ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచే నాయకుడు దామోదర్ రెడ్డి: మంత్రి పొంగులేటి
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతిపట్ల తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు
హైదరాబాద్, అక్టోబర్ 02(విధాత ప్రతినిధి) : మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతిపట్ల తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. ప్రజా ప్రతినిధిగా మాత్రమే కాకుండా, ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడని ఆయన అన్నారు. ఐటీ శాఖ మంత్రిగా దూరదృష్టితో పనిచేసి, తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్‌లో ఆ రంగ అభివృద్ధికి బలమైన పునాది వేశారని తెలిపారు. యువతకు అవకాశాలు కల్పించడంలో దామోదర్ రెడ్డి పాత్ర స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ధైర్యం, రాజకీయ దూరదృష్టి, నిస్వార్థ సేవలు ఆయన రాజకీయ జీవనంలో ప్రధాన లక్షణాలు అని తెలిపారు. ప్రజలతో కలిసిమెలిసి జీవిస్తూ వారికోసమే పనిచేయడం ఆయన వ్యక్తిత్వానికి ప్రత్యేకత అని మంత్రి పొంగులేటి అభిప్రాయపడ్డారు. దామోదర్ రెడ్డి ఆకస్మిక మరణం కాంగ్రెస్‌కే కాకుండా తెలంగాణ రాజకీయాలకు కూడా భరించలేని లోటని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తిదాయకమైన జీవితం, ప్రజాసేవ పంథా భవిష్యత్ తరాలకు మార్గదర్శకమని అన్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ… ఈ క్లిష్ట సమయంలో భగవంతుడు వారికి ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నానని మంత్రి పొంగులేటి తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram