత్రి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram