కేసీఆర్‌ ముందుచూపుతోనే హైద్రాబాద్‌ విశ్వనగరం: మంత్రి కేటీఆర్‌

  • Publish Date - October 8, 2023 / 12:15 PM IST

విధాత: సీఎం కేసీఆర్‌ సమర్థవంతమైన నాయకత్వంలో ముందుచూపుతో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వల్లే నాలుగు వందల చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరం విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్నది మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆదివారం ట్వీట్టర్‌లో కేటీఆర్‌ చేసిన పోస్టులో ఈ విషయాన్నిపేర్కోన్నారు. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రగతి ప్రస్థానానికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ పతాక శీర్షిక అయ్యిందన్నారు. బీఆరెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న సమగ్రమైన అభివృద్ధి వ్యూహమే హైదరాబాద్‌ నగరం గత తొమ్మిదేళ్లలో దేశంలోని ఏ ఇతర నగరం సాధించనటువంటి ప్రగతి సాధనకు దోహదం చేసిందన్నారు.


బీఆరెస్‌ ప్రభుత్వ సుస్థిర పాలనలో, సులభతర విధానాలతో హైదరాబాద్ విశ్వనగరంగా విస్తరిస్తోందని, మానవ వనరులు, మౌళిక వసతులు అందుబాటులో ఉండటంతో పలు అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తూ, దేశంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా హైదరాబాద్ నగరం ఖ్యాతిని ఆర్జించిందన్నారు. పెట్టుబడులు, రికార్డులు, విజయాలు, స్టార్ట్ అప్ లు ఇలా ఏ విషయంలో చూసినా హైదరాబాద్ తన సత్తా చాటుతూ విశ్వనగరంగా ఎదుగుతున్నదని, రానున్న రోజుల్లో హైద్రాబాద్‌ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు.