Minister Komatireddy | అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి శ్రీకారం
జడ్చర్ల నియోజకవర్గం లో పలు అభివృద్ధి పనులకు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీకారం చుట్టారు. రూ. 56 కోట్ల వ్యయం తో నిర్మించే బాలానగర్ -గంగాపూర్ రెండు లైన్ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు

రూ. 56 కోట్ల వ్యయం తో రెండు లైన్ల రహదారి నిర్మాణం
రూ. 190 కోట్లతో చటాన్ పల్లి ఆర్ఓబి బ్రిడ్జి ని నిర్మాణం
రూ. 5 వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి కృషి
షాద్ నగర్ లో త్వరలోనే ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నిర్మాణం
రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : జడ్చర్ల నియోజకవర్గం లో పలు అభివృద్ధి పనులకు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీకారం చుట్టారు. రూ. 56 కోట్ల వ్యయం తో నిర్మించే బాలానగర్ -గంగాపూర్ రెండు లైన్ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు.త్వరలో ఈ రహదారి పనులు పూర్తి చేస్తామన్నారు. అంతముందు షాద్ నగర్ నియోజకవర్గం లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మంత్రి కి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా షాద్ నగర్ లో చేపట్టే పలు అభివృద్ధి పనుల గురించి మంత్రి వివరించారు. రూ. 190 కోట్ల వ్యయం తో చటాన్ పల్లి ఆర్ఓబి బ్రిడ్జి నిర్మాణం పనులు 15 రోజుల్లో ప్రారంభం చేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.. చటాన్ పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి పూర్తిస్థాయి నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
గతంలో 90 కోట్ల వ్యయం తో నిర్మాణ పనులు చేసేందుకు సిద్ధం చేశారని, కానీ స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చొరవతో భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 190 కోట్లు మంజూరు చేసి 15 రోజుల్లో పూర్తిస్థాయిలో పనులు చేపడతామన్నారు.అదేవిధంగా హైదరాబాద్ నుంచి కర్నూల్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం రూ.ఐదు వేల కోట్ల ఖర్చు తో అంచనాలు రూపొందించబడ్డాయని సంబంధిత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి తో రాష్ట్ర ప్రభుత్వం తరపున మాట్లాడానని మంత్రి తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణం తో రవాణా కోసం మార్గం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తామని తెలిపారు. రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలు మొదలు పెట్టారనీ, మంత్రులు అన్ని నియోజకవర్గాల్లోపర్యటించడం జరుగుతుందన్నారు.
డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాల నియామకాలు చేపట్టి నిరుద్యోగుల భవిష్యత్ కు బంగారు బాట వేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారన్నారు.బీ ఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మితే ప్రయోజనం లేదన్నారు.గత పదేళ్లు గా ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన చేసింది వాళ్లేనని, నిరుద్యోగులు వారి మాటలు నమ్మవద్దన్నారు.త్వరలోనే ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్ నగర్ ఎంపీ డి కె అరుణ , మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ , కలెక్టర్ విజయబోయి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.