మేడారం జాతరను సక్సెస్ చేద్దాం

కోటి మందితో కొలువుదీరనున్న మేడారం జాతరను సమష్టిగా కృషిచేసి విజయవంతం చేయాల్సిన అవసరం అందరిపై ఉందని రాష్ట్ర పంచాయతీ రాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు

మేడారం జాతరను సక్సెస్ చేద్దాం

– రూ.75 కోట్ల నిధులు విడుదల

– పనులు సత్వరం పూర్తి చేయాలి

– మంత్రి దనసరి అనసూయ సీతక్క

– మేడారంలో అధికారులతో సమీక్ష

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కోటి మందితో కొలువుదీరనున్న మేడారం జాతరను సమష్టిగా కృషిచేసి విజయవంతం చేయాల్సిన అవసరం అందరిపై ఉందని రాష్ట్ర పంచాయతీ రాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఆదివారం ఆమె మేడారం సమ్మక్క, సారలమ్మ వన దేవతలను దర్శించుకొని తల్లులకు ఎత్తు బంగారం చెల్లించారు. అనంతరం మేడారం జాతర-2024 పైన జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మేడారం జాతరకు రూ.75 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.



 



భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పెద్దఎత్తున భక్తులు వచ్చే మేడారం జాతర విజయవంతం చేద్దామన్నారు. జాతర పనులు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రెండు నెలల సమయం మాత్రమే ఉన్నందున, భక్తులకు అవసరమైన పనులు సకాలంలో పూర్తిచేసి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మేడారంలో పోలీస్ కమాండ్ రూమ్, కంట్రోల్ రూమ్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ మాలోత్ కవిత, ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.