Minister Ponguleti Srinivas Reddy | 18 వేల కోట్లతో 22 లక్షలకు పైగా రైతులకు రుణమాఫీ చేశాం: మంత్రి పొంగులేటి
రాష్ట్రంలో రైతులకు 2లక్షల రుణమాఫీలో భాగంగా ఇప్పటివరకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 26రోజుల్లో 18వేల కోట్లతో 22లక్షలకు పైగా రైతులకు రుణమాఫీ చేశామని, మరో 12వేల కోట్ల మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు

మరో 12వేల కోట్లు త్వరలోనే జమ చేస్తాం
2లక్షలపై రుణాలకు త్వరలో కటాఫ్ తేదీ
1కోటి 60లక్షల ఎకరాలకు ఆర్‌వోఆర్ భరోసా
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
Minister Ponguleti Srinivas Reddy | రాష్ట్రంలో రైతులకు 2లక్షల రుణమాఫీ (Runa Mafi)లో భాగంగా ఇప్పటివరకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం (CM Revanth Reddy Govt) 26రోజుల్లో 18వేల కోట్లతో 22లక్షలకు పైగా రైతులకు రుణమాఫీ చేశామని, మరో 12వేల కోట్ల మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం పోయిన అసహనంలో, మళ్లీ ఇప్పటికిప్పుడు అధికారం కావాలన్న దురాశతో రుణమాఫీపై ప్రతిపక్ష బీఆరెస్ పార్టీ (BRS Party) రైతాంగాన్ని రుణమాఫీపై తప్పుదోవ పట్టిస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రూ.7 లక్షల కోట్లు అప్పులు ఉన్నప్పటికీ హామీలు అమలు చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటికి రాష్ట్రం రూ.7.19 లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు. ధనిక రాష్ట్రమని చెప్పి కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు.
“మేం ఇతర ఖర్చులన్నీ తగ్గించుకొని ప్రజలకు రుణమాఫీ చేశామని, ఇప్పటికే 22 లక్షలమంది రైతులకు రూ.2 లక్షల లోపు రుణలు మాఫీ చేశామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా రుణమాఫీ చేశామన్నారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు జమయ్యాయి. మిగిలిన రైతుల ఖాతాల్లో మరో రూ.12 వేల కోట్లు త్వరలోనే వేస్తాం. గత కేసీఆర్ ప్రభుత్వంలా మేం మోసం చేయట్లేదని,. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను రెండుసార్లు మోసం చేసిందన్నారు. రూ. లక్ష రుణమాఫీ విడతల వారీగా చేస్తామని చెప్పి ఐదేళ్లలో కూడా చేయకుండా.. ఎన్నికల ముందు కొందరికే రుణమాఫీ చేసి టాటా బైబై అని చెప్పడం లేదన్నారు.
మేం చేసిన మంచి పనిని కూడా మేం ప్రచారం చేసుకోలేదని, గత ప్రభుత్వంలా ప్రచారం కోసం రూ.వేల కోట్లు వృథా చేయడం లేదన్నారు. 2లక్షలకుపైగా రుణాలున్న రైతులు 2లక్షలపైన మొత్తాన్ని కడితే మిగతా మొత్తం ప్రభుత్వం మాఫీ చేస్తుందని చెప్పామని, రైతులు ఎప్పటిలోగా ఆ మొత్తం కడితే ప్రభుత్వం మాఫీ డబ్బులు వేస్తుందన్నదానిపై కటాఫ్ తేదీ త్వరలోనే ప్రకటిస్తామన్నారు. 19వేల కోట్ల ఒఆర్‌ఆర్‌ను 7వేల కోట్లకు అమ్మేసి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రైతులపై కపట ప్రేమ చూపి అరకొర మాఫీ చేసిందన్నారు. రేషన్ కార్డు ప్రామాణికంగా మేం రుణమాఫీ చేయడం లేదని, నాకు రుణం కాలేదని ఫిర్యాదు చేసిన ప్రతి రైతు సమస్యను పరిష్కరించి రుణమాఫీ చేస్తామన్నారు.
ప్రజల భూములకు భరోసా ఆర్‌వోఆర్ చట్టం
ధరణి పోర్టల్ (Dharani Portal)ను బంగాళాఖాతంలో వేస్తామని మేం పదే పదే చెప్పామని, ప్రజలు ధరణి కావాలా వద్దా అన్న బీఆరెస్ మాటలను నమ్మకుండా కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారన్నారు. ధరణిలో పాత, కొత్త దరఖాస్తులన్నింటిలో న్యాయమైన వాటిని పరిష్కరించి, మిగతా వాటిని కారణాలతో తిరస్కరించామన్నారు. మా ప్రభుత్వం 18 రాష్ట్రాల రెవెన్యూ చట్టాలను అధ్యయనం చేసి.. కొత్త ఆర్‌వోఆర్ చట్టం తీసుకొస్తున్నామని, దేశానికే మోడల్‌గా తెలంగాణ ఆర్‌వోఆర్ (Telangana RoR) నిలుస్తుందన్నారు. రాష్ట్రంలోని 1కోటి 60లక్షల ఎకరాలకు ఆర్‌వోఆర్ భరోసా అని పొంగులేటి స్పష్టం చేశారు. ప్రజలకు కొత్త రేషన్ కార్డులను, హెల్త్ కార్డులను వేర్వేరుగా ఇస్తామని త్వరలోనే ఇందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ స్థాయిలో ఆగిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లను 22వేల కోట్లతో తొలి విడత ఇళ్లను నిర్మిస్తామన్నారు.
పాఠశాలల అభివృద్ధికి ఇప్పటికే 637కోట్లు ఖర్చు చేశామని ప్రతి అసెంబ్లీ నియోజవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంఫ్లెక్స్ నిర్మాణం చేపడుతామన్నారు. హైడ్రా (HYDRA)ను మంచి ఉద్దేశంతోనే తెచ్చామని, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని నిర్మాణాలకు అనుమతించేది లేదన్నారు. అలాంటి కట్టడాలను కూల్చివేస్తున్నామని,. అవన్నీ గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్మాణాలేనన్నారు. హిమయత్ సాగర్ ప్రాంతంలో ఎఫ్‌టీఎల్ పరిధిలో నా ఫామ్ హౌజ్ ఉందని బీఆరెస్ మీడియా బురద జల్లుతోందన్నారు. కేటీఆర్, హరీశ్‌రావులకు నేను సవాల్ చేస్తున్నానని, ఇల్లు అక్రమంగా ఉంటే.. వెంటనే కూల్చివేయాలని హైడ్రా కమీషనర్‌ను ఆదేశిస్తున్నానని, మా అధికారులకు బదులు మీరే వెళ్లి కొలచి అక్రమమైతే కూల్చేయండి” అని పొంగులేటి తేల్చి చెప్పారు.