Minister Jupally Krishna Rao | రాష్ట్రంలో పారదర్శక పాలన.. రైతు రుణమాఫీతో నూతన అధ్యాయానికి శ్రీకారం: మంత్రి జూపల్లి

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు పారదర్శక పాలన అందిస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Minister Jupally Krishna Rao | రాష్ట్రంలో పారదర్శక పాలన.. రైతు రుణమాఫీతో నూతన అధ్యాయానికి శ్రీకారం: మంత్రి జూపల్లి

అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందిస్తున్న కాంగ్రెస్ సర్కార్
రైతన్నలకు పెద్ద పీట.. ప్రజలకు అందుబాటులో ఆరు గ్యారంటీ పథకాలు
రైతురుణ మాఫీతో రైతుల అభివృద్ధికి నూతన అధ్యాయానికి శ్రీకారం
అందరి సహకారం తో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధిలో ముందుకు సాగుతాం
స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు

Minister Jupally Krishna Rao | విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు పారదర్శక పాలన అందిస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల (Independence day celebration) సందర్భంగా గురువారం అయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు.

అనంతరం ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం ఆరు గ్యారెంటీ (Six guarantees)లను అమలు చేసేందుకు కంకణం కట్టుకున్నదని పేర్కొన్నారు. ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకంలో 83.33 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు (Free Bus) సౌకర్యాన్ని వినియోగించుకున్నారన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా జిల్లాలో 4 లక్షల 50 వేల గృహాలు నిర్మించనున్నామని, ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

ప్రజా పాలన సేవా కేంద్రాల ఏర్పాటులో భాగంగా జిల్లాలోని పట్టణ ప్రాంతాలలో 10, గ్రామీణ ప్రాంతాలలో 44 ప్రజాపాలన సేవా కేంద్రాలు నడుస్తున్నాయని మంత్రి తెలిపారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం కింద అర్హులైన లక్ష 9వేల 682 మంది లబ్ధి పొందుతున్నారన్నారు. గృహజ్యోతి (Gruha Jyothi) పథకం కింద 1,19,834 మందికి జీరో కరెంట్ బిల్లులు వస్తున్నాయని, ఈ పథకం కింద ప్రభుత్వం 9.02 కోట్ల సబ్సిడీ ఇస్తున్నదని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పరిమితి పెంచడం జరిగిందని, ఈ పథకం కింద 89వేల 497 మంది శస్త్ర చికిత్సలు చేయించుకున్నారని, ఇందుకుగాను ప్రభుత్వం రూ.197.87 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి జూపల్లి వెల్లడించారు.

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా జిల్లాలోని 624 పాఠశాలల్లో పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. జిల్లాలో చదువుతున్న 71 వేల 689 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేశామని ఆయన పేర్కొన్నారు.రైతు రుణమాఫీలో భాగంగా మొదటి విడత 42,291 మంది రైతులకు రూ.232 కోట్లు, రెండవ విడత 22 వేల 148 మంది రైతులకు రూ.218 కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ సంక్షేమం, క్రీడలు, ఎక్సైజ్, రహదారులు శాఖల ద్వారా పలు పథకాల కింద ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయడం జరుగుతున్నదని తెలిపారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన మహోత్సవం, స్వచ్ఛదనం- పచ్చదనం కింద జిల్లాలో అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిదన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ (Mahbub Nagar) జిల్లాను ప్రగతిలో మరింత ముందుకు నడిపించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు అందరూ సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంస పత్రాలను మంత్రి జూపల్లి అందజేశారు.

వివిధ శాఖల అభివృద్ధిని తెలియజేసే విధంగా రూపొందించిన శకటాలు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఆయా శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి సందర్శించారు. ఈ కార్యక్రమం లో మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ, మహబూబ్ నగర్, దేవరకద్ర శాసనసభ్యులు యెన్నం శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డి, కలెక్టర్ విజయేందిర బోయి ,ఎస్పీ జానకి,అదనపు కలెక్టర్ మోహన్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.