నీటిపారుదల శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి ఉత్తమ్

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపద్యంలో నీటిపారుదల శాఖాధికారులు ఇంజినీరింగ్ విభాగం అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.

నీటిపారుదల శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, ఆగస్ట్ 27(విధాత): రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపద్యంలో నీటిపారుదల శాఖాధికారులు ఇంజినీరింగ్ విభాగం అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. భారీ, అతి భారీ వర్షాలకు సంభవిస్తున్న వరదలతో ప్రజల ప్రాణాలు కాపాడడంతో పాటు ఎటువంటి ఆస్తి నష్టం వాటిళ్లకుండా ముందస్తు బందోబస్తు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం గాంధీభవన్ లో మీడియా తో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ అనంతరం నీటిపారుదల శాఖా ఇంజినీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. వరద నివారణ చర్యలు చేపట్టేందుకు యుద్ద ప్రాతిపదికన అధికారులు రంగంలోకి దిగాలన్నారు. 24 గంటలు జలాశయాలను పర్యవేక్షించడంతో పాటు కాలువలు,చెరువులకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గండ్లు ఇతరత్రా నష్టం వాటిల్లితే ఉపేక్షించకుండా జీ.ఓ నెంబర్ 45 కింద అత్యవసర నిధులను వినియోగించి నష్ట నివారణ చర్యలు చేపట్టాలన్నారు. నీటి పారుదల శాఖాధికారులు రౌండ్ ది క్లాక్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఉపద్రవం మంచు కొస్తుందని భావించిన పక్షంలో సత్వరమే కంట్రోల్ రూమ్ లను అప్రమత్తం చేయాలన్నారు.

ప్రాథమికంగా నష్టనివారణ చర్యలు చేపట్టాలిసి వస్తే అందుకు అవసరమైన ఇసుక బస్తాలు ఇతరత్రా సామగ్రిని అందుబాటులో ఉంచుకోవలన్నారు. జలాశయాలతో పాటు పంప్ హౌజ్ ల నిర్వహణలో ఇంజినీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. నీటి నిలువలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. వరదల నుండి కాపాడుకోవడం తో పాటు నీటి వనరుల పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన్యాతాంశంగా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన ఉద్బోధించారు. అందుకు గాను నీటిపారుదల శాఖాధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లతో పాటు రెవిన్యూ,విద్యుత్ ఇతర విభగాల అధికారులను సమన్వయం చేసుకోవాలన్నారు .

ప్రధానంగా కామారెడ్డి, మెదక్ వంటి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపద్యంలో ఆయా జిల్లాల అధికారులను ఆయన అప్రమత్తం చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అన్ని విభాగాల అధికారులను రంగంలోకి దించిన నేపథ్యంలో నీటిపారుదల శాఖాధికారులు తాజాగా కురుస్తున్న భారీ వర్షాల నేపద్యంలో ఎటువంటి విపత్తులు సంభవించకుండా కట్టడి చేయాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు.

కామారెడ్డి నుండి అందుతున్న సమాచారం మేరకు నిజాం సాగర్ కు ఇప్పటికే 1.52 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుండగా అదనంగా మరో 86 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తున్నందున అక్కడి జలాశయ పరిస్థితి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలన్నారు.ఇప్పటి వరకు నమోదు అయిన వర్షపాతం ప్రకారం కామారెడ్డి,మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలన్నారు. కృష్ణా,గోదావరి బేసిన్ లలో నీటి నిల్వల పరిస్థితిలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పూర్తి స్థాయిలో నీటి మట్టాలు చేరే సమాచారాన్ని ఇంజినీరింగ్ అధికారులు గుర్తించాలన్నారు.

ప్రధాన జలాశయాలలో పంపులు పూర్తి స్థాయి సామర్ధ్యంతో పనిచేస్తున్నాయో లేదో అన్న విషయాన్ని సమీక్షించుకుని అవసరమైతే అదనపు పంపింగ్ తో నీటి మట్టాలను సమర్థవంతంగా నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ విషయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ అవసరం ఉన్నంత మేరకు నీటిని నింపాలన్నారు.ఎడమ కాలువ నుండి విడుదల అవుతున్న నీరు వృధాగా సముద్రం పాలు కాకుండా చూడాలని చెప్పారు.

గోదావరి బేసిన్ లోని శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు ప్రాజెక్టుల పనితీరును ఆయన ఈ సందర్భంగా సమీక్షించారు. అన్నపూర్ణ, రంగనాయక సాగర్,మల్లన్న సాగర్ లలో పంపింగ్ ను వేగవంతం చేసి పూర్తి స్థాయిలో నీటి మట్టాలు నిండేలా చూడాలన్నారు. అదే సమయంలో పంపింగ్ నిర్వహణలో ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా చూసుకునేందుకు గాను విద్యుత్ శాఖాధికారులను సమన్వయం చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు.