ములుగు అభివృద్ధే నా లక్ష్యం

ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు

ములుగు అభివృద్ధే నా లక్ష్యం

– మారుమూల ప్రాంతాలకు ప్రాధాన్యత

– నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటా

– మంత్రి సీతక్క.. ములుగులో ఘన స్వాగతం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్ర నూతన మంత్రిగా పదవీ బాధ్యత చేపట్టి, మొదటిసారిగా ఆదివారం స్వంత నియోజకవర్గం ములుగు చేరుకున్న సందర్భంగా ఆమెకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఈసందర్భంగా సీతక్క మాట్లాడుతూ ములుగు నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని నేను ఎప్పుడూ మరిచిపోలేనని అన్నారు. నన్ను అత్యంత మెజారిటీతో గెలిపించి, అత్యున్నత హోదా అందించి మంత్రిని చేసిన ప్రజలందరికి నా ధన్యవాదాలు తెలియజేశారు. ములుగు ప్రజలందరికీ నేను రుణపడి ఉన్నానని, నామీద మీరు ప్రదర్శించే అభిమానం నాకు ఆస్తులని అన్నారు. వెనుకబడిన ప్రాంతమైన ములుగు నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించడంతోపాటు ములుగు నియోజకవర్గ అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యతనిస్తానని ప్రకటించారు.

ఆత్మకూరు-జాకారం మధ్య భారీ ర్యాలీ

రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పదవీ బాధ్యత చేపట్టి మొదటిసారిగా స్వంత నియోజకవర్గం చేరుకున్న సీతక్కకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆత్మకూరు నుండి జాకారం వరకు భారీ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా సీతక్కను గజమాలతో సత్కరించారు. ములుగు జిల్లాలోని మహమ్మద్ గౌస్ పల్లి, మల్లంపల్లి, పందికుంట, జాకారం గ్రామంలో ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు, అడుగడుగునా బ్రహ్మరథం పట్టి, గజమాలలు, పూలమాలలతో సత్కరించారు. నృత్యాలు, ఆటపాటలతో అత్యంత కోలాహలంగా భారీర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.