Rythu Bandhu | అనర్హుల జేబుల్లోకి రూ. 500 కోట్లు..! రైతుబంధుపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
Rythu Bandhu | రైతుబంధుపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న హైదరాబాద్‌లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన రైతుబంధు( Rythu Bandhu ) అంశాన్ని ప్రస్తావించారు.

Rythu Bandhu | హైదరాబాద్ : రైతుబంధుపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న హైదరాబాద్‌లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన రైతుబంధు( Rythu Bandhu ) అంశాన్ని ప్రస్తావించారు. రైతుభరోసా( Rythu Bharosa ) పై అభిప్రాయ సేకరణ ఖమ్మం నుంచి మొదలుపెడుతున్నాం. గతంలో జాతీయ రహదారులకు, ప్రభుత్వం వివిధ ప్రాజెక్టుల కింద సేకరించిన భూములకు, నాలా కన్వర్షన్ పూర్తయిన వాటికీ రైతుబంధు ఇచ్చారు. ఈ సారి అలా జరుగకుండా చూస్తాం. ఇలా ఏటా రూ.500 కోట్లకుపైనే అనర్హుల జేబులోకి వెళ్లాయని మంత్రి తెలిపారు.
భూముల విలువ సవరణ 2011లో శాస్త్రీయంగా జరిగింది. 2022లో గంపగుత్తగా పెంచారే తప్ప, శాస్త్రీయంగా జరగలేదు. ఈసారి సర్వే నంబర్లవారీగా ప్రతిపాదనలు తీసుకుంటున్నాం. కసరత్తు ఎపుడు పూర్తవుతుందో కచ్చితంగా చెప్పలేను అని రెవెన్యూ మంత్రి చెప్పారు. ఎల్‌ఆర్‌ఎస్‌ను క్లియర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. జీవో 59 కింద అనేక అక్రమాలు జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. అందుకే హోల్డ్‌లో పెట్టాం. 100 గజాలలోపు వాటికి రిజిస్ట్రేషన్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. స్టాంపులు రిజిస్ట్రేషన్లలో వచ్చే ఆదాయంలో 80 శాతం 36 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి వస్తున్నది. కార్పొరేట్ కంపెనీల సీఎస్‌ఆర్ నిధులతో ఆయా ఎస్సార్వో భవనాలు నిర్మించి, నిర్వహణ సైతం అప్పగిస్తాం అని మంత్రి పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇండ్లపై అధ్యయనం కోసం ఇప్పటికే యూపీ, ఏపీకి అధికారులు వెళ్లి వచ్చారు. మరో మూడు రాష్ట్రాల పర్యటనకు వెళ్లారు. వచ్చిన తర్వాత సమర్పించే నివేదికలను పరిశీలించి, తుది నిర్ణయం తీసుకుంటాం. డబుల్ బెడ్రూం ఇండ్లలో తక్కువ ఖర్చుతో అయ్యేవాటిని పూర్తి చేసి, నిరుపేదలకు అందిస్తాం. రాజీవ్ స్వగృహ ఇండ్లకు సంబంధించి ధరలను సమీక్షించేందుకు ఇటీవలే కమిటీ వేశాం. నివేదిక తర్వాత ధరల సవరణ, వేలంపై నిర్ణయం తీసుకుంటాం. హౌజింగ్ బోర్డు కాలనీలను ఏర్పాటు చేయడంపై ఆలోచన చేస్తామన్నారు.
మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు ఇచ్చామని చెప్పారు. కానీ.. ఇటీవల మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించగా 30-35 శాతం ఇండ్లకు నీళ్లు అందడం లేదని తేలింది. బడ్జెట్‌లోనే పెంచిన పెన్షన్ అమలు చేసే అవకాశం ఉంది. పెన్షన్ల లబ్ధిదారులను సైతం ఓసారి పరిశీలించాలి. ప్రభుత్వాన్ని కూల్చుతాం అని బీఆర్‌ఎస్ నేతలు పదే పదే అన్నారు. ఇది అప్రజాస్వామికం. ప్రభుత్వం సుస్థిరంగా ఉందనే భావన వచ్చే వరకు చేరికలు కొనసాగుతాయి. శ్రావణపల్లి గనిలో బొగ్గు నాణ్యత తక్కువగా ఉన్నదని నివేదికలు అందుతున్నాయి. అందుకే ఆలోచిస్తున్నాం అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.