Minister Tummala | రెండవ విడత రైతు రుణమాఫీకి ప్రభుత్వం సిద్ధం: మంత్రి తుమ్మల

రెండవ విడత పంట రుణమాఫీ సాధ్యమైనంత త్వరగా అమలు చేయుటకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు

Minister Tummala | రెండవ విడత రైతు రుణమాఫీకి ప్రభుత్వం సిద్ధం: మంత్రి తుమ్మల

తొలి విడతలో 11.50 లక్షల కుటుంబాలకు 6098.94 కోట్ల మాఫీ
సాంకేతిక సమస్యలుంటే సరిచేసి ఖాతాల్లోకి నిధులు

విధాత, హైదరాబాద్ : రెండవ విడత పంట రుణమాఫీ సాధ్యమైనంత త్వరగా అమలు చేయుటకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రుణమాఫీ 2024లో మొదటి విడతగా రూ.లక్ష లోపు రుణాలకు సంబంధించి 11.50 లక్షల కుటుంబాలకు 6098.94 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. వీటిలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి అందిన సమాచారం మేరకు 11.32 లక్షల కుటుంబాలకు 6014 కోట్ల రూపాయలు జమ కావడం జరిగిందని, కొన్ని సాంకేతిక కారణాలతో 17,877 ఖాతాలకు చెందిన 84.94 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో జమ కాలేదన్నారు.

ఆర్‌బీఐ వారు సూచించిన వివరాల ప్రకారం అట్టి రైతుల ఖాతాలలో పేర్కొన్న సాంకేతిక సమస్యలను సరిచేసి, ఆర్‌బీఐ నుంచి నిధులు వెనక్కి రాగానే తిరిగి ఆయా ఖాతాలకు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వాణిజ్య బ్యాంకులకు అనుసంధానం చేయబడిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (సీడెడ్ సంఘాలు)కు సంబంధించి మిగిలిన 15,781 రుణఖాతాల తనిఖీ నేటితో పూర్తవుతుందని, పూర్తయిన వెంటనే ఆ ఖాతాలకు కూడా రుణమాఫీ నిధులు విడుదల చేయడం జరుగుతుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.